ఇక జన్మలో వాళ్ళ బస్సెక్కను

కేశినేని ట్రావెల్స్ వారు నాకు చేసిన ఘనమైన సేవకు కడుపు మండి ఈ టపా రాస్తున్నాను.
గత నెల 24న హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు టికెట్ బుక్ చేశాను. ఆ రోజు తెలంగాణా బంద్ కావడంతో సర్వీసులను నిలిపేశారు. ఆ సంగతి నాకు సరిగ్గా ప్రయాణం ఇక గంట ఉందనగా ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేశారు. సరే బంద్ లో వెళ్ళకపోవటమే మంచిదిలే అనుకుని సరిపెట్టుకున్నాను. తరువాత నాకు నరకమంటే ఏంటో చూపించారు . నా డబ్బులు ఎలా తిరిగి వస్తాయో తెలుసుకుందామని వెంటనే వారి కాల్ సెంటర్ కు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. ఫోను ఎత్తుతారు, ఎవరూ మాట్లాడరు. అలా నా సెల్లుకు పది రూపాయలు బొక్క పడ్డాక మళ్ళీ ప్రయత్నిద్దామని ఆపేశాను.
ఆ మూడు రోజులు e-తెలుగు కార్యక్రమాల్లో పాల్గొనడం మూలాన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేయడం వల్ల వాళ్ళే నా ఖాతాలో జమచేస్తామన్నారు. సరే అలా ఓ వారం రోజులు చూశాను. ఏమీ జరగలేదు. మళ్ళీ ఫోన్ చేశాను. వాళ్ళ గుమస్తా సెలవులో ఉండడం వల్ల ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. సరే నా సహనాన్ని మరింత పరీక్షిస్తున్నారనుకొని రెండు వారాలు ఎదురు చూశాను. లాభం లేదు. మళ్ళీ ఫోన్ చేశా. ఈ సారి వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకు కాలింది. నా డబ్బులు కావాలంటే నేనే వాళ్ళ బ్రాంచ్ ఆఫీసుకెళ్ళి తీసుకోవాలట. నా కోపాన్ని పంటి కింద బిగబట్టుకుని అలాగే వాళ్ళ ఆఫీసుకు వెళ్ళాను. ఇక అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానానికి నాకెంత కోపం వచ్చిందంటే “కేశినేని నా చేత చిక్కినేని నీ మక్కెలిరగదంతా” అన్నంత.
“ఇక్కడ మేము ఆన్ లైన్ టికెట్లకు డబ్బులివ్వం సార్. దానికి వేరే ప్రాసెస్ ఉంది ” అన్నాడు. నా కోపం నషాళానికంటింది.
“మరి నేను ఫోన్ చేస్తే అలాగే చెప్పారు మరి. కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి” అన్నాన్నేను కోపాన్ని అణుచుకుంటూ.
“ఏమో మాకు తెలియదు” అత్యంత నిర్లక్ష్యంగా వచ్చింది సమాధానం.
కోపాన్ని అణుచుకోవడం తెగ కష్టమైపోతుంది నాకు. నా డబ్బులు నాకు తిరిగివ్వడానికి ఇన్ని తిరకాసులా… ఏం చేద్దాం అనువుగాని చోట అధికుల మనరాదు మిన్నకుండి పోయాను. ఓ గ్లాసుడు నీళ్ళు గట గటా తాగేసి కొంచెం చల్లబడేదాకా కూర్చున్నాను ఏం చేయాలా అని ఆలోచిస్తూ…
కాసేపటి తర్వాత కాల్ సెంటర్ కి ఫోన్ చేసి “నాకు తక్షణమే డబ్బొచ్చే ఏర్పాటు చేస్తావా లేక వినియోగదారుల కేంద్రంలో కేసేయమంటావా ?” అని గట్టిగా అడిగాను. వాడు ఆఫీసు వాళ్ళతో ఏదో మాట్లాడి ఒప్పించాడు. వాళ్ళు మేనేజర్ రావడానికి ఓ అర్థ గంట పడుతుందని అక్కడ కూర్చోమని చెప్పారు. ఇవాళ నిద్ర లేచిన టైమ్ బాలేదనుకుని అక్కడే కూలబడ్డాను.
ఆ మేనేజర్ రాగానే నా టికెట్ చూపించి విషయం చెప్పాను. “ఇప్పుడు మేము బిజీగా ఉంటాం. ఇప్పుడొస్తే ఎలా” అంటూ విసుక్కున్నాడు.
“మరి మీరు చేసిన పని ఏమైనా బాగుందా. నన్ను నెల రోజుల నుంచీ ఆడిస్తున్నారు కదా” అన్నాను.
“ఇప్పుడు మేం బిజీ గా ఉన్నాం. ఏంచేసుకుంటావో చేసుకో ” అన్నాడు.
వాణ్ణి లాగి ఆ చెంపా ఈ చెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది. అసలేవనుకుంటున్నారు వీళ్ళు. కస్టమరంటే అంత చులకనా వీళ్ళకి? నన్ను నేను ఎలా నియంత్రించుకున్నానో నాకే తెలియదు. అవసరం మనది కదా అని వాడికి ఎలాగోలా సర్దిచెప్పి డబ్బులు తీసుకుని బతుకు జీవుడా అంటూ అక్కణ్ణుంచి బయటపడ్డాను. ఇంత ఘోరమైన సర్వీసు నేనెక్కడా చూడలేదు. అందుకనే ఒట్టేసుకున్నా.. కస్టమర్ అంటే గౌరవం లేని వాడి బస్సుని ఇక జన్మలో ఎక్కనని….
నేనెక్కకపోతే వాడికి ఏదో నష్టం వచ్చేస్తుందని కాదు. నేను కాకపోతే సవాలక్ష మంది. కానీ నాలాగా అవమాన పడ్డ కస్టమర్లు కడుపు మండి నలుగురికీ చెబితే మాత్రం వాళ్ళకు తప్పకుండా చెడ్డపేరొస్తుంది.

