ఇది మీకు భావ్యమా?

తెలంగాణా విషయమై కొద్ది సేపటి క్రితం కేంద్ర హోం మత్రి చిదంబరం చేసిన ప్రకటన అందరూ స్వాగతించాల్సింది. కేసీయార్ నిరాహార దీక్ష దరిమిలా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ప్రక్రియ మొదలుపెడతాం అనే ప్రకటన వినగానే స్వంత పార్టీలోనే కాక అన్ని ప్రధాన పార్టీల్లోనూ అసంతృప్తి బయటపడిన మాట మనకందరకూ తెలిసిన విషయమే. ఈనెల ఏడవతేదీన జరిగిన రాష్ట్ర అఖిల పక్ష సమావేశంలో స్వార్థ రాజకీయాలకోసం అన్ని పార్టీలు వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోకుండా మీరు తీర్మానం ప్రవేశ పెడితే మేం  మద్ధతిస్తాం అనేశాయి.

అందరి అభిప్రాయాలూ పరిగణన లోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష నాయకులు గగ్గోలు పెట్టిన తతంగం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. అలాంటిది ఇప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని కేంద్రం ప్రకటిస్తే కొద్ది మంది నాయకులకు ఎందుకు రుచించడం లేదు? అసలు చర్చలంటే వీళ్ళకి భయమెందుకు?

ఓ పక్క కేసీఆర్ లాంటి నాయకులు కూడా తెలంగాణా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయొద్దనీ, సమస్యను రాజకీయంగా ఎదుర్కొంటామని ప్రకటిస్తుంటే, కాంగ్రెస్ తెలంగాణా విషయంలో మోసం చేసిందనడం నాగం జనార్ధన్ రెడ్డి లాంటి నాయకులకు ఎంతవరకు సబబు? ఇంకా ఎంతమంది అమాయకులను బలి చేస్తారు? అసలు వీళ్ళది నాలుకా? తాడిమట్టా? ఓ పక్క రాష్ట్రమంతటా అశాంతితో రగిలిపోతుంటే శాంతిని నెలకొల్పాలని కేంద్ర చేసిన ప్రకటనను అర్థం చేసుకుని ప్రజల్లో ఉన్న అనుమానాల్ని పోగొట్టాల్సింది పోయి ఇలా ప్రజలను రెచ్చగొట్టడం భావ్యమా?

కేసీఆర్ కారుకూతలు

ఇటీవల సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల గురించి కేసీఆర్ మీడియాతో అన్న మాటలు.

“ఈ ఉద్యమాలన్నీ స్పాన్సర్డ్ ఉద్యమాలు. వీటిని డబ్బులిచ్చి చేయిస్తున్నారు. సెల్ టవర్ ఎక్కితే పదివేలు. కిరోసిన్ ఒంటి మీద పోసుకుంటే పదిహేను వేలు. బస్సు అద్దాలు పగల గొడితే ఇరవై వేలు..” ఇలా ఒక జాబితా వెనకేసుకొచ్చాడు.

కేసీఆర్? తెలంగాణా ఉద్యమ కారులకు నువ్వు ఇదే రేట్లు చెల్లించావా?

ఉద్యమం ప్రజల సొత్తు. కడుపు మండితే, గుండె రగిలితే ఉద్యమాలు చేస్తారు. నీ లాంటి నీచ రాజకీయ నాయకుల పైసలకాశపడి ఎవరూ ఉద్యమాలు చేయరు.   ఉద్యమ కారుల్ని అవమాన పరచద్దు. తెలంగాణా కోసం నిజమైన  ఉద్యమం చేసిన ఎవరైనా కేసీఆర్ పైన చెప్పిన మాటలు సమర్థిస్తే అది ఆత్మ వంచన మాత్రమే.