రంగుల “మాయ”

ఈ రోజు రంగుల్లో సరికొత్తగా ముస్తాబై మనముందుకు వచ్చిన మాయాబజార్ చూడ్డానికెళ్ళాను. ఆఆ… ఇక్కడ నేనేదో సమీక్ష రాయడం లేదు. ఇప్పుడు కొత్తగా విడుదలయ్యే సినిమాలను చీల్చి చెండాడుతూ సమీక్షలు రాసే సిరాశ్రీ  ఈ సినిమాకు రివ్యూ రాసే సాహసం చేయనంటూ పక్కకు తప్పుకున్నారు. అవును మరి ఒక సినిమా బాగుందో లేదో తేల్చాల్సింది ప్రేక్షకులు. అలాంటిది విడుదలైన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్న ఈ సినీ వినీలాకాశ ధృవతార గురించి ఏమని రాయగలం?.

ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు కాబట్టే మళ్ళీ చూడాలనిపించింది. థియేటర్‌లో ఊహించని దానికంటే జనం బాగానే వచ్చారు. రంగుల్లో పాత్రధారులంతా బాగ మెరిసిపోతూ కనిపించారు. కిరీటాలు, ఆభరణాలకు, భవనాలంకరణలు రంగుల్లో కొత్త శోభలు సంతరించుకున్నాయి. కాకపోతే అక్కడక్కడ తీయటి పాయసంలో మెంతి గింజల్లాగా రీమిక్స్ చేసిన సంగీతం అపశ్రుతులు పలికించింది. పాత ఫిల్ము బాగా పాడవటంతో “భళి భళి భళి భళి దేవా” అనే పాటతో పాటు అనేక చోట్ల కొన్ని సన్నివేశాల్ని తొలగించారు.  అయితే ఇవేవీ పెద్దగా అసంతృప్తిని కలిగించలేదు. యస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్ కనిపించినపుడు హాల్లో ఈలలు, చప్పట్లు, రేలంగి కనిపించిన వెంటనే దద్దరిల్లిన నవ్వులు వారి అజరామరమైన నటనకు ప్రతీకలు.

“మాయాబజార్” తెలుగు సినిమాలకు  శాశ్వత చక్రవర్తి. దానికి తిరుగులేదు.

12 thoughts on “రంగుల “మాయ”

 1. నేను కూడా చూశానండీ,.. బెంగళూరు లో విడుల కాకపోయున మదనపల్లి కి వెళ్ళి చూశాను!
  చాలా సన్నివేశాలు తొలగించినా కూడా మునుపటి లాగానే బాగుంది( వేరే ఇతర సినిమా లేనంతగా),..
  అస్సలు ఆ వంటల సన్నివేశంలో వేడిగా ఉన్న పదార్థాల పైన వచ్చే పొగలు కూడా చాలా చక్కగా చూపించారు.!!
  నాకు చాలా బాగా నచ్చిన ‘మోహినీ భాష్మాసుర’ సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు!!

  • వారెవా… మీ అభిమానానికి జోహార్లండీ…
   ఆ పొగలు వచ్చే సన్నివేశం నిజంగా అద్భుతం….

 2. “మాయాబజార్” తెలుగు సినిమాలకు శాశ్వత చక్రవర్తి. దానికి తిరుగులేదు…..బాగా చెప్పారండీ

  అది ఇప్పటికీ ఎప్పటికి నా ఫేవరెట్ సినిమా, ఇప్పటికో 25-30 సార్లు చూసుంటాను.

  మోహిని భస్మాసుర నాకు చాలా ఇష్ట్మ, అయ్యో అది తీసేసారా?
  అయినా సావిత్రి గారిని చూస్తూ ఉంటే ఎంతయినా తనివితీరదు. ఫొటోలు చూసాను. భలే కళ గా ఉన్నాయి.

