ఎర్ర బస్సు పరిస్థితేంటి?

మా ఊరికి ఎర్ర బస్సులో వెళ్ళి చాలా రోజులైంది. అసలు ఎర్రబస్సు కనబడటమే మానేసిందీ మధ్య.అవును మరి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సెవెన్ సీటర్ ఆటోలు ఎర్రబస్సులను మసకబార్చేస్తున్నాయి. ఇందుకు కారణాలేమిటి అని అన్వేషిస్తే …


జరిగినంతకాలం జరగనీలే అని రవాణా శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం ఒకటి. మారిన ప్రజల అవసరాలకనుగుణంగా మనమూ మారదామన్న ఆలోచన వారిలో కలుగుతున్నట్లు రవ్వంతైనా కనిపించదు. అవసరానికి బస్సులు దొరకనప్పుడు ప్రజలు వాటిని దూరంగా ఉంచటంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఏ అమావాస్యకో పౌర్ణమికో తిరిగే బస్సుల్లో ప్రయాణికుల సాంద్రత తగ్గడం విశేషమేమీ కాదు. నష్టాల సాకుతో ఉన్న సర్వీసులను కూడా నిలిపివేస్తుండటంతో జనాలు క్రిక్కిరిసి ఉన్న ఆటోల్లో వ్రేళ్ళాడుతూ వెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఎన్నో ప్రమాదాలు జరిగినా ప్రజల్లో వీటిమీద అవగాహన రావడంలేదు.

గేదెలు,ఆవులు వట్టిపోయింతర్వాత కబేళాకు తోలేసినట్లుగా పట్టణాల్లో ఉన్న మంచి రోడ్ల మీద బాగా వాడేసి డొక్కువయింతర్వాత వాటిని అసలే అంతంతమాత్రంగా ఉన్న గ్రామీణ ప్రాంతపు రోడ్ల మీద వదిలితే అవి ఏ మాత్రం నడుస్తాయో మనకు తెలుసు. వాటి నిర్వహణా భాద్యత తలకు మించిన భారమౌతోంది. ఇక వాటిలో అత్తెసరు ప్రయాణికుల్ని బట్వాడా చేస్తూ ఆదాయాన్ని ఎలా ఆర్జించానుకుంటున్నారో నాకు అంతుపట్టని ప్రశ్న. ఇకనైనా ఆర్టీసీ వాళ్ళు కళ్ళు తెరవకపోతే తరువాతి తరం వారికి ఎర్రబస్సు చరిత్రగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

పాపం ఉత్తరప్రదేశ్ ప్రజలు

ఉత్తర ప్రదేశ్ జనాల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పక్క ములయాం.. ఓ పక్క మాయావతి.. దొందూ దొందే… ఎవర్ని ఎన్నుకున్నా తీరు మారదాయే..

ఒక్క పదిరుపాయల కోసం క్యూల్లో నిలబడి తొక్కిసలాటలో జనాలు చచ్చిపోతుంటే ఈవిడకు మాత్రం నోట్లతో కోట్ల రూపాయల దండలు కావాలసివచ్చాయట.. ఔరా! ఎంత దౌర్బాగ్యం పట్టిందిరా మన దేశానికి…

మన దేశం డబ్బుండీ పేద దేశం అయింది ఎందుకంటే ఇలాంటి చీడ పురుగుల వల్లే..డబ్బును ఇనప్పెట్టెలో పెట్టి పూజ చేసుకుని పీనాసి పీనుగుల వల్లనే..

ఓ పక్క ఆకలితో అన్నమో రామచంద్రా అని జనం అల్లాడుతుంటే ఈమెమో కోట్లు బెట్టి విగ్రహాలు పెట్టిస్తుందట..
“ఎవడిక్కావాలండీ ఈ విగ్రహాలు.. కూడు పెడతాయా? గుడ్డ పెడతాయా? ” అని నాయకులను నిలదీసి సాగనంపే రోజు వస్తుందా?

ఈ నెల బ్లాగర్ల సమావేశం

హాజరైన వారు: సీబీ రావు గారు, నేను, చక్రవర్తి గారు, అరిపిరాల సత్యప్రసాద్ గారు.

ఒకరోజు సెలవు పెడితే నాలుగు రోజులు స్వస్థలంలో గడిపిరావచ్చనుకున్నారేమో చాలా మంది సమావేశానికి హాజరు కాలేదు. (బాబూ, మీరామాట చెప్పుంటే నేను కూడా ఎంచక్కా ఊరికి చెక్కేసుండే వాణ్ణి కదా! 🙂 )

హాజరైంది నలుగురమే.. కానీ మంచి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సత్యప్రసాద్ గారు ఇ-తెలుగు సభ్యులుగా చేరారు. ఇ-తెలుగు ద్వారా ఏమేం చేయవచ్చో కొన్ని సూచనలు కూడా చేశారు.

