ఎర్ర బస్సు పరిస్థితేంటి?

మా ఊరికి ఎర్ర బస్సులో వెళ్ళి చాలా రోజులైంది. అసలు ఎర్రబస్సు కనబడటమే మానేసిందీ మధ్య.అవును మరి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సెవెన్ సీటర్ ఆటోలు ఎర్రబస్సులను మసకబార్చేస్తున్నాయి. ఇందుకు కారణాలేమిటి అని అన్వేషిస్తే …


జరిగినంతకాలం జరగనీలే అని రవాణా శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం ఒకటి. మారిన ప్రజల అవసరాలకనుగుణంగా మనమూ మారదామన్న ఆలోచన వారిలో కలుగుతున్నట్లు రవ్వంతైనా కనిపించదు. అవసరానికి బస్సులు దొరకనప్పుడు ప్రజలు వాటిని దూరంగా ఉంచటంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఏ అమావాస్యకో పౌర్ణమికో తిరిగే బస్సుల్లో ప్రయాణికుల సాంద్రత తగ్గడం విశేషమేమీ కాదు. నష్టాల సాకుతో ఉన్న సర్వీసులను కూడా నిలిపివేస్తుండటంతో జనాలు క్రిక్కిరిసి ఉన్న ఆటోల్లో వ్రేళ్ళాడుతూ వెళ్ళడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఎన్నో ప్రమాదాలు జరిగినా ప్రజల్లో వీటిమీద అవగాహన రావడంలేదు.

గేదెలు,ఆవులు వట్టిపోయింతర్వాత కబేళాకు తోలేసినట్లుగా పట్టణాల్లో ఉన్న మంచి రోడ్ల మీద బాగా వాడేసి డొక్కువయింతర్వాత వాటిని అసలే అంతంతమాత్రంగా ఉన్న గ్రామీణ ప్రాంతపు రోడ్ల మీద వదిలితే అవి ఏ మాత్రం నడుస్తాయో మనకు తెలుసు. వాటి నిర్వహణా భాద్యత తలకు మించిన భారమౌతోంది. ఇక వాటిలో అత్తెసరు ప్రయాణికుల్ని బట్వాడా చేస్తూ ఆదాయాన్ని ఎలా ఆర్జించానుకుంటున్నారో నాకు అంతుపట్టని ప్రశ్న. ఇకనైనా ఆర్టీసీ వాళ్ళు కళ్ళు తెరవకపోతే తరువాతి తరం వారికి ఎర్రబస్సు చరిత్రగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.