కలత చెందిన మనస్సుతో..

కలత చెందిన మనస్సుతో రాస్తున్న టపా ఇది.ఈ రోజు ఆఫీసుకు వస్తూ సైబర్ టవర్స్ దగ్గర ఆటో దిగాను. రోడ్డు పక్కనే తైల సంస్కారం లేని తలతో, మాసిన బట్టలతో ఒకతను రోడ్డు మీద పడి దొర్లాడుతున్నాడు. ఆ  ఇలాంటి దృశ్యాలు సాధారణమే కదా… ఫుల్లుగా తాగడం, రోడ్ల మీద పోడి దొల్లడం. అనుకుని చిరాకుగా ముందుకు సాగబోయాను.

ఆ గుంపులో ఒక మనిషి నన్ను ఆపి ఒక డబ్బా నా చేతికిచ్చి యే క్యా హే.. అన్నాడు. నాకు ఒక్క నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు. అతను ఆదుర్దా పడుతూ అదే ప్రశ్న రెట్టించే సరికి ఆ పెట్టె తెరిచి చూశాను. అందులో ఒక మూత తీసిన ఒక చిన్న సీసా ఉంది. నాకర్థం కాలేదు. మేరే కో పతా నై.. అన్నాను. అతను అదే ఆత్రుతతో మళ్ళీ అదే ప్రశ్న వేసేసరికి నా అనుమానం బలమైంది. ఆ డబ్బా పైన పాయిజన్ అని రాసుంది.

అంతే క్షణం ఆలస్యం చెయ్యకుండా 108 కి ఫోన్ చేశాను. గ్లోబల్ సెంటర్ వాళ్ళు వివరాలడిగి తెలుసుకుని మళ్లీ కాసేపటి తర్వాత హైదరాబాదు ఆఫీసు నుంచి ఫోన్ చేశారు. వాళ్ళకి కూడా వివరాలందించి ఆ వాహనం వచ్చేదాకా అక్కడే ఉందామనుకున్నాను. కానీ ఈ లోపు భాదితుడి తమ్ముడు అనుకుంటా అక్కడికి వచ్చేశాడు. నేనక్కడే ఉండటం చూసి సార్ వ్యానొస్తే మేం తీసుకెళతాము లెండి మీరు ఆఫీసు కెళ్ళండి అన్నాడు. సరే దగ్గర బంధువులు ఉన్నారు కదా అని ఆఫీసుకు వచ్చేశా. అప్పటి నుంచి ఒకటే ఆదుర్దా… అతన్ని తీసుకెళ్ళారో లేదో.. అని. అక్కడే ఉండుంటే బాగుండు కదా అని… కానీ అతను బతుకుతాడని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నేను అక్కడ ఉన్నంత సేపు పూర్తి స్పృహలోనే ఉన్నాడు. సగం విషం తీసుకోగానే పక్కన ఉన్నవాళ్ళు వారించినట్లున్నారు. అతను బతికి బయట పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించినపుడు ఒక్క క్షణం ఆగి వాళ్ళు నిజంగా ఆపదలో ఉన్నారా అని ఆలోచించి ముందుకు కదలండి. ఎందుకంటే ఆ గుంపులోని వ్యక్తి నన్నాపకపోతే కచ్చితంగా నాకా విషయం తెలిసేది కాదు, అతనికి అంత తొందరగా సహాయం అందేది కాదు.

తాజా స్థితి గతులు:

 • ఇప్పుడే 108 కి ఫోన్ చేశా అతని స్టేటస్ కనుక్కుందామని. ఆంబులెన్స్ వచ్చి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇంకో గంట తర్వాత ఫోన్ చేస్తే వివరాలు చెబుతామన్నారు. మళ్ళీ ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తా…
 • 5:40PM ఇప్పుడే 108 కి ఫోన్ చేస్తే అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారనీ వాళ్ళ బంధువుల ఫోన్ నంబర్ ఇచ్చారు. అతను మామూలుగా మాట్లాతున్నాడట కానీ డాక్టరు వచ్చి చెబితే  కచ్చితంగా తెలుస్తుందని చెప్పాడు.

20 thoughts on “కలత చెందిన మనస్సుతో..

