మిథ్య

ఒక రాజు ప్రియాతి ప్రియమైన తన కుమార్తె కోసం ఒక అందమైన వజ్రాల హారం చేయించాడు. అకస్మాత్తుగా  ఆ హారం  దొంగిలించబడింది.  ఎంత వెతికినా దొరకలేదు. చివరకు రాజు ఎవరైతే ఆ హారాన్ని కనుగొంటారో వారికి యాభైవేల వరహాలు బహుమానం దక్కుతుందని ఒక చాటింపు వేయించాడు.

ఒక రోజు చిన్న గుమాస్తా ఒక నది వెంబడి నడుస్తూ ఇంటికి వెళ్తున్నాడు. ఆ నదిలో ఇళ్ళలో మురికి నీరంతా చేరి ఉండటం వలన భరించలేని దుర్వాసన వస్తోంది. అలా నడుస్తుండగా అతనికి నదిలో ఏదో మెరుస్తూ కనబడింది. కొంచెం దగ్గరికి వెళ్ళగా అది వజ్రాల హారంగా గుర్తించాడు. దాన్ని ఎలాగైనా సేకరించి రాజుకు అప్పగించి యాభైవేల వరహాలు బహుమానం పొందాలనుకున్నాడు.

నదిలో కొంచెం దిగి ఆ నీళ్ళలో చేయి పెట్టి హారాన్ని లాగాడు. కానీ అది చిక్కలేదు. చేయి అక్కడి నుంచి తీసేసి మళ్ళీ చూశాడు. హారం అక్కడే ఉంది. మళ్ళీ ప్రయత్నించాడు. ఉహూ మళ్ళీ జారిపోయినట్లుంది చేతికి రాలేదు.  ఈ సారి మరింత లోతు నీళ్ళలోకి దిగి చేతితో అంతా కలియబెట్టి చూశాడు. లాభం లేదు. ఆశ్చర్యంగా అది అతనికి దొరకడం లేదు.

నిరాశతో అందులోంచి బయటకు వచ్చి ఇంటి వైపు నడవడం ప్రారంభించాడు. ఆ హారం అతనికి ఇంకా అక్కడ కనిపిస్తూనే ఉంది. ఈసారి అతనికి ఎలాగైనా ఆహారాన్ని సంపాదించాలనే గట్టి పట్టుదల ప్రవేశించింది. మనిషి మొత్తం ఆ మురికి నిళ్ళలో మునిగి  ఆ హారం కోసం ప్రయత్నించాడు. దొరకలేదు. అతనికి విపరీతమైన ఆశ్చర్యం వేసింది. ఇక లాభం లేదనుకుని తనకు అది ప్రాప్తం లేదనుకుని నిర్ణయించుకుని బయటకు వచ్చేశాడు.

సరిగ్గా అదే సమయానికి ఒక సన్యాసి అటుగా వెళూతూ, మురికి బట్టలతో ఉన్న అతన్ని చూసి విషయమేంటని అడిగాడు. అతనికి ఆ సన్యాసితో రహస్యం పంచుకోవడానికి ఇష్టం లేదు. చెబితే అతనే ఆ హారం తీసుకుని రాజుకిచ్చేస్తాడేమోనని అతని భయం. అందుకే సన్యాసికి చెప్పడానికి నిరాకరించాడు.

ఆ సన్యాసి నెమ్మదిగా విషయం గ్రహించి, దయగలవాడై అతని సమస్య ఏమిటో చెప్పమనీ అతను దాని గురించి ఎవరికీ చెప్పనని ప్రమాణం చేశాడు. దాంతో ఆ గుమస్తా కు కొంచెం నమ్మకం కలిగి ఆ హారం గురించి, దాని కనుగొన్న వారికి లభించే బహుమతి గురించి, తానెలా దాన్ని అందుకోవడానికీ ప్రయత్నించి విఫలమైందీ వివరించాడు.

ఆ సన్యాసి నెమ్మదిగా “ఎంత సేపూ ఈ మురికి నీటిలోనే ఎందుకు చూస్తావు? పైకి చూడు, ఆ చెట్టు కొమ్మల వైపు చూడు” అన్నాడు. అలాగే చెట్టు వైపు చూసిన గుమస్తాకు హారం చెట్టు కొమ్మలకు వేళ్ళాడుతూ కనిపించింది. మరి ఇంత వరకు నీళ్ళలో దాని ప్రతిబింబాన్ని పట్టుకుని లాగితే ఎలా వస్తుంది?. అతను సిగ్గు పడి ఆ యోగికి నమస్కరించి వెళ్ళిపోయాడు.