తెలుగు బ్లాగుల దినోత్సవం

నేను బ్లాగు ప్రారంభించి ఐదు నెలలైంది. ప్రారంభించినప్పటి నుంచీ బ్లాగుల్లో ఎంతో మందితో పరిచయం కలిగింది. అప్పటి నుంచి నాకు ఇదో ప్రత్యేకమైన ప్రపంచమైపోయింది.

ఈ ఆదివారం అంటే 13 వ తేదీన హైదరాబాద్, యూసుఫ్ గూడ బస్తీ, కృష్ణకాంత్ ఉద్యానవనం లో తెలుగు బ్లాగుల దినోత్సవం జరుగుతుంది. సమయం సాయంత్రం మూడు గంటల నండి ఐదు వరకు ఉండవచ్చు.ఈ సమాచారం అధికారికంగా ఎక్కడా వెలువడలేదు కానీ సాధారణంగా ఇక్కడే జరుగుతుంటుంది.

తెలుగు బ్లాగులు రాసేవారు, చదివేవారు ఇక్కడకు వస్తే కలవాలని ఎంతో ఆశగా ఉన్నది. మీ కోసం ఎదురు చూస్తుంటాను.

మానవ సంబంధాలు వర్ధిల్లాలి….

మాది ఉమ్మడి కుటుంబం. మా నాన్న వాళ్ళు ఐదు మంది అన్నదమ్ములు. వాళ్ళందరికీ ఒకే చెల్లెలు, మా మేనత్త. నాకు ఐదేళ్ళ వయసులో మా అత్తకు పెళ్ళయింది. నాతో కలిసి మా చిన్నాన్న పిల్లలందరూ మేము ఆరు మంది అయినప్పటికీ నాకు మా అత్త అంటే ప్రత్యేకమైన అనుబంధం. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళగానే నేను అన్నం తినడానికి మా ఇంట్లో వాళ్ళంతా బుజ్జగించాల్సి వచ్చింది. మా అత్త వాళ్ళ అత్తగారింట్లో కొద్ది రోజులుండి మళ్ళీ మా ఇంటికి రాగానే గట్టిగా అల్లుకుని పోయి మళ్ళీ అక్కడికి వెళ్ళద్దంటూ పట్టుకుని ఏడ్చేశాను. మా అత్త కూడా ఏడ్చేసింది. అలాంటి అనుబంధం మాది.

మళ్ళీ నేను ఇంజనీరింగ్ లో ఉండగా అనుకుంటా…ఈనాడు పేపర్లో ఒక వార్త చదివాను. తిరుపతికి చెందిన ఆరేళ్ళ ఒక చిన్న కుర్రాడికి మేనత్త అంటే వల్లమాలిన ప్రేమ. ఆమెకు పెళ్ళై పోయి గూడూరు లో ఉన్న అత్తారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మరుసటి రోజు ఆ అబ్బాయి అత్త దగ్గరికి వెళ్తానని మారాం చేశాడు. మళ్ళీ కొద్ది రోజులకి ఇక్కడికే వచ్చేస్తుందని బుజ్జగించేశారు. వాడికి ఎలాగైనా మేనత్త దగ్గరికి వెళ్ళిపోవాలనిపిమ్చింది. బాడుగకు పిల్లలకిచ్చే చిన్న  సైకిల్ ఎక్కి అత్త దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. తిరుపతికి గూడూరుకి సుమారు 120 కిలోమీటర్లుంటుంది. తిరుపతి నుంచి కొద్ది దూరం వచ్చాక ల్యాంకో ఫ్యాక్టరీ సమీపంలో స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వస్తున్న ఒకాయన ఆ బాబును చూసి పక్కకు తీసుకెళ్ళి మొహమ్మీద నీళ్ళు చిలకరించడంతో లేచి కూర్చున్నాడు.

కొంచెం తేరుకున్నాక ఆ అబ్బాయిని ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. గూడూరు లో ఉన్న అత్త దగ్గరికి వెళుతున్నానని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మరి మీ అమ్మ నాన్నలతో చెప్పలేదా అని అడిగాడు. చెబితే అక్కడికి పంపించరనీ తనను ఎలాగైనా అత్త దగ్గరికి పంపించమనీ వేడుకున్నాడు. మేనత్తపై ఆ అబ్బాయి ప్రేమాభిమానాలకు కరిగిపోయిన ఆయన ఆ అబ్బాయిని తీసుకెళ్ళి గూడూరులో వాళ్ళ అత్త దగ్గర వదిలేశాడు. తన కోసం ఇంత సాహసం చేసిన మేనల్లుణ్ణి చూసి మురిపెంగా  ప్రేమతో హృదయానికి హత్తుకుంది. అంతే కాదు అన్నయ్యకు ఫోన్ చేసి వాడు తన్ను ఎప్పుడు చూడాలంటే అప్పుడు తన దగ్గరకు పంపాలని మాట కూడా తీసుకుంది.

ఈ కథనం చదివాక నాకు ఒకే మాట అనాలనిపించింది.

మానవ సంబంధాలు వర్ధిల్లాలి….