 1. ఇలాంటిదే ఒక సంఘటన నా కళ్ళ ముందు జరిగింది. ఒక పెద్దాయన బైక్ మీద వెడుతూ మొబైల్ లో మాట్లాడుతున్నాడు. వెనుక సీట్లో ఆయన తల్లి కూడా ఉంది. ఆయనలా మాట్లాడుతూ వెళ్ళి ఆగి ఉన్న లారీని వెనుకవైపు ఢీ కొట్టాడు. ఆ దెబ్బకి ఎడమచెంప చెవి పైనుండి క్రింద వరకు నిలువుగా చీరుకుపోయి రక్తం పైకి చిమ్మింది. చెవి దగ్గ బాగా విడిపోయింది. నేను అంత ధైర్యంగా చూడటానికి కారణం మెడికల్ ట్రాన్ స్క్రిప్షన్ నేర్చుకున్నను. ఆ ఆసక్తి వలన. ఓ రెండు నిమిషాలు అతను గిలగిలా తన్నుకొని ఆగిపోయాడు. అయిపోయాడేమో అనుముకున్నము. ఆయన తల్లికి కొద్దిగా దెబ్బలు తగిలాయి. ఆవిడేమో ఏడుస్తూ తన కొడుకుని రక్షించమని అడుగుతోంది. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చాడు, కాని అతని దగ్గరికి వెళ్ళడం లేదు. నాకు మాత్రం అతను లీలగా కదులుతున్నట్టు అర్థమయింది. వెంటనే పోలీస్తో దగ్గరలోనే ఎమర్జన్సీ ఆసుపత్రి ఉన్న విషయం నేను, అక్కడున్నవారు కూడా చెబితే అప్పుడు అతను అంబులెన్స్ కోసం ఫోన్ చేసాడు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుంది కదా ఆటోలో తీసుకువెడితే మంచిది అని చెప్పాను. ఎందుకంటే ఆ ఆసుపత్రి ప్రమాదం జరిగిన వీధి చివరలోనే ఉంది. ఏమనుకున్నడో ముందు తటాపటాయించి తర్వాత ఆటోలోనే తీసుకెళ్ళాడు. ఈలోపుగా నేను ఆ ముసలావిడని అడిగి అతని మొబైల్ లో ఉన్న వాళ్ళింటి నెంబరుకు ఫోన్ చేసి నెమ్మదిగా విషయం చెప్పాను. అదృష్టం ఏమంటే అతను బ్రతికాడు. నేను రోజు ఆఫీస్ కి వెళ్ళే దారిలో అతను నాకు ఎదురొస్తాడు. అతను హార్లిక్స్ ఫాక్టరీలో పనిచేస్తున్నాడు. కాని నేను తెలియదు.

  బుర్ర తిన్నానని అనుకోవద్దు. కళ్ళ ముందు జరిగిన ప్రమాదం కదా చాలా రోజులు మరిచిపోలేకపోయాను. ఈరోజుకి కూడా.

 2. మంచి పని చేసారు. అతను తప్పకుండా కోలుకుంటాడు. తోటి మనిషిగా మీరు చెయ్యగల్గింది సమయానికి చేసారు. చెయ్యని వారు కలత చెందాలి.

  సుధ

 3. మీకు వీలుంటే ఆ చుట్టు ప్రక్కల ఉండే వాళ్ళని అతని గురించి అడిగి తెలుసుకోండి. అతని క్షేమ సమాచారం తెలుస్తుంది. మనమేమి చేయలేకపోవచ్చు. కాని అతను బ్రతికుంటే మీకు ఒక మంచి జ్ఞాపకం అవుతుంది. తప్పక అతను బ్రతుకుతాడని ఆశిద్దాం.

 4. మంచి పని చేశారు రవీ! పాపం, ఎంత కష్టం వచ్చిందో ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడంటే!

  అతను కోలుకుంటే బావుండు.

 5. మంచి పనిచేసారు. యింకా ఆగి వుండి తనను తేసుకెఏ౦తవరకు వుంటే మీకీ ఆడుర్తా వుండేది కాదు. అయినా మీ సహాయం వలన ఆయన బతికి వుండాలని ఆశిస్తున్నా.

 6. స్పందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారనీ మామూలుగా మాట్లాడుతున్నారని చెప్పాడు వాళ్ళ బంధువొకాయన. అయితా డాక్టరొచ్చి చెప్పేదాకా కచ్చితంగా out of danger అని చెప్పలేదు.

వ్యాఖ్యలను మూసివేసారు.