ఆటోవాలా ఆదర్శం

ముంబై కి చెందిన సువేందు రాయ్ అనే అతను ఆటోలో తనకు ఎదురైన స్పూర్థివంతమైన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు. ఆ అనుభవం ఆయన మాటల్లోనే

పోయిన ఆదివారం, నేను నా భార్యా పిల్లలతో కలిసి బాంద్రా నుంచి అంధేరీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న ఆటో ను చేత్తో సైగ చేశాను. ఆ సమయంలో ఈ ప్రయాణంలో ఎటువంటి ప్రత్యేకత ఉంటుందని నాకు అనిపించలేదు.

ఆటోలో ఎక్కి కూర్చోగానే నా దృష్టి  డ్రైవర్ సీటు వెనుక భాగాన ఉన్న మ్యాగజీన్ల మీద పడింది విమానంలో ఉన్నట్లుగా.ముందు భాగంలో చూశా. అక్కడ చిన్న టీవీ ఉంది. దూరదర్శన్ చానల్ ప్రసారమవుతుంది అందులో.

నా భార్యా, నేను ఆశ్చర్యంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం.  నాముందే ప్రథమ చికిత్సకు వాడే దూది, డెటాల్, కొన్ని మందులు తో ఒక చిన్న పెట్టె అమర్చి ఉంది. ఇవి చాలు మేము ఎక్కిన వాహనానికో ప్రత్యేకత ఉందని తెలియడానికి. మళ్ళీ చుట్టుపక్కల చూశాను. ఇంకా ఏమైనా కనిపిస్తాయేమోనని. ఒక పక్క రేడియో, మరో పక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్, గోడ గడియారం, క్యాలండర్, కొన్ని బొమ్మలు, అన్ని మతాలకు సంబంధించిన గుర్తులు కనిపించాయి. 26/11అమర వీరులు, కామ్టే, సలాస్కర్, కర్కరే, ఉన్నిక్రిష్ణన్ ఫోటోలు కూడా కనిపించాయి. అప్పుడు నాకు అనిపించింది ఆటోనే కాదు దాన్ని నడుపుతున్న ఆటో డ్రైవర్ కూడా సాధారణమైన వ్యక్తి కాదని.

నెమ్మదిగా అతనితో మాటల్లో పడ్డాను. కొద్దిసేపటికే అతనిపై సహజంగా ఆటోవాళ్ళ మీద మాకున్న తక్కువ భావం తగ్గి పోయింది. అతను గత తొమ్మిదేళ్ళుగా ఆటో నడుపుతున్నాడు. అతను పనిచేసే ప్లాస్టిక్ ఫ్యాక్టరీ మూతపడటంతో ఉద్యోగం పోయింది. అప్పటికే ఇద్దరు బడికి వెళ్ళే వయసున్న పిల్లలున్నారు. అతను ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా ఆటో నడుపుతాడు. అనారోగ్యం వల్ల తప్పితే ఆటో నడపడం నిలపడు. “సెలవు పేరు చెప్పి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏమొస్తుందండీ! పని చేసి కొన్ని డబ్బులు సంపాదిస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది కదా” అంటాడతను.

అతను ముంబై నగరానికి నిజమైన ప్రతినిథిలా కనిపించాడు మాకు- పనిపట్ల అతనికున్న అంకిత భావం, జీవితంలో రాణించాలన్న పట్టుదల. అతనికి ఖాళీ సమయం దొరకదని తెలిసినా నేను అతన్ని ఖాళీ సమయంలో ఇంకా ఏమైనా పని చేస్తావా? అని అడిగాను. దానికి అతనిచ్చిన సమాధానం అతనిమీద మాకున్న గౌరవం రెట్టింపు చేసింది. ప్రతి వారం అంధేరీలో ని వృద్ధాశ్రమానికి వెళతాడు. అతనికి కొంచెం ఎక్కువ ఆదాయం వస్తే వృద్ధులను అవసరమయ్యే టూత్ బ్రష్ లు, పేస్ట్ లు, సబ్బులు, నూనె మొదలైన దైనందిన జీవితంలో అవసరమయ్యే సరుకులను ఇచ్చి వస్తుంటాడు.

నెమ్మదిగా మా దృష్టి మీటర్ క్రింద రాసి ఉన్న వాక్యం వైపు మళ్ళింది. వికలాంగులకు మీటర్ రేటు మీద 25% తగ్గింపు. అంధులకు 50 రూపాయల వరకు ఉచిత ప్రయాణ సదుపాయం” అని రాసి ఉందక్కడ. అతని మీద మాకు అంతకంతకు అభిమానం పెరిగిపోతుంది. మా దృష్టిలో అతను హీరో.

మేం చేరాల్సిన చోటు వచ్చేసింది. 45 నిమిషాల ప్రయాణంలో అణకువ, స్థార్థ రాహిత్యం మొదలైన సుగుణాలను అతనిలో చూశాం మేము. అటో దిగాక మా చార్జీ తో పాటు ఒక అంథుడి ప్రయాణానికి అవసరమైన డబ్బులు తప్ప అతనికి మరేమీ ఇవ్వలేకపోయాం.

నా దృష్టిలో కూడా అతను ఒక నిజమైన హీరో.

దేవుడా నాక్కూడా మన హీరో లాంటి స్వార్థ రహిత మనస్సును ప్రసాదించు!!