ఏమో స్వామి

నేను ముచ్చివోలు లో ఉండగా అప్పుడప్పుడూ మా ఊరికి ఓ విచిత్రమైన సాధువు వచ్చేవాడు. ఆయన ఎప్పుడూ ఒక్క చోట ఉండేవాడు కాదు. ఎంత దూరమైనా కాలినడకనే రోడ్ల వెంబడి తిరుగుతుండే వాడు. ఆయన్ను గదిలో వేసి బంధించి తాళం వేసినా, వేసిన తాళం వేసినట్టు ఉండగానే బయటకు వచ్చేస్తాడని విన్నాను. తైల సంస్కారం లేని జుట్టు, బాగా పొడుగ్గా పెరిగిన గోళ్ళు, ఎప్పుడు స్నానం చేశాడో తెలియని శరీరం… ఇదీ ఆయన రూపం.

ఎంత ఎండకైనా, వానకైనా మొలకు చుట్టుకున్న బట్టతో, మిట్ట మధ్యాహ్నం ఎండకు కూడా కాళ్ళకు చెప్పుల్లేకుండా తిరుగుతూనే ఉంటాడు. ఆయన మొహంలో అదో రకమైన తేజస్సు కనిపిస్తుండేది. ఆయన రోడ్లో వెళుతుంటే కచ్చితంగా అందరి కళ్ళూ ఆయనపైనే కేంద్రీకృతమయ్యేవి. కానీ ఎంతమంది ఎన్ని ప్రశ్నలడిగినా ఆయన నోరు తెరిస్తే మాట్లాడేది ఒకే ఒక మాట. ఏమో స్వామీ అని. ఏ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం. అందుకనే ఆయన్ను ఏమో స్వామి అనే పిలిచే వాళ్ళం.

ఎవరైనా పిలిచి భోజనం పెడితే మాత్రం తినేసి వెళ్ళిపోయేవాడు. ఒక సారి మా ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టాము. మా అమ్మమ్మ నన్ను ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోమంది. నేను దగ్గరకు వెళ్ళగానే తల మీద చేయిపెట్టి వెళ్ళిపోయాడు అంతే. నా చదువు కోసం శ్రీకాళహస్తికి వచ్చేయడంతో మళ్ళీ ఆయన్ను చూడలేకపోయాను.ఇప్పుడు మళ్ళీ ఊరికి వస్తున్నాడో లేదో తెలియదు.

*ఆలోచన తరంగాలు బ్లాగులో రాసిన టపా స్పూర్తిగా