నిజమైన వేదాంతి

ప్రస్తుతం బ్యాంకులు దివాళా తీయడం సర్వ సాధారణమైపోయింది. స్వామి వివేకానంద తనకు ఎదురైన ఒక అనుభవాన్ని గురించి ఇలా తెలియజేశారు.

అది 1896 సంవత్సరం. స్వామీజీ ప్యారిస్ లో ఉన్నారు. మాటలు కలిపి స్నేహితుల్ని చేసుకోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా స్వామీజీ వదిలిపెట్టేవారు కాదు. అలాగా ఆయనకు ఎంతో మందితో పరిచయం కలిగింది. వీళ్ళలో ప్యారిస్ లో నివసించే ఇటాలియన్ దొరసాని(డచెస్) ఒకరు. స్వామీజీ ఆమె ఆశ్రయంలో కొద్ది కాలం పాటు ఉన్నారు.

ఆమె ఒక రోజు  స్వామీజీకి ప్రశాంతంగా ఉంటుందని పట్టణంలో దూరంగా ఉన్న ఒక పేటలోకి తీసుకుని వెళుతున్నారు. అందుకోసం చోదకునితో సహా ఓ టాంగా కూడా మాట్లాడుకున్నారు. స్వామీజీ స్వతహాగా విదేశీ భాషలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించేవాడు. అలా కొంచెం ఫ్రెంచి భాష కూడా నేర్చుకున్నాడు. అంతకు ముందు అవసరమైనప్పుడల్లా వస్తుండటం వల్ల ఆ టాంగా చోదకుడు ఆ దొరసానికి ముందస్తుగా పరిచయమే.

ఆమె స్వామీజీ వైపు తిరిగి ఇంగ్లీషులో “ఇతను స్వచ్ఛమైన ఫ్రెంచ్ మాట్లాడగలడు తెలుసా!” అంది. అప్పట్లో డ్రైవర్లకు అలా తెలియడం కొంచె ఆశ్చర్యకరమైన విషయమే.

ఈ సంభాషణ ఇలా సాగుతుండగా వారి బండి ఒక గ్రామం పక్కగా వెళుతోంది. ఆ గ్రామంలో ఒక కుటుంబంలోని పరిచారిక ఒక చిన్న బాలుణ్ణి, బాలికను బయటకు తోడ్కొని వస్తోంది. డ్రైవర్ బండి ఆపి కిందకు దిగి ఆ పిల్లను తన ఒడిలోకి తీసుకొని ప్రేమగా నిమిరి, కాసేపు మాట్లాడి తిరిగి వచ్చి బండెక్కాడు.

ఇది కొంచెం అనూహ్యమైన సంఘటనే. ఎందుకంటే  ఆరోజుల్లో 19 వ శతాబ్దం వర్గ విభేదాలు  చాలా బలంగా ఉండేవి. పిల్లలను చూస్తే ఉన్నత స్థాయికి చెందిన వారిగా కనిపిస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళు అద్దెకు కుదుర్చుకున్న డ్రైవర్ వాళ్ళను బాగా తెలిసినట్లుగా ముద్దు చేస్తున్నాడు. ఆ దొరసాని ఒక్కసారిగా విభ్రాంతికి గురై “ఎందుకలా చేశావు?” అని అడిగింది.

అతడు వెంటనే ఆమె వైపు తిరిగి “వాళ్ళు నా పిల్లలే. మీరు ప్యారిస్ లో పలానా బ్యాంకు గురించి విన్నారా?”అని అడిగాడు.

ఆమె తెలుసన్నట్లుగా తల ఊపి “అవును అది చాలా పెద్ద బ్యాంక్. కానీ ఈ మధ్యనే దివాళా తీసిందని విన్నాను.” అంది.

వెంటనే అతను అందుకుని “ఆ బ్యాంకు మేనేజర్ని నేనే. దాని వైఫల్యంలో నాకూ భాగస్వామ్యం ఉంది. దాని అప్పులు తిరిగి తీర్చడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నేనిప్పుడు పీకల్లోతు అప్పుల్లో కూరుకుని ఉన్నాను. నా భార్యా పిల్లల్ని  ఆ గ్రామంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంచాను. వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఒక పరిచారిక మాత్రమే ఉంది. నాకు ఉన్నంతలో ఈ బండిని కొనుక్కుని ఇలా అద్దెకు తిప్పుతుంటాను. ఇందులో వచ్చిన ఆదాయంతో నాకుటుంబాన్ని పోషిస్తున్నాను.కానీ నా అప్పు తీరిపోగానే మళ్ళీ బ్యాంకును పునఃప్రారంభిస్తాను” అన్నాడు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో.

అతని కథ స్వామీజీకి ఎంతో ఆశ్చర్యాన్నీ, సంతోషాన్నీ కలిగించింది. ఇతని గురించి స్వామీజీ తన శిష్యులకు చెబుతూ ఇలా అనేవాడు.

“అతను నిజమైన వేదాంతి. అతను వేదాంతాన్ని అర్థం చేసుకున్నట్లే లెక్క. అంతమంచి స్థాయి నుంచి అధఃపాతాళానికి పడిపోయినా అతని ఆత్మవిశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదర్లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అతని మానసిక స్థైర్యం చాలా గొప్పది” అంటూ ప్రశంసించేవాడు.