మానవ సంబంధాలు వర్ధిల్లాలి….

మాది ఉమ్మడి కుటుంబం. మా నాన్న వాళ్ళు ఐదు మంది అన్నదమ్ములు. వాళ్ళందరికీ ఒకే చెల్లెలు, మా మేనత్త. నాకు ఐదేళ్ళ వయసులో మా అత్తకు పెళ్ళయింది. నాతో కలిసి మా చిన్నాన్న పిల్లలందరూ మేము ఆరు మంది అయినప్పటికీ నాకు మా అత్త అంటే ప్రత్యేకమైన అనుబంధం. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళగానే నేను అన్నం తినడానికి మా ఇంట్లో వాళ్ళంతా బుజ్జగించాల్సి వచ్చింది. మా అత్త వాళ్ళ అత్తగారింట్లో కొద్ది రోజులుండి మళ్ళీ మా ఇంటికి రాగానే గట్టిగా అల్లుకుని పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళద్దంటూ పట్టుకుని ఏడ్చేశాను. మా అత్త కూడా ఏడ్చేసింది. అలాంటి అనుబంధం మాది.

మళ్ళీ నేను ఇంజనీరింగ్ లో ఉండగా అనుకుంటా…ఈనాడు పేపర్లో ఒక వార్త చదివాను. తిరుపతికి చెందిన ఆరేళ్ళ ఒక చిన్న కుర్రాడికి మేనత్త అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెకు పెళ్ళై పోయి గూడూరు లో ఉన్న అత్తారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మరుసటి రోజు ఆ అబ్బాయి అత్త దగ్గరికి వెళ్తానని మారాం చేశాడు. మళ్ళీ కొద్ది రోజులకి ఇక్కడికే వచ్చేస్తుందని బుజ్జగించేశారు. వాడికి ఎలాగైనా మేనత్త దగ్గరికి వెళ్ళిపోవాలనిపిమ్చింది. బాడుగకు పిల్లలకిచ్చే చిన్న  సైకిల్ ఎక్కి అత్త దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. తిరుపతికి గూడూరుకి సుమారు 120 కిలోమీటర్లుంటుంది. తిరుపతి నుంచి కొద్ది దూరం వచ్చాక ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వస్తున్న ఒకాయన ఆ బాబును చూసి పక్కకు తీసుకెళ్ళి మొహమ్మీద నీళ్ళు చిలకరించడంతో లేచి కూర్చున్నాడు.

కొంచెం తేరుకున్నాక ఆ అబ్బాయిని ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. గూడూరు లో ఉన్న అత్త దగ్గరికి వెళుతున్నానని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మరి మీ అమ్మ నాన్నలతో చెప్పలేదా అని అడిగాడు. చెబితే అక్కడికి పంపించరనీ తనను ఎలాగైనా అత్త దగ్గరికి పంపించమనీ వేడుకున్నాడు. మేనత్తపై ఆ అబ్బాయి ప్రేమాభిమానాలకు కరిగిపోయిన ఆయన ఆ అబ్బాయిని తీసుకెళ్ళి గూడూరులో వాళ్ళ అత్త దగ్గర వదిలేశాడు. తన కోసం ఇంత సాహసం చేసిన మేనల్లుణ్ణి చూసి మురిపెంగా  ప్రేమతో హృదయానికి హత్తుకుంది. అంతే కాదు అన్నయ్యకు ఫోన్ చేసి వాడు తన్ను ఎప్పుడు చూడాలంటే అప్పుడు తన దగ్గరకు పంపాలని మాట కూడా తీసుకుంది.

ఈ కథనం చదివాక నాకు ఒకే మాట అనాలనిపించింది.

మానవ సంబంధాలు వర్ధిల్లాలి….

11 thoughts on “మానవ సంబంధాలు వర్ధిల్లాలి….

 1. మా నాన్న వాళ్ళు ఐదు మంది అన్నదమ్ములు. వాళ్ళందరికీ ఒకే చెల్లెలు
  అః ఎంత అదృష్టవంతురాలు మీ మేనత్త గారు అయిదుగురికి ఒకే చెల్లెలు…
  ఈ టపా మీ మేనత్త గారు చదివితే చాలా చాల సంతోషిస్తారు …

 2. మీరు వ్రాసింది చదివాక నా అనుబవం మీతో పంచుకోవాలనిపించింది. నా పెళ్ళి అయిన కొత్తలో మా అన్నయ్య కొడుకు 6 సంవత్సరాలు స్కూల్ నుండి మా ఇంటికి దాదాపు 5 కి.మీ నడిచి వచ్చేసాడు. మా వదిన చాల కంగారు పడ్డారు. ఎలా వచ్చాడో ఇప్పటికి అర్థం కాదు.నిజంగానే మానవ సంబందాలు వర్థిల్లాలి .

  సుధ

 3. కుటుంబ సంబంధాలు తెగిపోతున్న నేటి హైటెక్ యుగంలో మరల ఇలాంటి అనుబంధాన్ని గుర్తుచేసినందుకు థాంక్స్. నేనూ మీతో గొంతుకలుపుతున్నా.. మానవ సంబంధాలు వర్థిల్లాలి.

 4. Maadi kooda ummadi kutumbame… sarigga 6 nelala kritam nannu maa athagarintiki pamputu maa athalu, pinnulu, peddammalu entha kanta neeru pettaro taluchukunte ippatiki badha vestundi. Veelunna prati sari edo oka weekend Vanasthalipuram velli maa puttinti vallandarini palakarinchi vastanu. Naa adrustam koddi puttinillu, athagari illu oke colony lo, paiga nenu vunde city lone vunnayi. Maa akka koduku kooda naa pelli ayina oka nela patu pinni pinni ani benga pettukune sariki, valla inti daggara lone illu teesukunnamu. Vadiki koncham ooha vachaka appudu shift avvalani alochana. Enthaina manava sambandhalu alantivi.

 5. లలిత గారు చక్కగా రాసారు కానీ చదవడానికి కస్టంగా ఉంది తెలుగులొ రాస్తె బాగున్ను

వ్యాఖ్యలను మూసివేసారు.