అతిపెద్ద నిధి

చాలా కాలం క్రిందట టర్కీ దేశం లోని ఇస్తాంబుల్ లో ఒక యువకుడు నివసించేవాడు. అతను చాలా పేదవాడు. ఒక చిన్న గది, కొన్ని పుస్తకాలు, పడుకోవడానికి ఓ మూలగా చిన్న మంచం… ఇవీ అతని సామాగ్రి. ఒక రోజు రాత్రి అతనికి ఒక చిత్రమైన కల వచ్చింది.

ఆ కలలో అతను ఈజిప్టు లోని కైరో నగరంలో  వీధుల వెంట నడుస్తూ వెళుతున్నాడు. అంతకు ముందెప్పుడూ ఆ ప్రాంతాన్ని చూసినట్టు కూడా లేదు. ఆ వీధి పేరు, ఇళ్ళు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆ కలలోనే అతను ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ విలాసాన్ని రాసుకున్నాడు.దాని ద్వారాలు తెరిచే ఉన్నాయి. నెమ్మదిగా లోనికి ప్రవేశించాడు. . అక్కడ్నుంచి ఒక గది కనిపిస్తూ ఉంది. ఆ గదిలో ఒక వృద్ధుడు, అతని చుట్టూ అతను జీవితంలో ఎన్నడూ చూడని నిధి నిక్షేపాలు గోచరమవుతున్నాయి.

వజ్రాలు, మణులు, మరకత మాణిక్యాలు, కెంపులు గుట్ట గుట్టలుగా పోసి ఉన్నాయి.టన్నుల కొద్దీ బంగారం, వెండీ గోడల వెంబడి పేర్చబడి ఉంది. ప్రపంచంలోనే అపురూపమైన కళాఖండాలు, అబ్బురపరిచే తివాసీలతో శోభాయమానంగా ఉందా భవనం. అతను ఆ సంపదల వంక, ఆ వృద్ధుడి వైపు అలా కనులప్పగించి చూస్తూ ఉన్నాడు. ఎందుకో అతనికి మనసులో ఆ సంపదంతా తనదే అనిపిస్తుంది .

అతను ఉలిక్కిపడి మేలుకున్నాడు. ఆ కల నిజమవుతుందని అతనికి అపారమైన విశ్వాసం. వెంటనే దాని కోసం ఆ రోజునే కైరోకి పయనమయ్యాడు. ఇస్తాంబుల్ నుంచి కైరోకి సుధీర్ఘమైన ప్రయాణం. ఆ రోజుల్లో ప్రయాణం చాలా క్లిష్టతరమైనది, సమయాభావంతో కూడుకున్నది. అతను బీదవాడు కావడం చేత బస, ఆహారం కోసం దారి పొడవునా చిన్నా చితకా పనులు చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. అలా కొన్ని మాసాలు ప్రయాణించిన తర్వాత ఎట్టకేలకు కైరో చేరుకున్నాడు. అక్కడ కొంతమందిని వాకబు చేసి తాను వెతుకుతున్న చిరునామా ఎక్కడుందో కనుక్కోగలిగాడు.

అక్కడ అడుగు పెట్టగానే అంతా ఎరిగిన ప్రదేశం లాగే కనిపిస్తోంది. అంతా కలలో కనిపించిన దృశ్యం లానే ఉంది. కలలో కనిపించినట్లుగా అక్కడ ఓ వృద్ధుడు కూడా ఉన్నాడు. తను సరైన ప్రదేశానికే వచ్చానని నిర్దారించుకుని నిధులు కనిపించిన గదివైపు దారి తీశాడు. ఆ అంతులేని సంపదంతా తనదే అని అతనికి పరమానందంగా ఉంది.

నెమ్మదిగా ఆ వృద్ధుడిని సమీపించాడు. కానీ అక్కడ కలలో కనిపించినట్లుగా నిధి నిక్షేపాలు కానీ, అద్భుతమైన కళాఖండాలు గానీ ఏమీ కానరావడం లేదు. నిధులు లేవని తెలిసినా  ఏమీ తొణక్కుండా ఆ వృద్ధుడికి తన సాక్షాత్కరించిన స్వప్నాన్ని యధాతథంగా వివరించి

“అంతా కలలో కనిపించినట్లుగానే జరిగింది. ఒక్క నిధులు విషయం తప్ప. వాటిని మీరు ఎక్కడో దాచి ఉండాలి. దయచేసి వాటిని నాకప్పగించండి” అన్నాడు.

ఆ వృద్ధుడు కాసేపు మౌనం వహించి, మెరుస్తున్న కళ్లతో ఆ యువకుడి వైపు పరీక్షగా చూశాడు. కొంత సేపటి తర్వాత ఇలా అన్నాడు.

“ఆశ్చర్యంగా ఉందే. నాకూ ఒక కల వచ్చింది. ఇస్తాంబుల్ అచ్చం నీలాంటి యువకుడు నివసిస్తున్నట్లు అందులో కనిపించింది “

“తర్వాత ఏం జరిగిందో చెప్పండి” ఆత్రుతగా అడిగాడా యువకుడు నిధుల గురించి ఏమైనా చెప్తాడనే ఆశతో.

ఆయన ఆ యువకుడు నివసిస్తున్న వీధిని, ఇంటిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు. అతని బంధువులు, స్నేహితులు, అతని దగ్గరున్న పుస్తకాలతో సహా పూసగుచ్చినట్లు వివరిస్తూ పోతున్నాడు.

“కానీ నా స్వప్నంలో అధ్బుతమైన నిధి నిక్షేపాలు అక్కడున్న చిన్న మంచం మీదనే ఉన్నాయని కనిపించింది.”

ఆ యువకుడికి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది. ఆ మహాత్ముడికి ప్రణామాలర్పించి, ఆయన దగ్గర  సెలవు తీసుకుని ఇస్తాంబుల్ లోని తన ఇంటికి వెళ్ళి ప్రశాంతమైన జీవితం గడిపాడు.