రిక్షావాలాతో ఒక ఉదయం

ఈ వారాంతంలో మా బీటెక్ స్నేహితుడు శ్రీకాంత్ రిసెప్షన్ కోసం నెల్లూర్ వెళ్ళాను. పనిలో పనిగా మా అక్క వాళ్ళు పెట్టిన కొత్త గిఫ్ట్ షాప్ కూడా చూసినట్లుందని కూడా నా పథకం. కొంచెం ముందుగా అయితే రైలు దొరికేది కానీ సమయాభావం వల్ల బస్ కి టికెట్ బుక్ చేశాను. ఎంత వోల్వో బస్ అయినా నాకు రైలు ప్రయాణమంత సౌకర్యంగా అనిపించలేదు.

నెల్లూర్ లో దిగగానే ‘ఆటో సర్’ అంటూ ఆటో వాళ్ళు చుట్టుముట్టారు. వాళ్ళ వెనుక మమ్మల్నెందుకు పిలుస్తార్లే అని చేతులు నలుపుకుంటూ ఒక వారగా నిల్చుని ఉన్నారు రిక్షా వాళ్ళు. చాలా పట్టణాల్లో రిక్షా వాళ్ళు తగ్గిపోయినా నెల్లూరులో మాత్రం ఇంకా కాలంతో పోటీ పడుతూనే ఉన్నారు.  అందుకనే వాళ్ళంటే నాకు అభిమానం.

ఆటో వాళ్ళనందరినీ తప్పించుకుని ఏదో ఆలోచిస్తూ రిక్షా మీద కూర్చున్న రిక్షా అతని దగ్గరికెళ్ళి “కోటమిట్ట కు వస్తావా” అని అడిగాను.

చటుక్కున రిక్షా దిగి టవల్ తో సీటు శుభ్రంగా తుడిచి “రండి సర్ కూర్చోండి. వెళదాం” అన్నాడు.

నేను మామూలుగా రిక్షా వాళ్ళని ఎంత తీసుకుంటావని అడిగను. వాళ్ళ మీద నాకున్న నమ్మకం అలాంటిది. ఆటో వాళ్ళంతా విచిత్రంగా నా వైపు చూస్తుండగా రిక్షా ఎక్కి కూర్చుని వెళ్ళమన్నాను.

కొద్ది దూరమయ్యాక ” ఏమయ్యా ఈ ఆటోలు వచ్చింతర్వాత మిమ్మల్నెవర్నైనా పిలుస్తున్నారా అసలు?”

“ఏదో ఇలా ఇంకా కొన్ని బేరాలు ఉండబట్టి ఇంకా మాకు జరిగిపోతున్నాయి రోజులు. కానీ కొద్ది రోజులకు రిక్షాలు కనుమరుగైపోవాల్సిందే” అన్నాడు

మరింకేదైనా పని చేసుకోవచ్చు గదా అన్నాన్నేను.

“బాగా అలవాటు పడిపోయాం బాబూ. వేరే పని చేయాలంటే వల్ల కావడం లేదు” అతని మాటల్లో అశక్తత, ఎప్పట్నుంచో అవలంభిస్తున్న వృత్తిని వదల్లేని బాధ.

మాట్లాడుతుండగా ఒక ఇరవై నిమిషాలకు మా అక్క వాళ్ళ ఇల్లొచ్చేసింది. కిందకు దిగి ఎంతయింది అని అడిగాను.

పదిహేను రూపాయలైంది బాబూ అన్నాడు. రిక్షా వాళ్ళపై నాకున్న నమ్మకం వమ్ము చేయలేదు అతను. చాలా న్యాయంగా అడుగుతారు వాళ్ళు . మారు మాట్లాడకుండా పదిహేను రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాను. డబ్బులు తీసుకుని కళ్ళకద్దుకుని

“పొద్దున్నే మంచి బోణీ బేరం బాబూ! వస్తానయ్యా”  అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. డబ్బంటే ఎంత గౌరవం!. కొద్ది మంది రిక్షా వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బు అడిగినా నేను బదులు చెప్పను. ఎందుకంటే ఎక్కడో ఎవరో చెప్పగా విన్నాను. నాకు బాగా నచ్చిన విషయం.

“మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళి సుష్టుగా భోంచేస్తాం. వాళ్ళు ఎంత బిల్లిచ్చినా కిక్కురుమనకుండా కట్టేసి వస్తాం. సూపర్ మార్కెట్ కెళ్ళి బ్రాండెడ్ వస్తువులు వాళ్ళెంత రేట్లు చెబితే అంత ఇచ్చేస్తాం.  ఇలా రోజు కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర రూపాయి, రెండు రూపాయల దగ్గర బేరమాడటం ఎందుకు?” అని అందుకనే న్యాయంగా అడిగే వాళ్ళకి ఒక రూపాయి అటు ఇటు అయినా ఇచ్చేస్తుంటా.

ప్రకటనలు

22 thoughts on “రిక్షావాలాతో ఒక ఉదయం

 1. బ్లాగుల్లో కాదులెండి. ఇది నేను బ్లాగుల్లోకి రాక మునుపు విన్న మాట.
  కాకపోతే దీన్ని పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

 2. నిజమే… నేను కూడా రిక్షాలోనే వెళ్తూ వుంటాను… ఐతే నెల్లూరు కాదు … గూడూర్లో….నెల్లూరు జిల్లానే సుమండీ…!!

 3. మీరు చెప్పేది చాలావరకూ నిజమే, అయినా నా కు అయిన అనుభవాలు పూర్తిగా reverse.

  మా ఊళ్లో రిక్షా వాళ్లు ఎంత దౌర్జన్యం అంటే, మా ప్రాంతం లోకి, ఊరిమొత్తం లొ ధనిక ప్రాంతం, ఆటో వాళ్లు వచ్చి దింపవచ్చు కాని, ఎవ్వరినీ ఎక్కించుకోవటానికి వీలులేదు. అర్జెంట్ గా బాలేక హాస్పిటల్ లాంటివాటికి వెళ్లాల్సిన అత్యవసరపరిస్థితులలో కూడా!!

  ఇక రాత్రిపూట రైల్ స్టేషన్ లో దిగితే, ఆ టైంలో వాళ్లు అడిగే రేట్లు చూసి గుండే ఆగి పోవాల్సిందే, ముఖ్యం గా ఆటో లు ఏవీ దగ్గర్లో లేకపోతే! ఆటో వాళ్లు అడిగే దానికంటే కనీసం ఓ 4 రెట్లు మాత్రమే!!

  అందుకని మా ఉర్లో మాత్రం నేనేప్పుడూ ఆటో లకే సప్పొర్ట్ 🙂 నెల్లూరు వెళ్తే, రిక్షా లకు తప్పకుండా సప్పొర్ట్ చేస్తానులెండి.

  ఇంతకీ మా ఊరు ఏదో చెప్పలేదు కదూ, చీరాల. ఇది ఓ 7,8 సంవస్తరాల క్రితం మాట, ఈ మధ్యన పోలా, పరిస్థితి పెద్దగా తేడా లేదని విన్నా

  • నిజమేనండీ! అందరు రిక్షా వాళ్ళు ఒకలా ఉండరు 🙂
   నేను వాళ్ళ అవతారాన్ని చూసి ఎవరు నిజాయితీ పరులో గ్రహించగలను. నా అంచనా 90 శాతం వరకు తప్పు కాలేదు. మీరన్నట్లు ప్రతి నాణేనికి బొమ్మ బొరుసు ఉంటాయి. నేనిక్కడ ఒక రిక్షా వాలాని గురించి మంచిగా రాశానని అందరూ రిక్షావాలాలు అలా ఉంటారని అనుకోవద్దు.

 4. meeru cheppindi nijame! nenu chinnappudu vijayawada lo riksha lo vellanu. Kani chinnatanam lo ala vallu kashtapadi tokkutunte choostu koorchovatam badha vesi, riksha ekkanu ani maram chesedanni. Tarvata kodhiga budhi telisaka, groups lo memu vunte (ante more than 2) riksha ekke danni kadu… okallam or idharu vunte riksha lone velledanni.

