అమ్మ స్వగతం

నిన్న శనివారం అలా ఆరుబయట కూర్చుని మధురాంతకం రాజారాం కథలు చదువుతున్నాను. మధ్యలో ఫోన్ రావడంతో పుస్తకం అక్కడే పెట్టేసి మాట్లాడటానికి బయటకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చే సరికి మా అమ్మ ఆ పుస్తకం తిరగేస్తూ కనిపించింది.
నాకు తెలిసి మా అమ్మ చదువుకుంది ఆరో తరగతి వరకే. నా చిన్నతనంలో ఎప్పుడూ నన్ను అది చదువు ఇది చదువు అని ఎప్పుడూ సలహాలు ఇచ్చేది కాదు. బహుశ అందుకనే ఎప్పుడూ అమ్మ చదువును గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రచయితను గురించి అమ్మకెలా తెలుసు అని ఆలోచించా. అదేమాట మా అమ్మనే అడిగా. అందుకు ఆమె చెప్పిన సమాధానం ఇది.

“చిన్నప్పుడు నేనూ పుస్తకాల పురుగునే. ఇలాంటి రచయితల కథలన్నీ ఎంతో ఆసక్తిగా చదివేదాన్ని.
ఆ రోజుల్లో టీవీలు సీరియళ్ళూ ఎక్కడివి మాకు వినోదమంతా ఇట్లాంటి కథలు, నవలలతోనే. కనీసం నేను చదివిన చదువుక్కూడా నోచుకోని అమ్మలక్కలంతా కలిసి ఇలాంటి పుస్తకాలు నా చేతికిచ్చి చదవమనే వాళ్ళు. నేను చదివి విడమరిచి చెబుతుంటే వాళ్ళు ఊహల్లో విహరించేవాళ్ళు. సీరియళ్ళు, సినిమాలకూ పుస్తక పఠనానికి ఉన్న ఆసక్తికరమైన తేడా అది. సీరియళ్ళలో, సినిమాల్లో దర్శకులు తెరమీద ఏం చూపిస్తే అది చూడాలి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ పుస్తకం చదువుతుంటే మాత్రం ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు ఊహించుకోవచ్చు. కాబట్టి ఇందులో వినోదం పాళ్ళు ఎక్కువే కాకుండా మనిషి యొక్క సృజనాత్మకతకూ పదును పెడుతుంది. ఆర్థిక స్తోమత లేక, అప్పట్లో సమాజంలో ఉన్న కట్టుబాట్ల వల్ల నన్ను చదివించలేకపోయారు గానీ చదివుంటే నేను మంచి ఉద్యోగం చేస్తుండేదాన్ని. పోనీ ఇప్పుడు చదువుదామంటే రెండోసారి చిన్నపిల్లలైన మీ అమ్మమ్మ, తాతయ్యల సేవలో సరిపోతుంది. కానీ నువ్వు చదివేసిన తర్వాత ఆ పుస్తకాలు ఇక్కడే పెట్టి వెళ్ళు. నా కెప్పుడైనా తీరిక దొరికితే చదుతాను” అంది.

ఇప్పుడు మా అమ్మ ఒక యోగి ఆత్మకథ చదవడం ప్రారంభించింది. అప్పుడనిపించింది నాకున్న కొద్దో గొప్పో సాహిత్యాభిలాష అమ్మ రక్తం నుంచే వచ్చుంటుందని.

ప్రకటనలు

8 thoughts on “అమ్మ స్వగతం

  1. రవిచంద్ర గారూ..మా అమ్మ గారు కూడా ఏడవ తరగతి వరకే చదివారు..కాని తను చదివినన్ని పుస్తకాలు నేను కూడా చదవలేదేమో…మన పెద్దవాళ్ళ విజ్ఞానం తరగతుల కొలబద్దతో కొలవగలిగేది కాదని ఎప్పుడో డిసైడ్ ఐపోయా

  2. Oka Yogi Aatma Kadha manchi pustakam. Naa daggara telugu pustakala chinna paati library vundi… Nenu, maa tatagaru manchi telugu books collect chestamu… Mee ammagariki emaina kavalante cheppandi… istanu 🙂

  3. ఒక యోగి ఆత్మ కథ నేను చదివాను ,కాని నాకు గొప్ప పుస్తకం గా అనిపించలేదు .
    మధురంతం రాజారం కథలు చదివాను .బాగున్నాయి .రెండు పోల్చదగ్గవి కాకున్నా
    నా అభిప్రాయం ఇది .

    • మా అమ్మకు ఫలానా పుస్తకం చదివాలన్న కోరికేమీ లేదు. ఏ పుస్తకం కనబడినా చదువుతుంది.

వ్యాఖ్యలను మూసివేసారు.