ప్రకటనలు

24 thoughts on “ఇక జన్మలో వాళ్ళ బస్సెక్కను

 1. Meeko vishayam cheppali. Nenu kooda janma lo Kesineni valla bus ekkakoodadu ani anukunnanu. Oka sari Vijayawada ki vellataniki ticket book chesukunte 10 ki ravalsina bus 12.00 ki vachindi. Ee lopu vallu nannu pettina yaathana intha antha kadu. Bus vellipoyindi, meeru time ki raledu ani vadinchesaru. Antha artha ratri etu povalo teleeka nenu, ela vastano emi jarugutondo teleeka maa parents tega tension paddaru. I hate their services.

  • నిజమే కావచ్చు. నేను సాధారణంగా దూరప్రయాణాలు బస్సులో చెయ్యను. రైల్లో వెళతాను. నేను ఆలస్యంగా నిర్ణయించుకోవడం వలన బస్సులో వెళ్ళాల్సొచ్చింది. మిగతా వాళ్ళు కూడా ఇలాగే చేస్తారేమో తెలియదు.

 2. కేశినేని ట్రావెల్సూ, మరోటీ, మరోటీ కాదండీ! కస్టమర్ సర్వీసు చాలా చోట్ల ఇలాగే ఏడిసింది. చాలా సార్లు ఇలాగే పోరాడి చివరకు విజయం సాధించినా, మనశ్శాంతి కోల్పోవడం మాత్రం తప్పదు. స్వీయానుభవాలు! 🙂

  ఇంతకీ, డబ్బు ఇంకా రాలేదా మరి?

  • >>అవసరం మనది కదా అని వాడికి ఎలాగోలా సర్దిచెప్పి డబ్బులు తీసుకుని బతుకు జీవుడా అంటూ అక్కణ్ణుంచి బయటపడ్డాను
   నేను అంత తేలిగ్గా వదలను కదా….. 🙂

 3. నిజమే బ్రదర్ ప్రైవేట్ ఆపరేటర్ సర్వీసులు మరీ ధారునం. గవర్నమెంట్ అర్.టి.సి బెట్టర్. నేను కూడ అందరికి చెబుతా.

