పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు…

అపుడు నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు. మాది అంత కలిగిన కుటుంబమేమీ కాదు. చెప్పులు తెగిపోయాయని నాన్నని డబ్బులు అడిగాను. “బాగున్నాయి కద నాయనా! అప్పుడే పారేయడం ఎందుకు? ఐదు రూపాయలిస్తే కుట్టిస్తారు” అంటూ ఐదు రూపాయలు నా చేతిలో పెట్టాడు మా నాన్న.

సమయం మధ్యాహ్నం రెండు గంటలు. మే నెల్లో ఎండలు అదరగొడుతున్నాయి. చెప్పులు కుట్టించుకుందామని బయట వెళ్ళాను. దగ్గర్లో ఉన్న ఒక చెప్పులుకుట్టే ముసలాయన దగ్గర తెగిపోయిన చెప్పు ఇచ్చి కుట్టమన్నాను.

అంతా అయిపోయిన తర్వాత నా జేబులో ఉన్న ఐదు రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాను. ఆయన నా వైపు విచిత్రంగా ఓ చూపు చూసి

“ఏం వేళాకోళంగా ఉందా? పదిహేను రూపాయలైంది. మిగతా పది రూపాయలు తీయ్” అన్నాడు.

నా దగ్గర ఆ ఐదు రూపాయలు తప్ప చిల్లి గవ్వ కూడా లేదు. ఎప్పుడూ ఏది అవసరమైనా నాన్నే తెచ్చిచ్చేవాడు పుస్తకాలు, పెన్నులు తప్ప.అందుకని ఇలాంటి విషయాల్లో నాకు బొత్తిగా అవగాహనే లేదు. ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఎంత చెబితే అంత ఇచ్చేయడమే.

” నా దగ్గర ఇంకేమీ డబ్బుల్లేవు తాతా. ఇంటికెళ్ళి తెచ్చిస్తాలే.” నిజాయితీ గా అన్నాను.

నా నిజాయితీ ఆయనకేం తెలుసు? నా మాటలేవీ ఆయన చెవికెక్కలేదు.

“ప్రతి ఒక్కరికి ఇదో అలవాటైపోయింది. డబ్బులు లేవని చెప్పడం. ఇవ్వకుండా తప్పించుకోవడం. నా దగ్గర నీ ఆటలు సాగవు. మర్యాదగా డబ్బులు తీయ్ చెప్పులు తీసుకుపో” కొంచెం కఠువు గానే అన్నాడు.

“సరే చెప్పులు నీ దగ్గరే ఉంచు ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొస్తా” అంటూ లేవబోయాను.

“ఎక్కడికెళ్తావురా నా xxx. ఇలా అని తప్పించుకుందామని చూస్తున్నావా? మర్యాదగా డబ్బులిచ్చి కదులు” కోపం తారాస్థాయికి చేరింది ఆయనకి.

నాకేం చెయ్యాలో తోచలేదు. మెదడు మొద్దుబారి పోయింది. పారిపోదామంటే ఆయన పని చేసుకుంటూ కూడా నా వైపు ఓ కన్నేసి ఉన్నాడు. ఎక్కడ గొడవ చేసి ఉన్న పరువుకూడా పోగొడ్తాడేమోనని భయం. పైన ఎండ కాస్తున్న స్పృహ కూడా లేదు. వేసవి ప్రతాపానికి చెమట ధారాపాతంగా కారిపోతుంది. కొంచెం సేపు ఆలోచిస్తే ఒకే ఒక ఆలోచన వచ్చింది. “దార్లో కనిపించిన వాళ్ళని ఎవర్నైనా అడగటం”.

ఆయన చూస్తుండగానే దార్లో వస్తున్న వాళ్ళను డబ్బులు కోసం అడగడం మొదలు పెట్టాను.

“ఏం బాబూ చూస్తే చదువుకున్న వాడిలా కనిపిస్తున్నావు. ముందుగా ఎంతవుతుందో తెలియకుండానే కుట్టడానికిచ్చేసావా? ఎలాగోలా బ్రతిమాలు. ఇచ్చేస్తాడు”  పెద్దవాళ్ళందరూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తున్నారు కానీ ఎవరు ఆ ముసలాయనకి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యడం లేదు.

చివరికి అద్దెకు ఎడ్లబండి తోలుకునే ఒక అబ్బాయి నా ఇబ్బందిని గమనించి ఒక ఐదు రూపాయలు చేతిలో పెట్టాడు. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ అబ్బాయికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాలేదు. వయసులో చిన్నవాడని కూడా చూడకుండా గబుక్కున వంగి వాడి కాళ్ళకు దణ్ణం పెట్టేశా. ఆ అబ్బాయి మొహమాటపడుతూ దూరంగా జరిగాడు. అతనికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది.

ఆ అయిదు రూపాయలు తీసుకుని ఆ ముసలాయనకి ఎలాగోలా నచ్చజెప్పి అతని చేతిలో పెట్టాను. నోటికి వచ్చిన బూతులు తిడుతూనే ఆ డబ్బులు తీసుకుని ఆ చెప్పులు నా ముందుకు విసిరేశాడు ముసలాయన. బ్రతుకు జీవుడా అనుకుంటూ చెప్పులు తొడుక్కుని నాకు డబ్బులిచ్చిన అబ్బాయి వంక చూశాను. అతనింకా నా వైపు విచిత్రంగానే చూస్తున్నాడు.

