రూపాయి విలువ

చిన్నప్పటి నుంచి రూపాయి విలువ అంటే బాగా తెలిస్తూ పెరిగాను. రూపాయి చేతిలో కనిపిస్తే పండగే. వేసవి సెలవుల్లో  ఐసు లమ్మే తాత  సైకిల్ మీద వస్తే మా పిల్లలందరికీ సంతోషమే సంతోషం.  వేరుశనగ వేయడానికి కాయలు చేత్తోనే ఒలిచే వాళ్ళు ఎక్కువగా అప్పట్లో. ఇప్పుడు చాలా మంది యంత్రాల సహాయం తీసుకుంటున్నారనుకోండి. ఒక ముంత (ఒక  కొలత) శనక్కాయలు ఒలిస్తే పావలా, అర్థ రూపాయి, అలా ఇచ్చే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే పిల్లలు లేకపోతే వేరుశనగ పంటలో ముఖ్యమైన ఆ కార్యక్రమం పూర్తయ్యేది కాదు. అలా సంపాదించిన డబ్బులు కూడబెట్టుకుని ఐసులు కొనుక్కునే వాళ్ళం. కాయలు ఒలిచి చేతి వేళ్ళు బొబ్బలెక్కేవి. అన్నం తినేటప్పుడు మంట పుట్టేది. నోటితో ఊదుకుంటుంటే ఇంట్లో వాళ్ళు చీవాట్లు కూడా పెట్టే వాళ్ళు ఎందుకలా ఐసుకోసం చెయ్యి పాడుచేసుకోవడం అని. కానీ కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చుపెడుతుంటే ఆ ఆనందమే వేరు.అది చాలు అన్నింటినీ మరిపింప చేయడానికి. వేరుశనగ సాగులో ఇంకో ముఖ్యమైన పని పప్పు వేత. ముందు నాగలి దున్నుతుంటే వెనకనే నడుస్తూ నాగటి చాలులో పప్పు వేస్తూ పోవడాన్ని ఎక్కువగా పిల్లలకే అప్పగించే వాళ్ళు. ఒక రోజు పప్పు వేయడానికి వెళితే పది రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలా వెళ్ళి సంపాదించిన డబ్బులతో విద్యా సంవత్సరం మద్యలో అవసరమయ్యే పుస్తకాలు, పెన్నులు, తెల్ల కాగితాలు మొదలైనవి కొనుక్కునే వాళ్ళం.

ఇలా ప్రతి దశలో రూపాయి విలువ తెలుస్తూ బతికిన నాకు పీజీ కోసం వరంగల్ కి వెళ్ళినపుడు మాత్రం ఒక చేదు అనుభవం ఎదురైంది. గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా కళాశాలలో ప్రవేశిస్తే నెలకు ఐదు వేలు ఉపకారవేతనం ఇచ్చేవాళ్ళు. ఉన్నత విద్య అంటే ప్రాణం. పైగా  మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళిచ్చే డబ్బులు ఆసగారా ఉంటుంది అని అందులో చేరాను. వాళ్ళేమీ ఊరికే ఇవ్వరు. అందుకు తగ్గ పని మేము కాలేజీలో చేసే వాళ్ళం. పేపర్లు దిద్దడం, ఇన్విజిలేషన్, ల్యాబులు నిర్వహించడం లాంటి పనులన్నమాట.

చేరిన మొదట్లో అనుకుంటా ఒక ప్రొఫెసర్ మా క్లాసులో ఒక ప్రశ్న అడిగాడు. అందుకు ఎవరూ “ఆయన సంతృప్తి చెందే సమాధానం” ఇవ్వలేకపోయారు. ఆయనకు బీపీ హెచ్చింది. ఒక్కసారిగా తిట్ల పురాణం లంకించుకున్నాడు. అవమానాలు నాకేమీ కొత్త కాదు. కాకపోతే ప్రభుత్వం “మీ మీద దండగ ఖర్చు పెడుతోంది. మీకు డబ్బులివ్వడమే దండగ” (ఆయన మాటల్లో చెప్పాలంటే: The government is unnecessarily wasting poor man’s money on you. You are paid for nothing) అన్నపుడు మాత్రం కొంచెం బాధనిపించింది. మనం చేస్తేనే కదా డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ ఈ మాటలన్నీ ఎందుకు అనడం? అని ఆ రోజంతా నిద్ర పట్టలేదు. పదహారు సంవత్సరాలు ఎంతో మంది గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాను. ఎవరి దగ్గరా ఇలాంటి మాట పడలేదు. కానీ మరుపు అనేది దేవుడి మనిషికిచ్చిన గొప్ప వరం. తొందర్లోనే దాని గురించి మరిచిపోయాను.

