మా ఊరికి పట్టిన మద్యపాన భూతం

నేను ఎప్పుడైనా ఊరికెళితే చాలు “ఏం నాయనా రవే… బాగుండావా… నువ్వు బాగా సదూకుని మంచి ఉజ్జోగం లో చేరి మనూరి పేరు నిలబెట్టాల”  అని నోరారా పలకరించే వాడు, మనసారా దీవించే వాడు, మా ఊర్లో బూశాయన కొడుకు, పేరు మునిసుబ్బారెడ్డి*. ఈ మధ్యనే మద్యపాన మహమ్మారికి బలైపోయినాడు.

నేను చిన్నప్పుడు మా ఊర్లో సారా దుకాణాలు పెద్దగా ఉండేవి కావు. కానీ ఊరంతా స్వచ్ఛమైన తాటికల్లు మాత్రం బాగా దొరికేవి. ఎంత స్వచ్ఛమైనవంటే అలా చెట్టుమీద నుండి దించి ఆ చెట్టుకిందే అమ్మేసే వాళ్ళు. మద్యలో మేం పిలకాయలం ఎవరైనా లోటా ఎత్తుకుని పోతే గీత కార్మికులు మాకూ కొన్ని పోసేవాళ్ళు ఉచితంగా…

ఏంటి చిన్నపిల్లలు కూడా కల్లు తాగేవాళ్ళా అని ఆశ్చర్యపోకండి. మాకది అలవాటే. పెద్దవాళ్ళు కూడా అభ్యంతరపెట్టేవాళ్ళు కాదు కదా కొన్నిసార్లు కొద్దిగా పుచ్చుకోమని కూడా సలహా ఇచ్చేవాళ్ళు. అయితే దానికి ఓ పరిమితి ఉండేది. మామూలుగా అయితే ఓ లోటా, మహా అయితే ఒక చెంబుడు అంతే. ఎండా కాలంలో కల్లు మంచి చలవ చేస్తాయి కూడా. స్వచ్చమైన కల్లు ఆరోగ్యానికి పెద్దగా హానికరం కూడా కాదు.

అంత వరకు బాగానే ఉండేది మా ఊరు. తరువాత ఎక్కడి నుంచి వచ్చిందో సారా భూతం, మా ఊరి మీద పడింది. ఈ సారా తయారీలో నానా చెత్త వాడేవారు. ఈ భూతానికి దాసోహమైన చాలా మందిలో మునిసుబ్బారెడ్డి ఒకడు. సారాతో పోటీ తట్టుకోవడానికి కల్లును కల్తీ చెయ్యడం మొదలైంది. అక్కడి నుంచి ప్రారంభమైనాయి తాగేవారి ఇళ్ళలో కుటుంబ కలహాలు. నెమ్మదిగా వారి ఆరోగ్యాలు కూడా దెబ్బతినటం ప్రారంభించాయి.

మునిసుబ్బారెడ్డికి కొంచెం కోపం ఎక్కువ. మరి తాగున్నాడంటే ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడే వాళ్ళు. అలా ఒక రోజు తాగేసి ఇంటికి వచ్చి అలాగే మేడపైన గదిలో పడుకుండి పోయాడు. ఇంట్లో వాళ్ళు ఆయన కోపానికి భయపడి ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే గొంతు ఎండిపోయి నిద్రలోనే ప్రాణాలు విడిచేశాడు. తెల్లవారి వెళ్ళి తలుపు తీసిన ఆయన భార్య శోకానికి అంతే లేదు. ఆమెకు పెళ్ళై మూడేళ్ళు కూడా కాలేదు. ఆమె మా క్లాస్‌మేట్ కి స్వయానా అక్క. అంత చిన్న తనంలోనే భర్తనుపోగొట్టుకున్న ఆమె, అక్క దురదృష్టాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న మా స్నేహితుడు, వీళ్ళను చూసి ఆ ఊర్లో కంటతడి పెట్టని వారు పాపాత్ములు.

ఒక్క తాగుడు అలవాటు పక్కన పెడితే అతను మిగతా విషయాల్లో గ్రామస్తులకు ఇష్టమైన వాడే. అకారణంగా తాగుడికి బలైపోవడం ప్రజలను కలచి వేసింది. మరునాడే గ్రామ పెద్దలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక మీదట గ్రామంలో మద్యం అమ్మడానికి లేదంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం అమ్మకాన్ని సమర్థించే వాళ్ళు మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.

కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అడిగే నాధుడేడీ? ఎవరైనా ధైర్యం చేసి అడిగిన వాళ్ళకి తాగుబోతులు బూతులతో సత్కారం చేసే వాళ్ళు. ఎవరి పనులు వాళ్ళవి.. ఎవరికి వారే యమునా తీరే…మళ్ళీ మరో ఇల్లాలి వైధవ్యానికో, ఓ కన్నతల్లి కడుపుకోతకో ఇదే నాంది…

ఇలా తాగుడుకు బానిసలైన వారి కుటుంబ సభ్యులు వారిచేత పూర్తిగా తాగుడు మానిపించడం సాధ్యం కాక “ఎప్పుడో ఏ యాళనో అయితే సరే… ఇట్ట రోజు నువ్వు సంపాదించింతా ఖర్చు పెట్టి తాగొచ్చి ఇంటి మీద పడి గొడవ చేస్తా ఎట్టా? మన సంసారం ఎట్ట జరగాల…మన బ్రతుకులెలా తెల్లారతాయి” అని వాపోతుంటారు. అయినా సరే వాళ్ళకివేం పట్టవు. ఈ చెవిలో విని ఆ చెవిలో అలా వదిలేస్తారు.

*పేరు మార్చాను

ప్రకటనలు

3 thoughts on “మా ఊరికి పట్టిన మద్యపాన భూతం

  1. This is an example that complete ban of liquor is impossible. It is very difficult(impractical) that an addict could leave the habit at once or forever, so he would look for alternate ways. When there is demand mafia starts to produce cheap liquor. Making liquor available in ‘restricted’ way is a solution for this. Govt should maintain limited liquor shops in limited hours. That is only possible if govts act cleverly with committment.

  2. జనానికి భయం పట్టుకుంది .తప్పును ఎదిరించలేని తీవ్రమైన పిరికితనం .దీనికి పరిష్కారమొక్కటె జనంలో ఆవేశం రగలాలి .అంటే ఎక్కువమంది ఈ సారాతో చావాలి. అప్రతి ఇంట్లో ఆదు:ఖాన్నుంచి గాని ఆవేశం పుట్టదు . అంతవరకు ఎవరు మనం గొంతుచించుకుని అరిసినా స్పమ్దించరు అని అర్ధమై పోయింది . బాధాకరమైన పరిష్కారమేగాని అది తప్ప మరో పరిష్కారం లేదు మరి.

వ్యాఖ్యలను మూసివేసారు.