నేను తప్పిపోయాను

ఇప్పుడు కాదు లెండి 12 ఏళ్ళ వయసులో మద్రాసులో తప్పిపోయాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. అందుకనే మీతో పంచుకుంటున్నాను.

అవి నేను ఏడో తరగతి రోజులు. మా పెద్దక్కకి పెళ్ళి కుదిరింది. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. మా తాతకి (మా అమ్మ వాళ్ళ నాన్న) క్యాన్సర్ మొదటి దశలో ఉందని తేలింది. పెళ్ళికి ముందే ఆసుపత్రికి వెళ్ళమంటే వెళ్తే ఏం చెప్తారో అనే భయంతో మా తాత అంగీకరించలేదు. పెళ్ళయిన తర్వాత హాస్పిటల్ కు వెళితే ఏమైపోయినా పరవాలేదన్నాడు. అలాగే పెళ్ళైపోయింది. మాకు దగ్గర్లో ఉన్న తిరుపతిలో, నెల్లూరులో  దానికి తగ్గ చికిత్సలులేవు. ఒకవేళ చేయించాలన్నా ఎక్కడనుంచో వైద్యులొచ్చి చికిత్స చేయాలి కాబట్టి బాగా ఖర్చుతో కూడిన పని. మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. ఇలా ఉంటే ఇది వరకే క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న మా ఊరి వాళ్ళలో ఒకాయన మద్రాసు వెళ్ళమని సలహా ఇచ్చారు.

మద్రాసు అడయార్ ఆసుపత్రిలో అయితే ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా వైద్యం చేస్తారని అక్కడ చేర్పించాం. నేనూ, మా అమ్మ, మా అక్కవాళ్ళిద్దరు, ఇంకా మా ఊరివాళ్ళు ఓ నలుగురు కలిసి మద్రాసుకు బయలు దేరాం. అందరు బస్సులో వెళ్ళాలంటే చార్జీలు ఎక్కువౌతాయని రైలులో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. రేణిగుంటలో మాకు తెలిసిన రైల్వే ఉద్యోగితో కలిసి వెళితే కొద్దిమంది ఆయన పాస్ మీద వెళ్ళచ్చని ఆయన్ని కూడా మాతో రమ్మన్నాం.

మద్రాసుకెళ్ళి మా తాతను చూశాం. అప్పుడు ఆయనకి కీమోథెరపీ చికిత్స జరుగుతోంది. మాకు ఓ మహానగరానికెళ్ళడం అదే కొత్త. ఇంక మనం ఈ మహానగరాన్ని చూడ్డానికి ఎప్పుడు వస్తామో ఏమో అని అందరం కలిసి గోల్డెన్ బీచ్‌ చూద్దామనుకున్నాం. అంతా చూసుకుని సాయంత్రం మళ్ళీ ఆస్పత్రికెళ్ళి మా తాతనొకసారి చూసేసి ఊరెళ్ళిపోదామనుకున్నాం.

గోల్డెన్ బీచ్ నుంచి అడయార్ కు రావడానికి 1J అనే బస్సు ఎక్కాం. బస్సులో నాకు కిటికీ పక్కనే సీటు దొరికింది . నా పక్కనే ఆ రైల్వే పెద్దాయన కూర్చున్నాడు. అప్పటిదాకా మా పల్లెటూరు, పక్కన శ్రీకాళహస్తి తప్ప మిగతా ఊళ్ళు ఎలా ఉంటాయో ఎరగని నేను ఆ పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, ఎడతెరిపిలేని వాహనాలు, డబుల్ డెకర్ బస్సులు మొదలైన మహానగరపు వింతలు, విడ్డూరాలు చూడ్డంలో మునిగిపోయా.

కొద్దిసేపటి తర్వాత నా పక్కన ఉన్న పెద్దాయన ఎవరో వస్తే వాళ్ళను పలకరించడానికన్నట్లు లేచి సీటిచ్చాడు. సరే ఎవరో తెలిసిన వాళ్ళేమో అనుకున్నాను. కానీ రాబోయే స్టాపే దిగాల్సిన స్టాపని నాకప్పుడు తెలియలేదు. కాసేపటి తర్వాత బస్సులో కలియజూస్తే ఇంకేముంది?. బస్సులో నాకు తెలిసిన ఒక్క మొహం కూడా కనిపించలేదు.

ఏడుపు మొహం పెట్టుకుని మా అమ్మవాళ్ళనెవరైనా చూశారా అని అందర్నీ అడగడం మొదలుపెట్టాను. అసలే తమిళులకు భాషాభిమానం జాస్తి. నాకేమో తెలుగు తప్ప వేరే ఏ భాష రాదు. అప్పుడు ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలకోసం బట్టీ పట్టిన వాటీజ్ యువర్ నేమ్, వాట్ ఆర్ యు స్టడీయింగ్ లాంటి ప్రశ్నలు సమాధానాలతో సహా గుర్తుకొచ్చాయి.