ఇరవై అయిదు  సంవత్సరాల ప్రయాణం లో ఎన్నో అనుభవాలు. అందులో ఇదొకటి. నేను అవమానాలుగా భావించే వాటికి అనుభవం అనే అందమైన పేరు పెట్టుకోవడం నాకు మొదట్నుంచీ అలవాటు. అందుకనే నా జీవితంలో అవమానాలుండవు. అనుభవాలు మాత్రమే ఉంటాయి. అందమైనవి!, బాధాకరమైనవి!. నాకు ఏదీ సులువుగా దొరకలేదు. చదువు, ఉద్యోగం, డబ్బు. ఇలా అన్నీ.  కానీ చివరిగా రావాల్సింది మాత్రం సులభంగా వస్తే చాలు. అదేనండీ మృత్యువు!

23 thoughts on “రూపాయి విలువ

 1. బాగా రాసారు రవిచంద్ర గారు
  రెండు కధలుగా రాస్తే ఇంకా బావుండేది ఒకేసారి రాసారా
  continuity కొద్దిగా లోపించినట్టు నాకు అనిపించింది
  మీకు బాధ కలిగించినందుకు క్షమoతవ్యుడ్ని
  ఇంకా మంచి కధలు రాయాలి అని కోరుకుంటున్నాం

  • ఇది కథేమీ కాదు. నా స్వీయానుభవమే. మీరన్నట్లు తొందరగా రాయడం వల్ల రెండు సంఘటనలకు సరిగా బంధం వేయలేకపోయాను.

 2. మీ అనుభవాలు మధురమైనవి. ఆలోచనల్లో తాత్విక ధోరణి కనిపిస్తుంది.

  • నిజానికి నేను తాత్విక ధోరణిని అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నానంతే. కొంచెం వయసు వచ్చాక అది నరనరానా జీర్ణించుకోవాలని నా ప్రయత్నం.

 3. చాలా అద్భుతంగా వ్రాసారు !! ఏమిటి మేష్టారు, ఒక్కసారిగా తాత్విక ధోరణిలోకి వచ్చారు (:-?
  _______________________________________
  కానీ చివరిగా రావాల్సింది మాత్రం సులభంగా వస్తే చాలు. అదేనండీ మృత్యువు!
  _______________________________________
  నేనూ ఎప్పుడూ ఇలానే అనుకుంటాను, సుఖ మరణం ప్రాప్తించాలని!!

  • ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తాత్విక ధోరణిలోకి దూకేయడమే నా అజెండా. దానికి సమయమంటూ ఉండదు 🙂

 4. baboyyyi! kosa merupu toh gundelu pindaru! 😛
  ippude antha tatvam endukandi? but mee anubhavalu baguntayi… city lo putti perigina naku kooda inchu minchu alantive edurayyayi… Nenu, maa akka chinna classes nunchi tutions cheppukuntu vache dabbula toh bus pass, books etc konevallam, migilinavi dachukuni nanna ki birthday gift koni ichevallam. 🙂

  • ఇప్పట్నుంచి అలవాటు చేసుకుంటేనే కదా …. అప్పటికప్పుడు వైరాగ్యం అకస్మాత్తుగా రమ్మంటే రాదు.

 5. నాకు ఏదీ సులువుగా దొరకలేదు. చదువు, ఉద్యోగం, డబ్బు. ఇలా అన్నీ. కానీ చివరిగా రావాల్సింది మాత్రం సులభంగా వస్తే చాలు. అదేనండీ మృత్యువు!

  excellent …..chala baga rasaru, modatisari mee blog chudatam. chala happiga vundi.

 6. namasthe ravi garu.me blog chusanu.chala bagundhi,ani chepthey adhi saripodhu.kaani idhi nijam.nenu chala manchi blog chusanu anna feeling kaligindhi.meeru rasina aa palleturu vathavaranam naku kuda alavate nandi.kakapothye mari anthala kasthapade avakasam naku raledhu.kaani palletuullo unde mamathanu ragalu,premalu,aa vathavarnam malli naku chupincharu.

  meeru emi anukokapothey naa mail id saikrishna_ghanta@rediffmail.com ki mee mail id isthamaithe pampandhi plz.mimmlani kalavalani undhi.

  IDHI ENTI.edho blog chusi ila rasadu ani anukovadhu.na manasulo unna matani nenu ccheppanu.endhuknate mee maatalu naa medadu ni kadhu,manasuni thakayi.

  meeku isthamaithe mee snehituda ga undali ani korukuntu,, sumadhura mee samadhanam kosam edhuru chusthu,meee mitrudu sai krishna.

