రండి రండి పతిత పావనురంగని చూడరండి

ప్రత్యక్ష దేవుడు పండరీ నాధుడని భజించు పండరీ భక్తులారా!

కాళ్ళయందెలు గట్టి కరతాళములను బట్టి కాషాయములను గట్టిన సాధులారా

తంబుర మీటుచు తాళనాదములతోడ తాండవమాడేటి తండ్రులారా

పుండరీకుని వేడ జండాలను చేపట్టి అండకై ఆడేటి ఆర్యులారా!

రండి వెడలి రండి పండరీ చేర రండి, పాండురంగని సేవించరండి రండి

పాప భీతితో పనిలేదు రండి రండి పతిత పావనురంగని చూడరండి.

పోయిన ఆదివారం మా ఊర్లో జరిగిన అగ్నిగుండ ప్రవేశ మహోత్సవ దృశ్యాలను వీక్షించండి. ప్రతి యేటా మార్చి నెలలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. మూడవ రోజు అతి ముఖ్యమైన రోజు. రాత్రి పురోహితుడు నిర్ణయించిన ముహూర్త  సమయంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో  నిప్పులపై నడుస్తారు. దీన్నే అగ్నిగుండ ప్రవేశం అని అంటారు. మొదటగా భజన గురువు పూల చెండును నిప్పులపై దొర్లిస్తూ ప్రారంభిస్తే మిగతా భక్తులు ఆయన్ను అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో తాజాపూలతో తయారైన పూలబంతి నిప్పులపై దొర్లించినా పూలు ఏ మాత్రం వాడిపోకుండా ఉండటం గమనార్హం.

ఈసారి నేనూ మొక్కుబడి తీర్చుకున్నాను. నాలుగు పాటలకు భజన కూడా వేశాను కానీ తరువాత పాటలకు అడుగేద్దామంటే ఫిట్‌నెస్ చాల్లేదు. 🙂

ప్రకటనలు

12 thoughts on “రండి రండి పతిత పావనురంగని చూడరండి

 1. రవిచంద్ర,
  ఇంగ్లీష్ బ్లాగ్ కూడా ఉందా…..ఇంతకీ గుండం తొక్కేరన్నమాట!మీ ఊర్లో ఇంకా ఆచారాలు నిలబడే ఉన్నట్టున్నాయి….చాలా ఆనందంగా అనిపించింది, అలా నలుగురూ కలిసి కాలు కదుపుతుంటే చూసి…ఈ సారి నన్ను కూడా మీ ఊరు తీసుకెళ్ళాలి మరి!

  • కౌటిల్య గారూ,
   ఇంగ్లీషు బ్లాగు మా ఆఫీసులో పనిచేసే తెలుగేతరుల కోసం. తెలుగులో నేను రాస్తుంటే చూసి వాళ్ళతో కూడా నా అనుభవాలు పంచుకోవాలని పట్టుబట్టడంతో ప్రారంభించాను.
   భజన కూడా వీడియో తీశాను కానీ, 2 నిమిషాల వీడియో కూడా పరిమాణం పెద్దదైపోవడంతో అప్‌లోడ్ చెయ్యలేక పోయాను.

   ఈసారి మీకు పరీక్షలున్నాయని చొరవచేసి పిలవలేక పోయాను. వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకెళతాను.

 2. రవిచంద్ర గారు

  సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ కూడా మీరు ఈ పద్దతులు ఆచరిస్తున్నారు. నిజంగా అభినందనీయం. చాలామంది వీటిని పిచ్చిగా, మూర్ఖత్వంగా భావిస్తారు. పైపెచ్చు నామోషిగా అనుకొంటారు. నేను నిత్యం పూజ చేస్తున్నాను అంటే నా స్నేహితులు నవ్వుతుంటారు. 60 లలో చేయాల్సినది 20, 30 లలో చేస్తున్నానని అంటారు. కాని నేను అంటాను మొక్కై వంగనిది మానై వంగుతుందా అని.

  • అవునండీ… మనం ఎంత ఎదిగినా మన మూలాలు మరిచి పోకూడదన్నది నా తత్వం.ఎవరో ఏదో అనుకుంటారని మనం మనసుకు నచ్చే పనిని మానేయకూడదు. మనం చేసే పని మనల్ని సన్మార్గంలో నడిపించే టపుడు దాన్ని గురించి వెరవాల్సిన పని లేదు.

  • ఇది జరిగింది ఫిబ్రవరి 28, ఆదివారం నేను ఇంటికెళ్ళింది దీనికోసమే….

  • భక్తిలో నాకు ప్రహ్లాదుడు ఆదర్శం. ఆయన భక్తి ముందు నా భక్తెంత?…

  • ఇది అగ్రహారంలో జరిగింది కాదు. శ్రీకాళహస్తికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా స్వగ్రామం చేమూరు అనే ఒక కుగ్రామంలో జరిగింది.

వ్యాఖ్యలను మూసివేసారు.