ఎన్‌ఐటీ వరంగల్ లో భారీ కుంభకోణం

సాక్షి నివేదిక
సాక్షి నివేదిక

నేను చదివిన ఎన్‌ఐటీ వరంగల్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు నిన్న సాక్షి వెలుగు లోకి తెచ్చింది. ఇది నాకు అంత ఆశ్చర్యం కలిగించక పోయినా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న తీరు మాత్రం విస్మయం కలిగిస్తున్నది.

మా కళ్ళెదురుగా జరిగిన ఒక అవినీతిని మీ ముందుంచుతాను. ఎంటెక్ విద్యార్థులుగా అక్కడ ఓ కొత్త ల్యాబ్ సెటప్ చేయాల్సిన బాధ్యత మా మీద పడింది. అందుకు కావల్సిన పరికరాలన్నీ ల్యాబ్ లోకి చేర్చి మొత్తం సెటప్ చేయాలి. అలా చూస్తూ ఆ పరికరాలకు సంబంధించిన బిల్లులు చూశాం. వాటి రేట్లు చూస్తే కళ్ళు తిరిగే రేంజ్ లో ఉన్నాయి.

అప్పటి కప్పుడు వాటి ధరల కోసం గూగుల్ లో వెతికితే ఒక్కో పరికరం పైనా సుమారు 70-80 శాతం ఎక్కువ కోట్ చేయబది ఉన్నది. దీన్ని మా ల్యాబ్ ఇన్‌చార్జి అయిన ఓ ఫ్యాకల్టీ దగ్గరికెళ్ళి చూపించాం. సదరు ఫ్యాకల్టీ కళాశాలలో కొత్తగా చేరారు. ఆ ఫ్యాకల్టీ ఓ సమావేశంలో ఈ విషయమై ఆవేశంగా ప్రశ్నించేసరికి అక్కడున్న సీనియర్లు

“నీకెందుకు ఇవ్వన్నీ కొత్తగా వచ్చావు ఇక్కడ జరిగే విషయలాన్నీ పెద్దగా తెలియవు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకుండా నీ పని నువ్వు చూసుకుంటే మంచిదని” సలహా ఇచ్చారట.

దాంతో ఏమీ చేయలేక పోయాం. ఎదిరించి పోరాడేంత శక్తి మాకు లేదు. ఒక వేళ ఎదురు తిరిగితే ఏమవుతుందో అందరికీ తెలిసిందే. కారణమేదైనా సరే మాకు పరీక్షా ఫలితాల్లో గ్రేడ్లుండవు, క్యాంపస్ సెలక్షన్లలో చోటుండదు. మధ్యతరగతి కుటుంబాల నుంచి కేవలం ఉద్యోగ సాధనే ధ్యేయంగా అక్కడికి వచ్చిన మాకు అంతకు మించి ముందుకు పోవడం మంచిది కాదని సైలెంటుగా ఉద్యోగాలు చూసుకుని బయట పడ్డాం.