 5. మా ఊళ్ళో (విజయనగరం) కూడా ఇంకా రిక్షాలు ఎక్కువగానే ఉన్నాయి.
  మా వాళ్ళు కూడా చాలాసార్లు రిక్షా మీదే ఆధారపడుతూ ఉంటారు.
  రిక్షావాళ్లకి రిక్షా తొక్కడం ఎంత అలవాటో, మా వాళ్ళకి రిక్షా ఎక్కడం అంత అలవాటు. ఆటోలు ఉన్న రిక్షానే పిలుస్తారు

  పాపం వాళ్ళు ఆటో నడిపే శక్తిలేక, ఉన్నదాన్ని వదలలేక రిక్షాలు లాగుతూ ఉన్నారు. చాలా న్యాయంగా ధర చెప్తూ ఉంటారు. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు.

  మీలాగే నేను కూడా ఎప్పుడైనా రిక్షా ఎక్కితే ఓ పదో పరకో ఎక్కువిస్తూ ఉంటాను. ఆటోవాడు గదమాయించి అడిగితే ఇచ్చేస్తాము కదా…పాపం రిక్షావాడు న్యాయంగా అడిగితే ఎందుకు తక్కువ ఇవ్వాలని.

 6. మా ప్రాంతంలో (అనంతపురం జిల్లాలో) రిక్షాలు లేవుగానీ, ఒకసారి నేను కాన్పూర్‌కు వెళ్ళినప్పుడు ఎక్కాల్సి వచ్చింది. అక్కడి ఐ.ఐ.టి. క్యాంపస్‌లో మొదట రిక్షాలు చూసి నేను, మా ఫ్రెండు ఆశ్చర్యపోయాం.

  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మేము వెళ్ళినప్పటికన్నా రెండు సంవత్సరాల ముందు క్యాంపస్‌లో రిక్షావాళ్ళు, ఒకరూపాయి తీసుకొనేవారట. ఎవరైనా కొత్తవాళ్ళు ఐదు రూపాయలు ఇస్తే కళ్ళకద్దుకునేవారట.

  ఆ ఊరినుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం రిక్షానే ఎక్కాం. ఆటోవాడు 50 రూపాయలు అడిగితే, రిక్షావాడు పది రూపాయలు తీసుకున్నాడు.

  • పర్యావరణానికి మేలు చేసే ఎటువంటి మార్పులనైనా నేను హర్షిస్తాను. కాన్పూర్ వాసులు అభినందనీయులు. మా రూమ్ నుంచి ఆఫీసు దగ్గరే. అసలు మా ఆఫీసులో ఎవరూ సైకిల్ పై రారు కానీయండి. నాకెవరైనా తోడుంటే సైకిల్ లోనే రాగలను. కొంచెం మొహమాటస్తుణ్ణి కాబట్టి కొంచెం జంకుతున్నాను.

 7. అనవసరమైన ఖర్చులకు ఫుల్ స్టాఫ్ పెట్టి, కష్టపడే వాళ్లకు పని కలిపించి వారి జీవనోపాది తోడ్పటం ఒక మంచి పని. కొందరైనా మీ మార్గంలో నడవడానికి స్పూర్తిగా మీ అనుభవాలను మాతో పంచు కుంటుంన్నందుకు ధన్యవాదాలు. మీరు నడిచే మార్గం మనసుకు హత్తుకునేలా వుంది.

 8. చాలా సంతోషంగా ఉంది మంచి లెఖ చదివా నేను కూడ రిక్షా ఎక్కుతుంటాను ఎంత అడిగితె అంత ఇస్తా, వాల్లు 98% న్యాయంగ అదుగుతుంటారు. వాల్లని ప్రొత్సహిస్తుండాలి,
  కొంతమంది రోడ్డు మీద బొమ్మలు తిప్పుతూ అమ్ముతుంటారు అవి నాకు అవసరం లేక పోఇన కొంటుంటాను.
  srikakulam

వ్యాఖ్యలను మూసివేసారు.