  • గవర్నమెంటు సర్వీసుల్లో ఆన్ లైన్ రిజర్వేషన్ ఇంకా అంత పాపులర్ కాలేదు. చూద్దాం వాళ్ళైనా సరైన సర్వీసు నందిస్తారని ఆశిద్దాం.

  • నేను నా రెండో ప్రయాణంలోనే ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనడం బాధాకరం. డబ్బు తీసుకునే టప్పుడు ఉన్న శ్రధ్ధ తిరిగిచ్చేటపుడు ఎందుకుండదో వీళ్ళకి. నేనైతే చివరిదాకా పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి వసూలు చేసుకున్నాను. కానీ బద్దకస్తుల సొమ్ము వీళ్ళపాలే కదా….

 4. మీరు కూడా మా సంఘంలో చేరిపోయారు. ఇంకా వెరైటీ ఏమిటంటే ఒకే సీట్ నంబరు ఇద్దరికి ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుచావాలి. అది వాళ్ళకి వినోదం. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి నేను కూడా ఇలాంటి కష్టాలే పడ్డాను.

 5. ఈ మధ్య ఆర్ టి సి కూడా అలానే ఏడిసింది . మొన్నిమేధ్య తిరుపతి నుంచి అనంతపూర్ కి రిజర్వేషన్ చేయించుకున్న. బస్సు రాత్రి 10 కి. నేను 9.45 కే వెళ్ళిపోయా బస్సు స్టాండ్ కి. ప్లాట్ఫారం మొత్తం తిరిగి చూసా..కానీ బస్సు కనబడలేదు. నేను వాడిని ౧౦.౧౦ కి అడిగితే బస్సు వేల్లిపాయిందని చల్లగా చావు కబురు చెప్పాడు. నేను టికెట్ కాన్సుల్ చెఇన్హెసుకున్న తరువాత ఆ బస్సు స్టాండ్ లోకి వచ్చింది. ఎన్ని చెప్పిన వాళ్ళు రిజర్వేషన్ కౌంటర్ వాళ్ళు నా టికెట్ తిరిగి ఇవ్వలేదు. ఆకరికి తరువాత రోజు బస్సు ఎక్కా….. దిని వల్ల అర్త్ధమైనది ఏమిటంటే ట్రైన్ లో వెళ్ళడం ఎంతో సౌకర్యం అని…

  • మీరు చెప్పింది కరెక్టే… కస్టమర్ కు సరైన సమాచారం అందించడంలో అన్ని సంస్థలు విఫలమౌతున్నాయన్నది వాస్తవం. 🙂

 6. మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ http://www.jeevanianantapur.org ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.
  kathasv@gmail.com
  jeevani.sv@gmail.com

  మీ,

  జీవని.

 7. I sent a compliant to Kesineni Travels regarding this issue providing the link to this blog.

  Here is the reply from them.
  ————————————————–
  from: Satish Kumar D
  to: meetravindra@gmail.com
  cc: info@kesinenitravels.com
  date: Wed, Jan 27, 2010 at 10:35 PM
  subject: RE: Customer Feedback Details

  Dear Ravindra,

  We regret the inconvenience, We request you to provide your travel ( PNR ) and if you register a complaint with kesineni helpline complaint id no. to investigate in this issue and take appropriate action against the concern and pls do let us know at which branch you have collected the refund.

  With regards,
  Satish Kumar D
  Manager-Customer Support
  91-40-4477 1777

  • రవీంద్ర గారూ, మీ సహాయానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఇలా బ్లాగుల్లో కూడా సమస్యలు పరిష్కారమౌతాయని ఇప్పుడే తెల్సింది. నాకు ఆ రోజు మనశ్శాంతి లేకుండా చేసిన వాళ్ళ మీద తప్పకుండా ఫిర్యాదు చేస్తాను.

  • సత్యనారాయణ గారూ! వెయ్యాలనే ఉంది కానీ సమయం అనుకూలించకనే వదిలేశాను.

వ్యాఖ్యలను మూసివేసారు.