ఎర్ర బస్సు పరిస్థితేంటి?

మా ఊరికి ఎర్ర బస్సులో వెళ్ళి చాలా రోజులైంది. అసలు ఎర్రబస్సు కనబడటమే మానేసిందీ మధ్య.అవును మరి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సెవెన్ సీటర్ ఆటోలు ఎర్రబస్సులను మసకబార్చేస్తున్నాయి. ఇందుకు కారణాలేమిటి అని అన్వేషిస్తే …


జరిగినంతకాలం జరగనీలే అని రవాణా శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం ఒకటి. మారిన ప్రజల అవసరాలకనుగుణంగా మనమూ మారదామన్న ఆలోచన వారిలో కలుగుతున్నట్లు రవ్వంతైనా కనిపించదు. అవసరానికి బస్సులు దొరకనప్పుడు ప్రజలు వాటిని దూరంగా ఉంచటంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఏ అమావాస్యకో పౌర్ణమికో తిరిగే బస్సుల్లో ప్రయాణికుల సాంద్రత తగ్గడం విశేషమేమీ కాదు. నష్టాల సాకుతో ఉన్న సర్వీసులను కూడా నిలిపివేస్తుండటంతో జనాలు క్రిక్కిరిసి ఉన్న ఆటోల్లో వ్రేళ్ళాడుతూ వెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఎన్నో ప్రమాదాలు జరిగినా ప్రజల్లో వీటిమీద అవగాహన రావడంలేదు.

గేదెలు,ఆవులు వట్టిపోయింతర్వాత కబేళాకు తోలేసినట్లుగా పట్టణాల్లో ఉన్న మంచి రోడ్ల మీద బాగా వాడేసి డొక్కువయింతర్వాత వాటిని అసలే అంతంతమాత్రంగా ఉన్న గ్రామీణ ప్రాంతపు రోడ్ల మీద వదిలితే అవి ఏ మాత్రం నడుస్తాయో మనకు తెలుసు. వాటి నిర్వహణా భాద్యత తలకు మించిన భారమౌతోంది. ఇక వాటిలో అత్తెసరు ప్రయాణికుల్ని బట్వాడా చేస్తూ ఆదాయాన్ని ఎలా ఆర్జించానుకుంటున్నారో నాకు అంతుపట్టని ప్రశ్న. ఇకనైనా ఆర్టీసీ వాళ్ళు కళ్ళు తెరవకపోతే తరువాతి తరం వారికి ఎర్రబస్సు చరిత్రగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

ప్రకటనలు

12 thoughts on “ఎర్ర బస్సు పరిస్థితేంటి?

 1. ఎర్రబస్సు చరిత్రే! ఎందుకు బాధ పడుతున్నారు?

  నాకు తెలిసి ఆర్టీసీ వాళ్ళు, హైద్రాబాదు శివార్లకి కొన్ని మినిబస్సులు నడుపుతున్నారు.అవి ఎర్ర రంగుల్లో లేవు. అలాగే, ఈ మధ్య చాలా రకాల బస్సులు, రంగులు ఉండటం వల్ల, ’ఎర్రబస్సు’ అనేది ఒక పదం. అంతే! అదే స్పూర్తితో redbus.in కూడా వచ్చినట్టుంది కదా! అది చాలు. నిజంగా ఎర్రబస్సు అక్కర్లేదు.

  ఆర్టీసీని ఆడిపోసుకోవటం కాదు.వాళ్ళిచ్చే సౌకర్యాలకి సరియైన ప్రచారం లేదు.అది వాళ్ళు చెయ్యక్కర్లేదు. వాడుకునే మనం, ఈరకం ప్రచారం మానేసి, ఆ రకం ప్రచారం చెయ్యాలి.

  ఈసారి నిజంగా మీ ఊరెళ్ళేటప్పుడు కావాలంటే ఆర్టీసీ బస్సుకోసం చూడండి.కానీ, ఎర్ర బస్సు కోసం కాదు. అప్పుడు మీ టపా మారిపోతుంది అని నా నమ్మకం.