మైక్రోఫైనాన్స్ లో పనిచేస్తున్న అరిపిరాల గారు దాని గురించి మాకు చక్కటి విషయాలు తెలియజేశారు. ఇంకా కథా సాహిత్యం గురించి, కథలెలా రాయాలి ఇత్యాది విషయాల గురించి మాట్లాడుకున్నాం.

ఆహా.. ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి

ఇంటి దగ్గర ఉన్నపుడైతే మామిడి పిందెలు, వేపపూత సేకరించే బాధ్యత నాది. పచ్చడి తయారు చేసే బాధ్యత మా అమ్మది. ఇక్కడ హైదరాబాదులో సెలవురోజుల్లో అలవాటు ప్రకారం ఆలస్యంగా నిద్ర లేచి బద్దకంగా స్నానం చేసి ఉగాది పచ్చడి కోసం గుడికైనా వెళ్దామనుకుంటున్నా. ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. తలుపు తీసి చూస్తే స్వయానా మా ఇంటి యజమాని చేతిలో పైన చూపించిన పచ్చడి పట్టుకుని నిల్చున్నాడు. అది చూడగానే ప్రాణం లేచి వచ్చింది. నోరూరింది. ఏంటి? ఫోటో చూసి మీకూ నోరూరుతుందా? అయితే ఎంచక్కా ఉగాది పచ్చడి ఆరగించేయండి… శుభం…

అందరికి వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

నిజమైన వేదాంతి

ప్రస్తుతం బ్యాంకులు దివాళా తీయడం సర్వ సాధారణమైపోయింది. స్వామి వివేకానంద తనకు ఎదురైన ఒక అనుభవాన్ని గురించి ఇలా తెలియజేశారు.

అది 1896 సంవత్సరం. స్వామీజీ ప్యారిస్ లో ఉన్నారు. మాటలు కలిపి స్నేహితుల్ని చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా స్వామీజీ వదిలిపెట్టేవారు కాదు. అలాగా ఆయనకు ఎంతో మందితో పరిచయం కలిగింది. వీళ్ళలో ప్యారిస్ లో నివసించే ఇటాలియన్ దొరసాని(డచెస్) ఒకరు. స్వామీజీ ఆమె ఆశ్రయంలో కొద్ది కాలం పాటు ఉన్నారు.

ఆమె ఒక రోజు  స్వామీజీకి ప్రశాంతంగా ఉంటుందని పట్టణంలో దూరంగా ఉన్న ఒక పేటలోకి తీసుకుని వెళుతున్నారు. అందుకోసం చోదకునితో సహా ఓ టాంగా కూడా మాట్లాడుకున్నారు. స్వామీజీ స్వతహాగా విదేశీ భాషలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించేవాడు. అలా కొంచెం ఫ్రెంచి భాష కూడా నేర్చుకున్నాడు. అంతకు ముందు అవసరమైనప్పుడల్లా వస్తుండటం వల్ల ఆ టాంగా చోదకుడు ఆ దొరసానికి ముందస్తుగా పరిచయమే.

ఆమె స్వామీజీ వైపు తిరిగి ఇంగ్లీషులో “ఇతను స్వచ్ఛమైన ఫ్రెంచ్ మాట్లాడగలడు తెలుసా!” అంది. అప్పట్లో డ్రైవర్లకు అలా తెలియడం కొంచె ఆశ్చర్యకరమైన విషయమే.

ఈ సంభాషణ ఇలా సాగుతుండగా వారి బండి ఒక గ్రామం పక్కగా వెళుతోంది. ఆ గ్రామంలో ఒక కుటుంబంలోని పరిచారిక ఒక చిన్న బాలుణ్ణి, బాలికను బయటకు తోడ్కొని వస్తోంది. డ్రైవర్ బండి ఆపి కిందకు దిగి ఆ పిల్లను తన ఒడిలోకి తీసుకొని ప్రేమగా నిమిరి, కాసేపు మాట్లాడి తిరిగి వచ్చి బండెక్కాడు.

ఇది కొంచెం అనూహ్యమైన సంఘటనే. ఎందుకంటే  ఆరోజుల్లో 19 వ శతాబ్దం వర్గ విభేదాలు  చాలా బలంగా ఉండేవి. పిల్లలను చూస్తే ఉన్నత స్థాయికి చెందిన వారిగా కనిపిస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళు అద్దెకు కుదుర్చుకున్న డ్రైవర్ వాళ్ళను బాగా తెలిసినట్లుగా ముద్దు చేస్తున్నాడు. ఆ దొరసాని ఒక్కసారిగా విభ్రాంతికి గురై “ఎందుకలా చేశావు?” అని అడిగింది.

