రిక్షావాలాతో ఒక ఉదయం

ఈ వారాంతంలో మా బీటెక్ స్నేహితుడు శ్రీకాంత్ రిసెప్షన్ కోసం నెల్లూర్ వెళ్ళాను. పనిలో పనిగా మా అక్క వాళ్ళు పెట్టిన కొత్త గిఫ్ట్ షాప్ కూడా చూసినట్లుందని కూడా నా పథకం. కొంచెం ముందుగా అయితే రైలు దొరికేది కానీ సమయాభావం వల్ల బస్ కి టికెట్ బుక్ చేశాను. ఎంత వోల్వో బస్ అయినా నాకు రైలు ప్రయాణమంత సౌకర్యంగా అనిపించలేదు.

నెల్లూర్ లో దిగగానే ‘ఆటో సర్’ అంటూ ఆటో వాళ్ళు చుట్టుముట్టారు. వాళ్ళ వెనుక మమ్మల్నెందుకు పిలుస్తార్లే అని చేతులు నలుపుకుంటూ ఒక వారగా నిల్చుని ఉన్నారు రిక్షా వాళ్ళు. చాలా పట్టణాల్లో రిక్షా వాళ్ళు తగ్గిపోయినా నెల్లూరులో మాత్రం ఇంకా కాలంతో పోటీ పడుతూనే ఉన్నారు.  అందుకనే వాళ్ళంటే నాకు అభిమానం.

ఆటో వాళ్ళనందరినీ తప్పించుకుని ఏదో ఆలోచిస్తూ రిక్షా మీద కూర్చున్న రిక్షా అతని దగ్గరికెళ్ళి “కోటమిట్ట కు వస్తావా” అని అడిగాను.

చటుక్కున రిక్షా దిగి టవల్ తో సీటు శుభ్రంగా తుడిచి “రండి సర్ కూర్చోండి. వెళదాం” అన్నాడు.

నేను మామూలుగా రిక్షా వాళ్ళని ఎంత తీసుకుంటావని అడిగను. వాళ్ళ మీద నాకున్న నమ్మకం అలాంటిది. ఆటో వాళ్ళంతా విచిత్రంగా నా వైపు చూస్తుండగా రిక్షా ఎక్కి కూర్చుని వెళ్ళమన్నాను.

కొద్ది దూరమయ్యాక ” ఏమయ్యా ఈ ఆటోలు వచ్చింతర్వాత మిమ్మల్నెవర్నైనా పిలుస్తున్నారా అసలు?”

“ఏదో ఇలా ఇంకా కొన్ని బేరాలు ఉండబట్టి ఇంకా మాకు జరిగిపోతున్నాయి రోజులు. కానీ కొద్ది రోజులకు రిక్షాలు కనుమరుగైపోవాల్సిందే” అన్నాడు

మరింకేదైనా పని చేసుకోవచ్చు గదా అన్నాన్నేను.

“బాగా అలవాటు పడిపోయాం బాబూ. వేరే పని చేయాలంటే వల్ల కావడం లేదు” అతని మాటల్లో అశక్తత, ఎప్పట్నుంచో అవలంభిస్తున్న వృత్తిని వదల్లేని బాధ.

మాట్లాడుతుండగా ఒక ఇరవై నిమిషాలకు మా అక్క వాళ్ళ ఇల్లొచ్చేసింది. కిందకు దిగి ఎంతయింది అని అడిగాను.

పదిహేను రూపాయలైంది బాబూ అన్నాడు. రిక్షా వాళ్ళపై నాకున్న నమ్మకం వమ్ము చేయలేదు అతను. చాలా న్యాయంగా అడుగుతారు వాళ్ళు . మారు మాట్లాడకుండా పదిహేను రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాను. డబ్బులు తీసుకుని కళ్ళకద్దుకుని

“పొద్దున్నే మంచి బోణీ బేరం బాబూ! వస్తానయ్యా”  అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. డబ్బంటే ఎంత గౌరవం!. కొద్ది మంది రిక్షా వాళ్ళు కొంచెం ఎక్కువ డబ్బు అడిగినా నేను బదులు చెప్పను. ఎందుకంటే ఎక్కడో ఎవరో చెప్పగా విన్నాను. నాకు బాగా నచ్చిన విషయం.

“మనం ఒక రెస్టారెంట్ కి వెళ్ళి సుష్టుగా భోంచేస్తాం. వాళ్ళు ఎంత బిల్లిచ్చినా కిక్కురుమనకుండా కట్టేసి వస్తాం. సూపర్ మార్కెట్ కెళ్ళి బ్రాండెడ్ వస్తువులు వాళ్ళెంత రేట్లు చెబితే అంత ఇచ్చేస్తాం.  ఇలా రోజు కూలీ చేసుకునే వాళ్ళ దగ్గర రూపాయి, రెండు రూపాయల దగ్గర బేరమాడటం ఎందుకు?” అని అందుకనే న్యాయంగా అడిగే వాళ్ళకి ఒక రూపాయి అటు ఇటు అయినా ఇచ్చేస్తుంటా.