అమ్మ చేతి దెబ్బ

అమ్మ చేతిలో ఒక్కసారైనా దెబ్బ తినని వాళ్ళు ఉండటం చాలా అరుదని నా నమ్మకం. అందుకు నేనూ మినహాయింపు కాదు. చిన్నప్పుడు నాకు బంకమట్టితో బొమ్మలు చేయడమంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే చాలు అదే పని. రక రకాల వాహనాలు, పరికరాలు వంటివి చాలా తయారు చేస్తుండే వాడిని. నాకోసమే కాదు. నా పక్కన తిరిగే పిల్ల గ్యాంగ్ అంతటికీ నేనే చేసిపెట్టే వాడిని.

ఒక సారి మా అమ్మ గదిలో పూజ చేస్తూ పూజ అయిపోయేదాకా నన్నక్కడే కూర్చోమనింది. నేను నెమ్మదిగా అక్కణ్ణుంచి జారుకుని మట్టి బొమ్మలు చేయడానికి వెళ్ళిపోయాను. ఆటల్లో పడి పూజైపోయేదాకా తిరిగి రాలేదు. ఎవరో వచ్చి మా అమ్మ ఇంటి దగ్గర బెత్తం ఎత్తుకుని నా కోసం కాసుక్కూచుందని చెప్పారు.

అప్పటిదాకా మా అమ్మ నన్నెప్పుడూ  తిట్టిందే తప్ప కొట్టింది లేదు. ఏంజరుగుతుందోనని భయం భయంగా ఇంటికెళ్ళాను. వెళ్ళగానే మా అమ్మ బెత్తం తీసింది. అంతే ఒంటి మీద చిన్న దెబ్బ పడిందో లేదో రోషం పొడుచుకొచ్చింది…అసలే పౌరుషం ఎక్కువ.. పైగా ఇంట్లో వాళ్ళందరి దగ్గర గారాబం… ఆ బెత్తం తీసుకుని మా అమ్మని తిరిగి నాలుగిచ్చేశా…అంతటితో ఆగానా… అన్నం తినకుండా అలక పాన్పు ఎక్కేశా. అలక తీర్చడానికి మాకుటుంబం మొత్తం రంగం లోకి దిగింది. ఒక్క దెబ్బకి నాలుగు దెబ్బలు తిరిగిచ్చి మళ్ళీ నేనే అలిగానని మా ఇంట్లో వాళ్ళంతా ఒకటే నవ్వులు. నాకు మాత్రం ఉక్రోషం పెరిగిపోతోంది. చివరికి మా తాత వచ్చి బుజ్జగించి ఎప్పట్నుంచో మూలన పడి ఉన్న ఈచెయిర్ రిపేర్ చేసి ఇచ్చేదాకా పట్టు వదల్లేదు.

కోపం తగ్గాక ఆ కుర్చీ మీద దర్జాగా కూర్చుని చెయ్యి చాపుతుంటే మా అమ్మ ఒక్కో ముద్ద కలిపి చేతిలో పెడుతూ…

“అది కాదు నాయనా.. పూజ దగ్గిర ఉండమంటే నువ్వు చెప్పా పట్టకుండా అట్ట ఎల్లిపోతే ఎట్టా చెప్పు… తప్పు గదా..” అంటూ నెమ్మదిగా మంచిమాటలు చెప్పింది.

“అయితే ఇంకెప్పుడూ అలా చెయ్యనులే…. నువ్వు కూడా నన్నెప్పుడూ కొట్టగూడదు” అన్నా…

అదే మొదటి మరియు చివరి అమ్మ చేతి దెబ్బ… ఇంకెప్పుడూ దెబ్బలు తినలేదు. మా నాన్న దగ్గరైతే ఆ ఒకసారి కూడా దెబ్బలు తినలేదు.

9 thoughts on “అమ్మ చేతి దెబ్బ

  • అమ్మో… రావణాసురుడని పిలుస్తుందా!!!
   …. నేను మాత్రం రాముడు మంచి బాలుడు టైపే…… 🙂

 1. అమ్మ చేతి వంటలాగే దెబ్బలు కూడా కమ్మగా వుండి వుంటాయి. ఇంకో నాలుగు వడ్డించమని అడగకపోయారా. మీకు మరీ మొహమాటం ఎక్కువనుకుంటా.

  • అవును నాకు కొంచెం మొహమాటమే….. కానీ అలా సరదాగా కొట్టే దెబ్బలు మాత్రం నిజంగా కమ్మగానే ఉంటాయి.

 2. maa amma nanna nannu enni sarlu kottaboyaro lekha ledu… manam cheisina allari panulu alantivi… final ga bharincha leka ammamma daggaraki pampincharu konni rojulu. ayina maraledu lendi… ippatiki ade allari intlo… maa varu okokka sari chetulethesi maa nanna ki phone lo mora pettukuntaru… “ee allari pillanu ela bharincharu mamagaru!!” ani :))

 3. అయ్యాబాబోయి, ఇక్కడ ఈ పిల్లాడు బెత్తంతో తల్లిని కొట్టాడు. ఒక్కరు కూడా ఆ విషయం పట్టించుకోక పోవడం చాలా విచిత్రం. తల్లిని తిరిగి నాలుగు కొట్టిన పిల్లాడి సంగతి చాలా ఘోరంగా వుంది. ఏమాత్రమూ ముచ్చటగా లేదు.
  రవి

  • నా దెబ్బలకు మా అమ్మ నవ్వుకుంది… నా ఉడుకుమోత్తనం చూసి. లైట్ తీసుకోండి బ్రదర్ 🙂

  • అమ్మచేతి దెబ్బలు – అమ్మ తిన్న దెబ్బలు అంటే ఇంకా బాగుండేది 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.