అతడు వెంటనే ఆమె వైపు తిరిగి “వాళ్ళు నా పిల్లలే. మీరు ప్యారిస్ లో పలానా బ్యాంకు గురించి విన్నారా?”అని అడిగాడు.

ఆమె తెలుసన్నట్లుగా తల ఊపి “అవును అది చాలా పెద్ద బ్యాంక్. కానీ ఈ మధ్యనే దివాళా తీసిందని విన్నాను.” అంది.

వెంటనే అతను అందుకుని “ఆ బ్యాంకు మేనేజర్ని నేనే. దాని వైఫల్యంలో నాకూ భాగస్వామ్యం ఉంది. దాని అప్పులు తిరిగి తీర్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నేనిప్పుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకుని ఉన్నాను. నా భార్యా పిల్లల్ని  ఆ గ్రామంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంచాను. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఒక పరిచారిక మాత్రమే ఉంది. నాకు ఉన్నంతలో ఈ బండిని కొనుక్కుని ఇలా అద్దెకు తిప్పుతుంటాను. ఇందులో వచ్చిన ఆదాయంతో నాకుటుంబాన్ని పోషిస్తున్నాను.కానీ నా అప్పు తీరిపోగానే మళ్ళీ బ్యాంకును పునఃప్రారంభిస్తాను” అన్నాడు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో.

అతని కథ స్వామీజీకి ఎంతో ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. ఇతని గురించి స్వామీజీ తన శిష్యులకు చెబుతూ ఇలా అనేవాడు.

“అతను నిజమైన వేదాంతి. అతను వేదాంతాన్ని అర్థం చేసుకున్నట్లే లెక్క. అంతమంచి స్థాయి నుంచి అధఃపాతాళానికి పడిపోయినా అతని ఆత్మవిశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదర్లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అతని మానసిక స్థైర్యం చాలా గొప్పది” అంటూ ప్రశంసించేవాడు.

ఇదే ఆఖరి రోజు

రంగా ఓ రోజు బార్ లోకి వెళ్ళి బేరర్‌తో

“మీ దగ్గర మాంఛి కిక్కిచ్చే మందు ఏదుంటే అది ఓ పెగ్గు కొట్టు” అన్నాడు.


ఒక పెగ్గు పోసి ఇవ్వగానే గట గటా తాగేసి రెండో పెగ్ ఇవ్వమన్నాడు. ఇచ్చారు. మళ్ళీ ఒక్క గుక్కలో దాన్ని తాగేసి మూడో పెగ్ ఇమ్మన్నాడు. ఇలా వరుసగా ఐదారు పెగ్గులు లాగించేశాడు.


ఇక అలాగే ఇస్తే అక్కడే పడిపోతాడని ఆ బేరర్ ఇంక చాలన్నాడు.

అతనికి మళ్ళీ డౌటొచ్చి…


“ఇంతకీ ఏమైంది సార్! పెగ్గు మీద పెగ్గేసేస్తున్నారు….భార్యతో ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? ”  అడిగాడు బేరర్.

“అవునయ్యా… నా భార్య నాతో గొడవపడి  నెల రోజుల దాకా మాట్లాడనంది.”

“అవును… ఐతే ఏంటిప్పుడు.. దానికి తెగ బాధపడిపోవాలా?”

“బాధ పడక ఏంచేయమంటావ్ రా బాబూ.. ఇదే ఆఖరి రోజు!!!”

మనకెందుకింత మొహమాటం?

శ్రీశైలం ఆనకట్ట దగ్గర విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే యంత్రం ఒకటి పని చేయడం మొరాయించింది. మన దేశానికి చెందిన ఇంజనీర్లు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాంతో ఆ యంత్రాన్ని సప్లయ్ చేసిన జర్మనీ నుంచి నిపుణులని రప్పించాల్సి వచ్చింది.

వాళ్ళు వచ్చీ రాగానే పని ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సమస్య ఎక్కడో కనిపెట్టారు. దానికి పరిష్కార మార్గం కూడా సూచించారు. ఆ సమస్యాత్మక ప్రదేశం దగ్గరికి వెళ్ళాలంటే మొలలోతు బురద నీళ్ళు దాటి వెళ్ళాలి. నీట్ గా డ్రెస్ చేసుకొచ్చిన మన ఇంజనీర్లు అక్కడికి వెళ్ళమనగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. పని వాళ్ళనెవరినైనా వెళ్ళమని పురమాయిస్తున్నారు.

వీళ్ళతో అయ్యేపని కాదనుకున్న ఆ జర్మన్ ఇంజనీర్లు గబాగబా సూటూ బూటూ విప్పి పక్కన పడేసి బురద నీళ్ళను దాటుకుంటూ వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చేశారు. పని ఎలాంటిదైనా దాని పట్ల వారు చూపించే చొరవ, గౌరవం మనం పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాలేమో.. అనిపిస్తుంది నాకు.