  • ఇక్కడ మీకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎర్రబస్సు అంటే ఇక్కడ ఎర్రరంగు బస్సులని కాదు. గ్రామీణ ప్రాంతపు సర్వీసులని.
   మీరన్నట్లు ఇప్పుడు ఎర్రరంగు బస్సులేమీ లేవు. అన్నిటికీ పచ్చరంగు వేసేశారు.
   వాళ్ళు సౌకర్యాలకి ప్రచారం ఏమిటండీ!!… అవసరైన సమయానికి బస్టాండులోకి బస్సులొస్తే జనం ఆటోమేటిగ్గా వాటిలోనే ఎక్కుతారు కదా….ఇరుక్కుని ఆటోల్లో ఎందుకు వెళతారు?
   నిజంగా ఊరెళ్ళేటపుడు నేను ఆర్టీసీ బస్సు కోసమే చూస్తాను. కానీ అందులోనే ఊరెళ్ళాలంటే అర్ధ గంట ప్రయాణం కనీసం మూడు గంటలవుతుంది.

 2. మీరన్నట్టు కొన్ని గ్రామాలకు బస్సులో వెళ్ళాలంటే ఇబ్బందే. మా ఊరికి బస్సు, ఆటో సౌకర్యాలు రెండూ ఉన్నాయి. అయినా మధ్యాహ్నం 3 దాటిన తర్వాత 6 గంటలలోపు ఒకటి లేదా రెండు బస్సులు మాత్రమే వస్తాయి. ఉదయ 9 లోపైతే బాగా రద్దీగా ఉంటాయి. కాని 4 బస్సులు మించి రావు. 10 తర్వాత హాయిగా ఖాళీగా పోతుంటాయి. గ్రామీణ సర్వీస్ లకు సమయపాలన సరిగ్గా ఉండటంలేదు. లేకపోతే బస్సుని వదిలేదెవ్వరు. అది ఎప్పటికి ముద్దే.

  • సరిగ్గా అదే చెప్ప దలుచుకున్నాను నేను కూడా రద్దీగా ఉన్న సమయాల్లో బస్సు సర్వీసులను పెంచడం ఖాళీ సమయాల్లో తగ్గించడం లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వచ్చని నా అభిప్రాయం.

 3. మా ఊరికి రెండు ఎర్ర బస్సులు ఉండెవి.. అవి చెడినట్లున్నాయి.. మీరన్నట్లుగా సిటి లొ తిరిగి డొక్కు డొక్కుగా సగం జీవీతం గడించిన బస్సులను తిప్పుతున్నారు మా ఊరికి.. ;(

  • మా ఊరికీ మీ ఊరికే కాదండీ దాదాపు గ్రామీణ ప్రాంతాల సర్వీసులన్నీ ఇంతే…

 4. ఎర్ర బస్సులుగా మనం పిలుచుకుంటున్న ఆర్టిసి వారి సర్వీసులు అన్నీ హైర్ సర్వీసులుగా మారిపోయాయి. వాళ్ళ స్వంత బస్సులు చాలా తక్కువిప్పుడు. అలాగే వీళ్ళు రూట్లో ఒక దాని వెనకాల ఒకటి వరుసగా వస్తు పోతుంటాయి. జనానికి అవసరమైన సమయాలల్లో వుండవు. అందుకు చాలా వరకు వాటి గురించి వేచి చూడడం ద౦డగగా ఆటోలు, త్రాక్కర్లకు వేలాడుతూ వెళతారు అపాయమని తెలిసినా. నిర్వహణా లోపమే ఇది. అసలు పల్లె బస్సులలో ఈ హైర్ సర్వీసులు రాక ముందు ఆ బస్సులేక్కాలంతేనే చెవులు పగిలిపోయి, ఒళ్ళు హునమయ్యేది. నిత్యమూ వాటిలోనే తిరుగుతున్నా వాడిగా చెపుతున్నా.

వ్యాఖ్యలను మూసివేసారు.