  • ప్రియమైన సాయిక్రిష్ణ గారికి
   మీ వ్యాఖ్య చూసి ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. నా మాటలు నలుగురు మనసులు తాకడం కంటే ఇంకా ఏంకావాలి. మీ లాంటి స్నేహితులకోసమే ఎదురు చూస్తున్నాను. మీకు ఇప్పుడే మెయిల్ పంపిస్తున్నాను.

 7. రవిచంద్ర గారు ..
  మీ పొస్ట్ బావుంది . మీరు మరీ ఇంత సున్నితమనస్కులయితే ఎలాగండి .. కాస్త రఫ్ గా వుండాలి.. తాత్విక ధోరణి కి మీకింకా చాల టైం వుంది. మిమ్మల్ని అసలు కొన్నాళ్ళు మిలటరి లొ వర్క్ చేయించాలి.

  ఇకపొతే ఇలాంటి తిట్లు మనకి మామూలే .. మీరు పి.జి చెసినందువల్ల ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారు? అంటే బి. టెక్ జాబ్ కి ఎం. టెక్ జాబ్ కి వున్న జీతం లొ తేడా. ఆ అదనపు అదాయాలొ 30 శాతం పన్ను కడుతున్నారు కదా.. అది మీకు ఇచ్చి ఉపకారవేతనం కంటే ఎక్కువే కదా.. మీరు కాలేజి లొ పేపర్లు దిద్దడం, ఇన్విజిలేషన్, ల్యాబులు నిర్వహించడం లాంటి పనులు ఎమీ చెయ్యకపొయినా ప్రబుత్వానికి మీమీద పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్టే.. నేను వుద్యొగం లొ చేరిన మొదటి సం || పన్ను తోనే ప్రబుత్వం నాకిచ్చిన స్కాలర్షిప్ అంతా తిరిగి ఇచ్చేసా 🙂

  • మిలిటరీలో పనిచేస్తే నాకింకా ముందే వైరాగ్యం వచ్చేస్తుందేమో. ఎందుకంటే అక్కడ జరిగేది ఎప్పుడూ చావో రేవో తేల్చుకోవడమే కదా 🙂

  • Thank you… very much. I use to stay in 11th block in first year. and 2nd block in Second year. But i frequent 9th block because all my classmates were there. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.

 8. నాకు ఏదీ సులువుగా దొరకలేదు. చదువు, ఉద్యోగం, డబ్బు. ఇలా అన్నీ. కానీ చివరిగా రావాల్సింది మాత్రం సులభంగా వస్తే చాలు. అదేనండీ మృత్యువు!

  మా ఆడవాళ్ళే స్వార్ధంగా పుణ్యస్త్రీగా చనిపోవాలని కోరుకుంటుంటాం! మగవాళ్ళుకూడా ఇలా కోరుకుంటారని ఇపుడే తెలిసింది

 9. హల్లో అండి,

  రూపాయి విలువ గురించి చెప్తాను అంటూ.. మీ చిన్నతనం లొకి తీసుకెళ్ళి ఆ అనుభవాలని రుచి చూపించారు.నిజమే చిన్నప్పుడు ఆ ఐసుల బండి కోసము మేము కూడా ఆత్రుత గా ఎదురు చూసే వాళ్ళము . వెరుసెనక్కాయలు ఒలవడం ,పూలు కట్టడం లాంటి పనులు పిల్లల చేత చేయిస్తారని తెలుసు.కాని నేను వినడమే కాని ఇలాంటి పనులు చెయ్యలేదు.
  కాని అలా సంపాందించిన డబ్బుతో మనం కొనడం అనేది ఒక మరపు రాని అనుభూతి .ఒక మధురస్మ్రుతి ని గుర్తుచేస్తూ హఠాత్తుగా వేదాంతం లొకి వెళ్ళిపొయారేమిటండి .కాని ఆ చివరి వాక్యం తో గుండెని పిండేసారండీ.

  మరీ అంత సున్నిత మనస్కులు ఐతే ఎలా అండి.కొంచం రఫ్ గా కూడా తయారవ్వండి.జీవితం లో కొంచం వేదాంతం మాట్లడాలని తెలుసు మరి ఇంతా….

  కాని మీరు దీని అనుభవం అని పెరు పెట్టుకున్నాను అని చెప్పారు కదా అది చాలా బాగుంది అండి.ఏమైనా అనుభవాలే కదా మనిషిని రాటు దేలుస్తాయి.

  ఏమంటారు??

  • >>ఏమైనా అనుభవాలే కదా మనిషిని రాటు దేలుస్తాయి.
   Absolutely…

వ్యాఖ్యలను మూసివేసారు.