వాటికి సమాధానాలన్నీ ఒక పేరాగ్రాఫ్ లాగా మనసులోనే తయారు చేసుకుని కొంచె చదువుకున్నాయనలా కనిపిస్తున్న దగ్గరికెళ్ళి ఏకరువు పెట్టుకున్నాను. ఆ మహానుభావుడికి నా తిక్క ఇంగ్లీషు ఏం అర్థమైందో ఏమో.. ఇంకా కొన్ని ప్రశ్నలడిగాడు. వాటికి సమాధానాలివ్వడం నాకు తెలియక

గ్రాండ్ ఫాదర్, క్యాన్సర్, అడయార్ హాస్పిటల్, సీ, మదర్, సిస్టర్స్,  మిస్సింగ్ అని నాకు తెలిసిన ఇంగ్లీషు పదాలన్నీ ఒక వాక్యంలాగే కలిపేసి చెప్పేశాను.

ఆయనకి కొంచెం అర్థమై బస్సులో నాతో పాటే అక్కడే దిగేసి వేరే బస్సులో అడయార్ హాస్పిటల్ దగ్గర దింపాడు. కానీ ఆ హాస్పిటల్ మా తాత ఉండే హాస్పిటల్ లాగా కనిపించడం లేదు. ఆయన నన్ను ఆ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు దగ్గరకు తీసుకెళ్ళాడు.  ఆయనకు  తెలుగు వచ్చు. తెలుగు వాళ్ళు కనిపించేసరికి నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆయన దగ్గర నా గోడంతా వెళ్ళబోసుకున్నాను.

“ఇంత పెద్ద మహానగరంలో అంత పరాకుగా ఉంటే ఎలా?” అని సున్నితంగా మందలించాడు నన్ను. మేం వచ్చింది అడయార్ కొత్త హాస్పిటల్ కనీ, ఇంకొంచెం ముందుకెళితే పాత హాస్పిటల్  వస్తుందనీ మా తాత అక్కడే ఉంటాడనీ చెప్పాడు. దాంతో నాకు మనం సరైన చోటుకే చేరుకున్నామనే నమ్మకం వచ్చింది. నన్ను అక్కడి దాకా తీసుకువచ్చినాయన అంతటితో ఆగకుండా పాత హాస్పిటల్ దాకా తీసుకుని పోయి మా తాత దగ్గర దిగబెట్టాడు. మా తాత కళ్ళనీళ్ళతో రెండు చేతులెత్తి అతనికో నమస్కారం చేశాడు. ఆయన ఆ చేతుల్ని కిందకు దించమని వారించి వెళ్ళిపోయాడు. ఆయనే గనక లేకపోతే నేనేమయ్యే వాడినో!

ఇదిలా ఉంటే బస్సులో నన్నొదిలేసి దిగేసిన ముసలాయన అజాగ్రత్తను గురించి అందరూ కాసేపు తర్జన భర్జలు పడి వెతుకులాట ప్రారంభించారు. దారిలో కనిపించిన వాళ్ళనంతా అడగడం మొదలు పెట్టారు. లాభం లేదు. వెతికి వెతికి విసిగి పోయి ఆసుపత్రికొచ్చి మా తాతకు విషయం చెప్పి టీవీల్లో, వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకునేశారు. అలా అక్కడికి వచ్చేసరికి నేను కనిపించాను. అప్పుడు వాళ్ళనుభవించిన భావన నేను మాటల్లో వర్ణించలేనిది. అసలే లేక లేక కలిగిన మగ సంతానాన్ని. వరప్రసాదంగా పుట్టానట. నేను పుట్టిన తర్వాత తిరువళ్ళూరు వీరరాఘవుల స్వామికి నా బరువు ధనం తూచి ఇచ్చారట. ఇంత సేపు ఎలా తట్టుకునిందో మా అమ్మ నేను కనిపించానని తెలియగానే నడిరోడ్డు మీదనే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడుండే వాళ్ళంతా ఏం జరిగిందోనని ఆసక్తిగా చూస్తున్నారు. మా అక్కవాళ్ళిద్దరు వచ్చి చెరో పక్కన కూర్చున్నారు.నేనెళ్ళి ఒళ్ళో పడుకుని కాసేపు గట్టిగా కౌగలించుకుని మొహం మీద నీళ్ళు చల్లితే గానీ లేవలేదు.

ఆ ముసలాయన “ఎంత పని జేసినావురా బాబూ! హాఫ్ ఏసినా ఫుల్లుగా ఎక్కేసేది, ఫుల్లేసినా ఎక్కలేదు గదరా నాయనా” అని పరాచికాలాడినాడు వాతావరణాన్ని తేలిక పరచడానికి

అందరూ పెద్దగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు సాయంత్రమే ఊరికెళ్ళిపోయాం. మరుసటి రోజు నుంచి మా తాత జ్వరంతో మంచమెక్కి వారం రోజులపాటు లేవలేదని తెలిసింది. ఈ సంగతి ఎప్పుడు గుర్తు చేసుకున్నా మా ఇంట్లో వాళ్ళు అదో రకమైన ఉద్వేగానికి లోనైపోతుంటారు.