కూర్గ్ యాత్ర

మేము దిగిన అతిథి గృహంఈ వారాంతపు సెలవుల్లో సహోద్యోగులతో కలిసి వెళ్ళిన కూర్గ్ యాత్ర ఆద్యంతం ఉత్సాహ భరితంగా, ఉల్లాసంగా సాగిపోయింది. మధురమైన అనుభవాలను మిగిల్చింది. హైదరాబాదు నుంచి బెంగళూరుకు రైలులో వెళ్ళి అక్కడి నుంచి మేము ముందుగానే ఏర్పాటు చేసుకున్న వాహనంలో సుమారు ఆరుగంటల పాటు ప్రయాణించి కాఫీ తోటలకు నిలయమైన కూర్గ్ చేరుకున్నాం. దారి పొడవునా బృంద గానాలతో కాసేపు , మూగసైగల క్రీడా విలాసాలతో కాసేపు, నిద్రాదేవి గాఢ పరిష్వంగంలో కాసేపు, హాస్యపు చిరుజల్లులతో ఎంతో మనోహరంగా ముందుకు సాగిపోయింది మా యాత్ర.  గురువారం రాత్రి హైదరాబాదులో బయలుదేరిన మేము శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి గానీ అక్కడికి చేరుకోలేకపోయాం. ముందు సెలయేరు, దాని ఒడ్డునే మేముండే అతిథి గృహం, చుట్టూ పచ్చటి ప్రకృతి, నీలాకాశం, పక్షుల కిలకిలలు, పిల్ల గాలి తెమ్మెరలు, సెలయేటి గలగలలు తప్ప వేరే ఏ సవ్వడీ వినిపించని ఆ ప్రదేశం లో కాలుమోపగానే ఒక్కొక్కరి ఆనందానికీ అవధులు లేవు.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అక్కడ దిగినా ప్రకృతి కాంత ఒడిలో మైమరిచిపోయిన మాకు అక్కడి వారు వచ్చి భోజనానికి పిలిచేదాకా ఆకలే వెయ్యలేదు. ప్రతి ఒక్కరి నోటా ఒకే మాట. “వారే వా”.భోజనానంతరం పక్కనే ఉన్న సెలయేటిలో అందరూ తనివితీరా ఆడారు.

అనంత దృశ్యంఆరోజు రాత్రి చలిమంట చుట్టూ చేరి ఆటలు, పాటలు సరదా సరదాగా గడిచిపోయింది. మరుసటి రోజు నేను మరో ఇద్దరితో కలిసి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన పర్వత శిఖరం మీద నుంచి ప్రకృతి దృశ్యాలను పరికించాలని బయలు దేరాం. దారి పొడవునా ఘాట్ రోడ్డు అందాలను ఆస్వాదిస్తూ కదిలిపోతుంటే అసలు సమయమే తెలియలేదు. శిఖరం మీదకు చేరగానే కనిపించాయి అనేకమైన అద్భుత దృశ్యాలు.

అదే రోజు మధ్యాహ్నం కావేరీ నది ఒడ్డున ఉన్న ఏనుగుల శిబిరాన్ని సందర్శించాం. మరుసటి రోజు మేము బసచేసిన కాటేజీకి దగ్గర్లోనే ఉన్న అబ్బే జలపాతాన్ని చూశాం. ఇక్కడికి వెళ్ళేటపుడు దారి పొడవునా చిరుజల్లులు, పర్వత శిఖరాలతో దోబూచులాడుతున్న మబ్బులు, ప్రకృతి పరదా వేసుకున్నదా అనిపించేలా పొగమంచు మరపురాని దృశ్యాలు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కల నిజమైంది. ఎందుకంటే ఇలాంటి ప్రదేశం మొన్నటి దాకా నా ఊహల్లోనే ఉంది. ఇప్పుడు నా స్మృతుల్లోకి చేరింది.

ప్రకటనలు

11 thoughts on “కూర్గ్ యాత్ర

  1. ఏంటి ఇంత లేట్ రవిచంద్ర గారు,మీ పోస్ట్ ల కోసం ఎదురు చూసి మీ మీద కోపం వచ్చింది
    చెప్పకుండా వెళ్ళిపోతారా
    పోనీ లెండి రేపటి నుండి మీ పోస్ట్ లు చదవొచ్చు 🙂

    • తెలిసిందే కదండీ! సెలవుల నుంచి వస్తూనే వాతావరణం మాంచి వేడిగా ఉంటుంది. అందులోంచి ఇప్పటికి తేరుకున్నాం. ఇంక రాస్తాను. మిమ్మల్నందరినీ అలరిస్తాను. 🙂

    • ప్రయాణానికే ఎక్కువ సమయం సరిపోయిందండీ! ఇంక టీమ్ మొత్తం వెళ్ళడంతో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయాము. కానీ ఉన్న రెండు రోజులు మాత్రం బాగా ఎంజాయ్ చేశాం.

  2. అవును, కూర్గ్ లో రెండు మూడు రోజులుండాలి. ప్రభాత వేళ మంచు దుప్పటి కప్పుకున్న కాఫీ తోటల్ని తనివి తీరా చూడాలి. ఘాట్ రోడ్డు వంపుల్లో ఆగి ఫొటోలు తీసుకోవాలి. పండిన కాఫీ కాయల గుత్తుల్ని చిదిపి ఆ తాజా వాసన ఆఘ్రాణించాలి. కూర్గ్ లో ఒక చోట(పేరు గుర్తు లేదు) కేరళ బార్డర్ ఉంటుంది. ఒక కాలు అటు , ఒక కాలు ఇటు వేసి ఫొటో తీసుకోవాలి.(అక్కడికెళ్ళిన అందరూ దాదాపుగా ఈ పని చేస్తారు) రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎవరుండగలుగుతారు చెప్పండి?అందుకన్నమాట.

    రవి చంద్ర, లక్ష్మణ తీర్థ జలపాతం చూశారా ?అదే..ఇరుపు జలపాతం! కూర్గ్ నుంచి కొద్ది దూరంలో ఉన్న నిసర్గ ధామ కూడా చాలా అందంగా ఉంటుంది. మడిమలుకూడా తడవని నీళ్లలో కావేరి నదిని దాటి అటువొడ్డు చేరడం మర్చిపోలేం! బహుశా మీరు చెప్పిన ఏనుగుల శిబిరం ఇదే అయి ఉంటుంది.

    బెంగుళూరు నుంచి మూడునాలుగు సార్లు కూర్గ్ వెళ్ళాము మేము!

  3. అసలు ఇక్కడికి బయలుదేరే ముందు మిమ్మల్ని అడిగి ఉండాల్సింది ఏయే ప్రదేశాలు చూడాలి అని. ఈ సారి ఎక్కడికైనా వెళ్ళే టపుడు ఇక్కడ ఒక టపా రాస్తాను. ఎంచక్కా అందరి సలహాలు తీసుకోవచ్చు. 🙂
    మేము సమయాభావం వల్ల లక్ష్మణ తీర్థ జలపాతం, నిసర్గ థామ్, కేరళ బోర్డ ర్ చూడలేకపోయాము.

    చూసినవి అబ్బే జలపాతం, మీరు చెప్పిన కావేరీ నది ఒడ్డున ఉన్న ఏనుగుల శిబిరం, ఎత్తైన పర్వత శిఖరం (వ్యూ పాయింట్). ఇక ఉదయాన్నే పొగ మంచుతో కూడిన కాఫీ తోటలు వద్దనుకున్నా కనపడతాయి.

వ్యాఖ్యలను మూసివేసారు.