నేను నేర్చుకున్న ఒక జీవిత సూత్రం

కాలేజీలో ఉండగా ఒకసారి స్నేహితులతో కలిసి అనాథాశ్రమానికి వెళ్ళాను. పిల్లలకు పంచి పెడదామని  కాడ్బరీ చాక్లెట్లు కూడా తీసుకెళ్ళాం. అయితే ఊరికే పంచి పెట్టేయకుండా సరదాగా పిల్లల మద్య చిన్న పరుగు పందెం పెట్టాలనుకున్నాం. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వాళ్ళకి చాక్లెట్లు ఇస్తామని ప్రకటించాం.

పందెం మొదలైంది. ప్రతి ఒక్కరు గెలవాలని శక్తికొద్దీ పరిగెడుతున్నారు. చివరికి ఒకరి కొకరు పోటీ పడుతూ ముగ్గురు కొద్దిపాటి తేడాతో పూర్తి చేశారు. ముందుగా వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి మిగతా వాళ్ళకి తరువాత అన్ని చాక్లెట్లు పంచేశాం.

తరువాత పందెంలో ప్రథమ స్థానంలో నిలిచిన అబ్బాయిని దగ్గరకు పిలిచి

” అవును బాబూ! మేము చాక్లెట్లు అందరి కోసం తెచ్చాం కదా. అయినా నువ్వు అంత శ్రమపడి పందెం గెలిచావెందుకు?” అని అడిగాను.

”నేను చాక్లెట్ల కోసం పరిగెత్త లేదన్నయ్యా! గెలవాలని పరిగెత్తాను. పోటీ లో నెగ్గితే ఆ ఆనందమే వేరు” అన్నాడు.

ఆ అబ్బాయి ఎంత మామూలుగా గా చెప్పినా అతను చెప్పిన మాటల్లో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన “ఫలితం ఆశించకుండా కర్మలనాచరించు” అనే సూక్తి ద్యోతకమయింది. ఎంత మంచి మాట చెప్పాడు.

ఈ సంధర్బంగా మా మాస్టారు పదే పదే చెప్పే ఇంకో మాట కూడా గుర్తు  చేయాలి మీకు. ఆయన దేన్లో అయినా నన్నెపుడూ వేరే వాళ్ళతో పోటీ పడమనే వారు కాదు. నాతో నన్నే పోటీ పడమనే వారు.

”అనుక్షణం నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నించు. ఒకసారి నీకు 90 మార్కులు వస్తే మరుసటి పరీక్షలో 91 మార్కులు సంపాదించడానికి ప్రయత్నించు. అంతేకానీ నేను ఫలానా వాడి కన్నా ఎక్కువ మార్కులు సంపాదించాలి అని పోటీ పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే నెమ్మదిగా నీ పోటీదారుల పట్ల నీకు ఈర్ష్య భావం కలిగే అవకాశం ఉంది” అని చెప్పే వారు. ఆ మహానుభావుడి మాటలు నా జీవితంలో ఇప్పటికీ అవసరమయిన సందర్భాల్లో  అన్వయించుకుంటూనే ఉంటాను.

ప్రకటనలు

15 thoughts on “నేను నేర్చుకున్న ఒక జీవిత సూత్రం

 1. చాలా మంచి విషయాలని క్లుప్తంగా ఉదహరించారు.
  ధన్యవాదములు

 2. ఇది అక్షరసత్యం. ఎప్పుడు కూడా ఎవరితోనూ పోటీ పెట్టుకోకూడదు.ఏ పని చేసినా ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. మనకు మనమే పోటీ అనుకుని అలా సాగిపోతుండాలి..

 3. పోటీ వద్దెంటే ఎల, కొన్ని విషయాల్లొ ఉండాలి కొన్నిటిలొ ఉండకుడదు స్పర్ద విద్య వర్దతే అన్నారు విద్యలొ ఉండాలి, స్నేహ పూర్వక పోటీ ఉండాలి ఇది పోటీ ప్రపంచం కదా మరి

 4. స్నేహ పూర్వక పోటీ మీ అదుపులో ఉన్నంత వరకు పరవాలేదు. అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. అందరూ ఈర్ష్యా ద్వేషాలకు అతీతులు కారు కాదు కదా. ఏదో ఒక సమయంలో మీరు లోను కావచ్చు అని మాత్రమే హెచ్చరించారు మా గురువు గారు.
  అదీ కాక మనల్ని మనతోనే పోల్చి చూసుకున్నపుడు మనకు మనశ్శాంతి ఉంటుంది.

 5. ***ఒకసారి స్నేహితులతో కలిసి అనాథాశ్రమానికి వెళ్ళాను. పిల్లలకు పంచి పెడదామని కాడ్బరీ చాక్లెట్లు కూడా తీసుకెళ్ళాం***

  మీ సేవా గుణానికి ముందుగా నా అభినందనలు. ఇక మీరు చెప్పిన ఆ రెండు మాటలు నగ్న సత్యాలు.

 6. మీ మాస్టారి మాట ఆదర్శప్రాయమైనది…మంచి విషయం చెప్పారు.
  అటువంటి మాస్టారు దొరికినందుకు మీరద్రుష్టవంతులు.

వ్యాఖ్యలను మూసివేసారు.