ఎంత మంది మిత్రులో…

నాకు ఉద్యోగం వచ్చినపుడు, నా నియామక పత్రంలో  బెంగుళూరులో చేరతారా? హైదరాబాద్ లో చేరతారా? అని అడిగారు. బెంగుళూరులో ఎంత మంది బంధువులున్నా నేను భాగ్యనగరాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడైతే బాగా తెలుగు వినొచ్చు, మాట్లాడచ్చని నా ఆశ. చిన్ననాటి మిత్రులు, బంధువులు అందరూ బెంగుళూరులోనే ఉండటం వల్లా, మా స్వస్థలం శ్రీకాళహస్తి నుంచి బెంగుళూరు కేవలం ఆరుగంటల ప్రయాణమవడం మూలాన  మా ఇంట్లో వాళ్ళంతా అక్కడికే వెళ్ళమన్నారు. నేను మాత్రం అవన్నీ కాదని హైదరాబాద్ కే వచ్చేశాను.

ఒక సంవత్సరం దాకా నిస్తేజంగా గడిచిన నా జీవితంలోకి ఆరునెలల క్రితం బ్లాగు ప్రవేశించింది. తద్వారా బ్లాగర్లతో కలిగిన పరిచయాలు, వారి ద్వారా ఈ-తెలుగు పరిచయం, పుస్తక ప్రదర్శన ద్వారా వందల మందికి స్వయంగా కంప్యూటర్లలో తెలుగును స్వయంగా పరిచయం చేయడం, ఇదే ప్రదర్శనలో నేను ఇప్పటి దాకా టీవీలో మాత్రమే చూసిన కొంతమంది ప్రముఖులను, రచయితలను, రచయిత్రులను, విలేఖరులను స్వయంగా కలవడం అంతా కలలా జరిగిపోయింది. ప్రదర్శనకు వచ్చి మేము చెప్పే విషయాలు ఆసక్తిగా విన్న చాలా మంది అభిమానం, ఉత్సాహం, గౌరవం, భవిష్యత్ కార్యాచరణకు కావల్సిన బోలెడంత శక్తి నిచ్చింది. ఇప్పుడు నాకు హైదరాబాద్ లో నాకు బోలెడు మంది స్నేహితులున్నారు. అంతే కాదు నా బ్లాగుకు క్రమం తప్పకుండా వచ్చి చదివి తమ అభిప్రాయాలు వ్యక్తపరిచేవారు చాలా మంది మిత్రులయ్యారు. నేనో కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడానికి సహకరించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.