ఓ అలాగా….

ఓ గ్రామంలో నివసించే యువ జెన్ సన్యాసి చాలా నియమనిష్ఠలతో  కూడిన జీవితాన్ని గడుపుతున్నాడని ప్రజల్లో మంచి పేరుంది. ఆ సన్యాసి ఆశ్రమానికి దగ్గర్లోనే ఒక తినుబండారాలు అమ్మే ఒక కుటుంబం కూడా నివసించేది. ఆ కుటుంబంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. అకస్మాత్తుగా ఒకసారి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమె గర్భవతైందని గుర్తించారు. వాళ్ళకు బాగా కోపం వచ్చింది. ఆమెను ఎంత తిట్టినా, కొట్టినా అందుకు కారకులెవరో బయటపెట్టలేదు. చాలా రోజులు చెప్పమని వేధించిన తరువాత ఆమె సన్యాసి పేరు బయట పెట్టింది. వాళ్ళు అగ్గి మీద గుగ్గిలమైపోతూ ఆ సన్యాసి దగ్గరకు ప్రశ్నించడానికి వెళ్ళారు.

ఆ సన్యాసి అంతా విని ఇలా అన్నాడు.
“ఓ అలాగా…”

బిడ్డ పుట్టిన తరువాత అతని దగ్గరే తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటికే ఆ సన్యాసి పట్ల ప్రజల్లో ఉన్న గౌరవమంతా మంట గలిసిపోయింది. అయినా ఆ సన్యాసి చెక్కు చెదర్లేదు. ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచసాగాడు. ఆ బిడ్డకు కావాలసిన పాలు మొదలైనవి పక్కనున్న ఇళ్ళలో అడిగి ఎలాగోలా సంపాదించుకొచ్చేవాడు.

అలా ఓ సంవత్సరం గడిచింది. ఆ బిడ్డ తల్లి ఇక తట్టుకోలేకపోయింది. ఆమె తల్లిదండ్రులను పిలిచి నిజం చెప్పేసింది. ఆ బిడ్డకు నిజమైన తండ్రి పక్కన చేపల మార్కెట్లో పని చేసే మరో యువకుడని.

వాళ్ళు తక్షణమే ఆ సన్యాసి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరారు. జరిగిన సంగతి వివరించి తాము చేసిన పొరబాటుకు చాలా చింతిస్తున్నామనీ, తమ బిడ్డను తమకి తిరిగిచ్చేయమనీ కోరారు. ఆ సన్యాసి బిడ్డను తిరిగిచ్చేస్తూ ఇలా అన్నాడు.

“ఓ అలాగా….”

ప్రకటనలు

13 thoughts on “ఓ అలాగా….

  • నాకు ఆధ్యాత్మికత అంటే ఆసక్తి. అందులో భాగంగా ఆధ్యాత్మిక వెబ్‌సైట్లు సందర్శిస్తుంటాను. ఇది ఎక్కడ చదివానో సరిగా గుర్తులేదు.

 1. సన్యాసి కి బైరాగి కి తేడా అదే! చాలంజ్ లకోసం పొలాలు అమ్మేస్తా అని చెప్పే వాల్లే నిజమైన బైరాగులు
  ఇప్పుడు అంతా చెప్పండి “ఓ అలాగా” అని ;:)

 2. శ్రీ రవిచంద్ర గారికి, నమస్కారములు.

  “ఆధ్యాత్మికం” శీర్షికన మీరు వ్రాసిన కథలను చదివాను. అన్నీ చాలా చక్కగా, విజ్ఞానదాయకంగా వున్నాయి. అభినందనలు.

  భవదీయుడు,
  మాధవరావు.

  • నాకు నచ్చిన ఆధ్యాత్మిక విషయాలన్నీ ఇలా రాస్తుంటాను. అన్నీ చదివినందుకు ధన్యవాదాలు.

వ్యాఖ్యలను మూసివేసారు.