ఎట్టకేలకు బయటపడ్డ జగన్

ఈ రోజు పార్లమెంటు సమావేశం జరుగుతుండగా తెలుగు దేశం పార్టీకి చెందిన ఎంపీలు సమైక్యాంధ్ర ప్లకార్డులను చేత పట్టుకుని తమ నిరసన తెలియజేయగా వై యస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఒక ప్లకార్డును చేతపట్టుకుని వారితో శృతి కలిపాడు.
ఓ పక్క తెలంగాణా ప్రాంతానికి చెందిన పది మంది కాంగ్రెస్ ఎంపీలు దీనికి వ్యతిరేకంగా నినాదాలు చూస్తున్నా వారిని పట్టించుకోలేదు.
దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రి మరియు క్రమ శిక్షణా వ్యవహారాలను పర్యవేక్షించే ఏ.కే ఆంటోనీ దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీ అయి ఉండీ తెలంగాణా కు వ్యతిరేకంగా టీడీపీతో గొంతు కలిపినందుకు అతనిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ప్రహసనమంతా చూస్తుంటే నాకు యమలీల సినిమాలో ఒక సన్నివేశం గుర్తొస్తోంది.

ఇందులో చిత్రగుప్తుడు (బ్రహ్మానందం) ఒక సారి పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అతన్ని కోట అరెస్టు చేయబోతాడు. యమా! అని అనగానే యముడు(సత్యనారాయణ) ప్రత్యక్షమవుతాడు.
అప్పుడు చిత్ర గుప్తుడు యముడితో కోటను ఉద్దేశించి
“ప్రభూ ఇతన్ని సల సల కాగుతున్న నూనెలో వేయించెదము ప్రభూ, అతి పదునైన శూలములతో పొడిపించెదము ప్రభూ… ఇంకా చాలా శిక్షలు విదిస్తాము” అంటాడు.
అశక్తుడు తమకు అవకాశం వచ్చినపుడు తమ బాధ ఎలా వెళ్ళబోసుకుంటారో భలే సరదాగా చూపించారు. కాంగ్రెస్ ఎంపీలను చూస్తే అదే గుర్తు వచ్చింది నాకు.
ఇంకా చిన్నతనంలో టీచర్లకు చాడీలు చెప్పే పిల్లలు గుర్తొచ్చారు. ఎలా అంటారా?
“సర్ వీడు చూడండి సార్ మన టీమ్ లో ఉండి కూడా పక్క టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఇతన్ని మన టీమ్ నుంచి తీసేద్దాం సర్” అని 🙂