చిన్ననాటి ప్రపంచంలోకి మళ్ళా ఒకసారి

నిన్ననే మిట్టూరోడి పుస్తకం చదవడం పూర్తిజేసినా. ఆ కథల్లోని పాత్రలు ఇంకా అట్నే కళ్ళముందు కదలాడతా ఉండాయి.అవి పాత్రలయితే గదా.. చితికిపోయిన రైతన్న యధార్థ సిత్రాలు. కొద్దిగా చదివి కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళ ముందు సినిమా రీలు లాగా కదిలిపోతుండాయి. ఏదో సినిమా రచయిత చెప్పినట్టుగా మరిచి పోవడానికి అయేమన్నా  జ్ఞాపకాలా? మన జీవితాలు.

రైతు కుటుంబంలో బుట్టిన నాకు సేద్యం  కొత్తేం గాదు. కరువు కోరల పదునెంతో 2000-04 సంవత్సరాల మధ్యలో కరువుకాలంలో నీళ్ళకోసం మా కుటుంబం పడ్డ కష్టాల వల్ల తెలుసు. కాకపోతే కాసుల వేటలో బడి కాంక్రీటు అరణ్యంలో కొచ్చి పడ్డాక ఆ జ్ఞాపకాలన్నీ గుంటబెట్టి గంట వాయించేస్తిని. ఎప్పుడో ఒకప్పుడు ఊరికి బోయినా పచ్చంగా ఉండే పైర్లను బుల్లి పెట్టెలో బంధించి తీసుకొచ్చేసి ఆఫీసులో ఉండే వోళ్ళకి చూపిచ్చేసి సంబర పడిపోతా ఉండాను. కానీ ఆ సంబరం ఏ మాత్తరం విలువ లేనిదని ఇప్పుడీ కథలు చదివింతర్వాత తెలస్తా ఉంది. ఈ కథల్లో ఉండే ఆత్మ అటువంటిది. గడిచిపోయిన రోజులు ఎంత బాధాకరంగా నైనా ఉండనీ, నాకు మాత్రం అయే బాగుంటాయనిపిస్తాది అవి కూటికి గతిలేని రోజులైనా గానీ.

ఏది ఏమైనా కార్పోరేట్ ముసుగును చీల్చి నా చేయి బట్టి నిజ ప్రపంచంలోకి లాక్కుపోయినందుకు, నా బాల్యాన్ని మళ్ళీ జీవింపజేసినందుకు నామిని గారికి వందనాలు.

ప్రకటనలు

2 thoughts on “చిన్ననాటి ప్రపంచంలోకి మళ్ళా ఒకసారి

  1. అంతే రవిచంద్ర! గడిచిపోయిన జ్ఞాపకాలు కన్నీళ్ళైనా, నెమరేసుకుంటే అవే కమ్మగా ఉంటాయ్…ఒకసారి మళ్ళా కాలంలో వెనక్కి పరిగెట్టి ఆ జ్ఞాపకాల దొంతరల్ని ఒక్కసారి తాకొద్దామనిపిస్తుంటుంది….

వ్యాఖ్యలను మూసివేసారు.