ప్రయత్నం చేయండి

శారదా మాత శిష్యులలో ఒకరు స్వామి అదినాథానంద. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు నిర్మించడం అతని భాద్యత. ఆయన దగ్గర ఉగప్ప అనే శిష్యుడు క్యాషియర్ గా పనిచేసేవాడు. ఈ పాఠశాలలు నడపడానికి అవసరమయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేది. ఇందుకోసం విడతలవారీగా చెక్కుల రూపంలో డబ్బు పంపించేది.

ఒకసారి శనివారం సాయంత్రం బ్యాంకు మూసేసిన తర్వాత పెద్ద మొత్తం కలిగిన చెక్ ఆశ్రమానికి వచ్చింది. ఆ చెక్ ను సాధ్యమైనంత త్వరగా జమచేయాలని భావించాడు. ఆదివారం ఉదయం స్వామీజీ ఉగప్పను పిలిచి బ్యాంకు కెళ్ళి ఈ చెక్ ను జమచేసి రమ్మన్నాడు. 

గురూజీ పరధ్యానంలో ఉన్నాడేమో అనుకుని ఆరోజు ఆదివారమనీ, బ్యాంకు తెరవరనీ, చెక్ జమ చేయడం అసాధ్యమని తేల్చేశాడు.


“నువ్వు కనీసం ప్రయత్నమైనా చెయ్యకుండా అది అసాధ్యమని ఎలా చెప్పగలుగుతున్నావు. ముందుగా వెళ్ళి ప్రయత్నించు. తరువాత వచ్చి నాకు విషయమేమిటో చెప్పు” అన్నాడు.

రామకృష్ణ ఆశ్రమంలో గురువు ఏదైనా ఆదేశిస్తే ముందుగా శిరసావహించాలి తరువాతనే ప్రశ్నలడగాలి. అప్పుడు గుర్తుకొచ్చిందా శిష్యుడికి ఆ బ్యాంకు డైరెక్టర్ చిరకాల మిత్రుడని. ఆయన ఎక్కడ నివసిస్తాడో కూడా తెలుసు. ఉగప్ప సరాసరి ఆయనింటికి వెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ ఆఫీసర్ కాసేపు ఆలోచించి

“ముందుగా బ్యాంకు వెళదాం. అక్కడ ఏంచేయగలనో చూద్దాం” అన్నాడు.

ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్ళగానే డైరెక్టర్ ఆ చెక్ తీసుకుని ఆశ్రమం ఖాతాలో వేశాడు.

పని ముగించుకుని శిష్యుడు ఆశ్రమానికి రాగానే స్వామీజీ శిష్యునితో ఇలా అన్నాడు.

“ఇప్పుడు నీకు తెలిసిందా? ప్రయత్నిస్తే కొన్నిసార్లు అసాధ్యమైనవి కూడా సుసాధ్యమౌతాయనీ”.

మూలం:http://www.vedanta-atlanta.org/stories/swami.html

3 thoughts on “ప్రయత్నం చేయండి

  1. బాగుంది. ప్రయత్నం మీదగాని, అతిప్రయత్నం మీదగాని పనులవుతాయి.చేయాల్సిందల్లా విసుగులేని, వంకలు లేని ప్రయత్నమన్నమాట.

వ్యాఖ్యలను మూసివేసారు.