కోరికలు తీరాలంటే…

చాలా కాలం క్రితం ఓ అడవి పక్కనే ఉన్న చిన్న పల్లెటూళ్ళో కూలీ చేసి బతికే ఒక కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో భార్య పేరు చంద్రమణి. భర్త తెచ్చే చాలీ చాలని సంపాదనతో సంసారం నెట్టుకురావడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. తిండికి తప్ప ఇంకేదైనా చిన్న చిన్న కోరికలను కూడా నెరవేర్చుకోలేక పోతున్నామని బాధ పడుతూ ఉండేది.


ఇది ఎలా ఉన్నా ఆమెకు కొంచెం ఆధ్యాత్మిక ధోరణి కూడా ఉండేది. దగ్గర్లో ఉన్న అడవిలో ఒక సాధువు నివసిస్తున్నాడని విని ఉన్నది. ఆయన వేద వేదాంగాలను అభ్యసించిన వాడనీ, అయినా అతి సాధారణమైన జీవితం గడుపుతూ అందరి పట్ల కరుణ చూపుతూ ఆదర్శ జీవితం గడుపుతూ ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరకు వెళ్లాలనుకుంది. ఆయన తన మహిమలనుపయోగించి తన కష్టాలనుంచి గట్టెక్కించగలడని ఆమె నమ్మకం.

ఆయన దగ్గర ఇంకో ప్రత్యేకత కూడా గమనించింది. ఆయన ఏది కోరినా క్షణాల్లో అందుబాటులో ఉండేది. నీరు, ఆహారం, దుస్తులు, పూలు, ఇలా ఏదైనా సరే అలా మంత్రించినట్లుగా ఆయన ముందు ప్రత్యక్షమయ్యేవి.

చంద్రమణి దాదాపు రోజూ ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన్ను సేవించి వస్తుండేది. ఆయన మహిమల పట్ల ఆరాధనా భావం ఉన్నా అప్పుడప్పుడూ ఆయన అదృష్టాన్ని తలుచుకుని ఈర్ష్య కూడా పుట్టేది. ఒక్కోసారి ఆమెను తన శిష్యురాలిగా స్వీకరించమని కోరేది. ఒక్కోసారి ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేది. ఆయన నిస్వార్థం,ప్రశాంత చిత్తం మొదలైన అనేక విషయల  గురించి ఉపదేశాలు చేస్తుండేవాడు.

ఇలా భార్య ప్రవర్తనను కొద్ది రోజులు గమనించిన భర్త సహనం కోల్పోయి

“నేను సంపాదించి తెచ్చే డబ్బంతా ఆయనకు సమర్పించేస్తున్నావు. ఆయన మనకేమిచ్చాడు. నువ్వు ఆయన దగ్గర కెళుతున్నప్పటి నుంచి మనకేమన్నా ఒరిగిందా, మన జీవితం కొద్దిగా అయినా మారిందా?” అని నెమ్మదిగా కోప్పడ్డాడు.

ఇలా భార్యా భర్తల మధ్య గొడవ కొద్ది కాలం కొనసాగింది. చివరికి ఒక రోజు ఆమెను అడిగాడు.

“అయన దగ్గర ఏదో మంత్రించిన రాయి ఉందనీ, ఆ రాయిని ముట్టుకుని ఆయన ఏది కావాలంటే అది ప్రత్యక్షమవుతుందని అందరూ చెప్పుకుంటుండగా విన్నాను.ఆయన దగ్గర ఒకటి కన్నా ఎక్కువ రాళ్ళు కూడా ఉన్నాయని జనం అనుకుంటున్నారు. ఎవరో ఆరాయిని తీసుకుని బాగా ధనవంతులు అయ్యారట. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే రేపే వెళ్ళి ఆ రాయి కోసం ఆయన్ని అడుగు” అన్నాడు.

అంత గొప్ప మనిషిని ఆ తుచ్చమైన కోరిక ఎలా కోరను? ఆయన దానిని కలిగి ఉండటానికి అన్నివిధాలా అర్హుడు. మరి మనమో…

ఇలా రోజూ ఏదో విధంగా గోడవలు పడుతుండే వారు.

చివరకు ఇంట్లో మనశ్శాంతి కోసం సాధువును అడగడానికి అంగీకరించింది. మరుసటి రోజు సాధువు దగ్గరకు వెళ్ళి

“మీ దగ్గర ఏది కోరితే అది తీర్చగల మహిమ గల రాయి ఉన్నదటగా.. నాకోసం ఒకటి ఇవ్వగలరా?” అని అడిగింది.

“ఓ అదా. అవును నా దగ్గర నిజంగానే ఒక రాయి ఉన్నది. ఒక వారం క్రితం చాలా దూర ప్రాంతం నుంచి వస్తూ ఇటుగా వెళుతున్న ఓ బాటసారి ఇచ్చి వెళ్లాడు.దాన్ని నేనలా విసిరి పారేశాను. అదిగో ఆ కంచె వైపు. ఇంకా అక్కడే ఉండి వుండవచ్చు. వెళ్ళి వెతుకు” అన్నాడు దాని గురుతులు చెబుతూ..


ఆ రాయి కోసం వెతుకుతూ ఆమె ఆలోచిస్తూ ఉంది. అంత మహిమ గల రాయిని ఆయన పడేశాడా! అంటే దీని అర్థమేమై ఉంటుంది? దాని గురించి ఆయనకి ఏ కోరికా లేదన్నమాట. ఆయనకి దాని అవసరం లేదన్నమాట”.  ఇలా పరి పరి విధాలుగా సాగిపోతున్నాయి ఆమె అలోచనలు.

చాలాసేపు ఆలోచించిన పిదప ఆమెకు ఏదో స్పురణకు వచ్చినట్లుగా మనసులో ఇలా అనుకుంది.

“అయితే ఇంతకాలంగా ఆయన బోధ చేస్తున్నది ఇదేనన్నమాట.కోరికలు తీర్చుకోవడం ద్వారా తరగవు, సరికదా మరికొంచెం ఎక్కువౌతాయి.” ఆమెకు గురువు చెప్పిన సూత్రం బాగా అర్థమైంది. ఆయన తన అతిథుల పట్ల చూపుతున్న నిష్కల్మషమైన ప్రేమ, ప్రశాంత చిత్తం, ఆయన నవ్వులోని తీయదనం, నిరాడంబర జీవితం, నిత్యోల్లాసం వీటలో వేటికీ ఆయన దగ్గరున్న మంత్రపు రాయి కారణం కాదన్న మాట. ఆయన చెప్పే మాట ఒకటే
కోరికలకు దూరంగా ఉండండి అని. అలా అన్ని కోరికలు పుర్తిగా త్యజించాడు కాబట్టే ఆయనకి ఏది కావాలన్నా అందుబాటులోకి వస్తుంది.

మూలం: http://www.vedanta-atlanta.org/stories/touchstone.html

8 thoughts on “కోరికలు తీరాలంటే…

వ్యాఖ్యలను మూసివేసారు.