  • >>ఇప్పటికీ ఎప్పటికి నా ఫేవరెట్ సినిమా
   ఈ ముక్క మీరు చెప్పాలా… మీ బ్లాగు పేరు చూస్తే అర్థం కాదూ మీరెంతగా ఆ సినిమాను అభిమానిస్తారో… 🙂

 3. హ్మ్.ఇప్పుడే చూసొస్తున్నా…రీ రికార్డింగు అన్నం మధ్యలో పలుకు రాళ్ళలాగా అడ్డంపడి మింగుడుపడలేదు..సన్నివేశాలు చాలా కత్తిరించారు..నా పక్కన ఓ డెభ్భయ్యేళ్ళ పెద్దాయన కూర్చున్నారు..సినిమా జరుగుతున్నంత సేపూ ఆ డొక్కు హార్మొనీ సంగీతం (ఉన్నఒక్క పద్యాన్నీమింగేసేసరికి)రీరికార్డింగుని తిడుతూనే(మాధవపెద్ది వింటే ఎంత బాధపడతాడో అని) ఉన్నారు..పాటలు,సన్నివేశాలు కత్తిరించినప్పుడు ఉస్సురని నిట్టూరుస్తూనే ఉన్నారు..చివరగా లేచివెళ్ళేప్పుడు,పక్క థియేటర్లో పాత సినిమా అలానే రిలీజ్ చేస్తే అదే బాగా ఆడుతుందేమో అంటూ వెళ్ళారు..నాకూ కొంతవరకు అలానే అనిపించింది..

 4. మాయాబజార్ అంటే నాకు గుర్తొచ్చేది వివాహ భోజనంబు, లాహిరి లాహిరి లాహిరిలో పాటలే. నాకు చాలా ఇష్టమైనవి. సాంఘికమైన, పౌరాణికమైన పాత సినిమాలంటే నాకు ఇష్టం. నా స్నేహితులు మాత్రం నా ఇష్టాన్ని చూసి నవ్వుకుంటారు. వారు అంతా అల్ట్రా మోడ్రన్ అనుకుంటారు. ఇంకా సినిమా చూడలేదు వీలు చూసుకుని వెళ్ళాలి

  • నేను కూడా పాత పాటలంటే చెవి కోసుకుంటాను. నన్ను కొంత మంది ఇరవయ్యేళ్ళ ముసలాడు అంటారు. ఎవరిష్టాలు వాళ్ళవి… నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకోవాలంతే… 🙂

 5. అద్బుతం నిన్ననే చుసాను, కొన్ని చోట్ల ఆ కాలం లో కూడా ఎలా తీసారో అర్ధం కావడం లేదు
  నిజంగా అప్పటి దర్సకులు ఎంత తెలివైన వారో అర్ధం అవుతుంది. ఇప్పటి సినిమాలు ఎలాగూ చుడదగ్గవి గా లేవు గా బట్టి పాత సినిమా లలో మంచివి అంటే పాతాళభైరవి, జగదేక వీరుని కధ మొదలైనవి కలర్ లొ మారిస్తె మంచి వసూల్లు రాబట్ట వచ్చు మనలాంటి ఇరవై లొ అరవై యువకులకు మంచి ఇదన్నమాట.
  ఒక దగ్గర శకుని పాచికలు ఆట ట్రైల్ చూపిస్తాడు తరువాత భూమి కదులు తుంది భయంకరమైన ధ్యని వినిపిస్తుంది అది నిజంగా భయంగా ఉంటింది.
  ఇప్పటి ధర్సకులను తిట్టు కుంటూనే సినిమా అంతా చూసాను కారణం అప్పటి వాల్లు ఎంత బాగా తీయగలరో చూపారు ఇప్పటి వాల్లు ఎంత చెత్తగా తీయగలరో చూపుతున్నారు(అందరూ కాదు దుర్బుద్ది తో పరిశ్రమకి వచ్చిన వాల్ల గురించి మాత్రమే )

వ్యాఖ్యలను మూసివేసారు.