రంగుల “మాయ”

ఈ రోజు రంగుల్లో సరికొత్తగా ముస్తాబై మనముందుకు వచ్చిన మాయాబజార్ చూడ్డానికెళ్ళాను. ఆఆ… ఇక్కడ నేనేదో సమీక్ష రాయడం లేదు. ఇప్పుడు కొత్తగా విడుదలయ్యే సినిమాలను చీల్చి చెండాడుతూ సమీక్షలు రాసే సిరాశ్రీ  ఈ సినిమాకు రివ్యూ రాసే సాహసం చేయనంటూ పక్కకు తప్పుకున్నారు. అవును మరి ఒక సినిమా బాగుందో లేదో తేల్చాల్సింది ప్రేక్షకులు. అలాంటిది విడుదలైన దగ్గర్నుంచీ ఇప్పటిదాకా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్న ఈ సినీ వినీలాకాశ ధృవతార గురించి ఏమని రాయగలం?.

ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు కాబట్టే మళ్ళీ చూడాలనిపించింది. థియేటర్‌లో ఊహించని దానికంటే జనం బాగానే వచ్చారు. రంగుల్లో పాత్రధారులంతా బాగ మెరిసిపోతూ కనిపించారు. కిరీటాలు, ఆభరణాలకు, భవనాలంకరణలు రంగుల్లో కొత్త శోభలు సంతరించుకున్నాయి. కాకపోతే అక్కడక్కడ తీయటి పాయసంలో మెంతి గింజల్లాగా రీమిక్స్ చేసిన సంగీతం అపశ్రుతులు పలికించింది. పాత ఫిల్ము బాగా పాడవటంతో “భళి భళి భళి భళి దేవా” అనే పాటతో పాటు అనేక చోట్ల కొన్ని సన్నివేశాల్ని తొలగించారు.  అయితే ఇవేవీ పెద్దగా అసంతృప్తిని కలిగించలేదు. యస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్ కనిపించినపుడు హాల్లో ఈలలు, చప్పట్లు, రేలంగి కనిపించిన వెంటనే దద్దరిల్లిన నవ్వులు వారి అజరామరమైన నటనకు ప్రతీకలు.

“మాయాబజార్” తెలుగు సినిమాలకు  శాశ్వత చక్రవర్తి. దానికి తిరుగులేదు.