” నాతో పాటు మా ఇంటికి రా. నీ  డబ్బులు నీకిప్పిస్తాను”  అన్నాను.

“పర్లేదులే అన్నా. ఎండకి ఇప్పటికే బాగా అలిసిపోయావు. తొందరగా ఇంటికెళ్ళిపో” అన్నాడు కొండంత హృదయంతో.

మరికొంత మంది నా వంక చూసి నవ్వుకోక ముందే వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను.

నిజానికి ఈ సంఘటనలో ఎవర్నీ తప్పు పట్టడానికి లేదు. కానీ అప్పట్లో చిన్నతనం కాబట్టి గాయపడ్డ నా హృదయానికి,  ఆ ముసలాయన నా మీద జాలి చూపిస్తే బాగుండు అనిపించింది. తరువాత కొంచెం వయసు వచ్చాక నేనే కొంచెం నిర్మొహమాటం, ధైర్యం అలవర్చుకోవాలి అనుకున్నాను.

 

20 thoughts on “పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదు…

 1. నాకు మీరు ఎంచుకొన్న సబ్జెక్టు నచ్చింది. చాలా మంది పేదవారి జీవితాల గూర్చి కొంత చూసి కొంత ఊహించి రాస్తారు. నిజానికి ఎక్కువ సమస్యలలో ఉండేది మధ్యతరగతి లేక (వర్కింగ్ క్లాసు) దొంగతనం చెయ్యటం, అడుక్కోవటం, బెదిరించటం, గట్టిగా పోట్లాడటం చెయ్య గూడదు అనుకొనే పరువు కోసం పాకులాడే ఈ జనాలే అసలుదీనులు.

  మీరు ఇది కధ రూపం లో రాసేట్లయితే కొంత conclusion కూడా రాయాలి. ఈ సంఘటన వల్ల మీలో వచ్చిన మార్పేమైనా ఉన్నాదా , ఎవరి తప్పు ఉన్నది దీన్లో అలాంటివి.
  మీరు మీ నాన్నని తిట్టుకోవచ్చు, ముందు డబ్బు మాట్లాడుకొని మీ తెలివి తక్కువ తనాన్ని తిట్టుకోవచ్చు, అతని మంచి తనంతో ఇన్స్పిరె అయ్యి మరిన్ని మంచి పనులు చెయ్యవచ్చు. ముసలాడి మొండితనాన్ని తిట్టవచ్చు ..

  అయినా ఈ కధలోనూ ఎవ్వర్నీ తప్పు పట్టా తానికి లేదు. ఐదు రూపాయలంటే లెక్క చెయ్యక్కర లేని వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. మీరు పని చేయించుకొన్నారు, ముసలాయన చేసాడు మద్యలో దారిన పొయ్యే వాళ్ళు డబ్బు నష్ట పెట్టుకోవటం కూడా కుదరని పని. అయితే రూల్స్ కి అందనిది జాలి కలిగి ఉండటం అనే బుద్ధి. దానివల్ల మీ ఆలోచనలో వచ్చిన మార్పేమిటి అన్నది ముఖ్యమైన పాయింట్ అవుతుంది.

  • @కమల్ : అడగ్గానే వచ్చి చదివినందుకు ధన్యవాదాలు. మీ కోరిక మేరకు భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని రాస్తాను
   @మైత్రేయి: మీ సూచనలకు చాలా చాలా థాంక్స్. మీ లాంటి వారి సలహాలతో నన్ను నేను మరింత మెరుగుపరుచుకోగలనని భావిస్తున్నాను. మీరన్నట్లు conclusion కూడా రాయవలసింది. రాస్తాను. అప్పట్లో ఆ ముసలాయన నా మీద జాలి చూపిస్తే బాగుండు అనుకున్నాను. తరువాత నేనే కొంచెం నిర్మొహమాటం అలవర్చుకోవాలి అనుకున్నాను.

 2. చాలా బాగా రాసారు రావించంద్ర గారు
  అభినందనలు
  మీ మాస్టారు మీ అమ్మమ్మ గురుంచి కూడా చాలా బాగా రాసారు
  అల్ ది బెస్ట్
  మీరు ఇలాంటివి ఇంకా రాస్తారని మిమ్మల్ని ఒక మంచి రచయితగా చూస్తాము అని మేము కోరుకుంటున్నాం

 3. బాగుంది.

  కానీ 5, 15 రూపాయలు అంటే మరీ ఎక్కువేమో. నా చిన్నప్పుడు రెండు రూపాయలకు కూడా చెప్పులు కుట్టించుకున్న రోజులు ఉన్నాయి.

  • కానీ ఆ ముసలాయన నిజంగానే పదిహేను రూపాయలు అడిగాడు. అది 1998 అనుకుంటా. మీరన్నట్లు అది కొంచెం ఎక్కువే. అందుకనే మా నాన్న ఐదు రూపాలిచ్చినప్పుడు అంతే అవుతుందిలే అనుకున్నాను.

 4. Baga rasaru 🙂
  peetha kashtalu peetha vi annatlu evari badhalu vallaki vuntayi… musalayana matram papam emi chestadu… aa edla bandi vani audaryam chala nachindi. ataniki matram 5 rupayalu takkuva kadu kada…
  serious ga oka short story laga rayali ante, inkoncham vatavarananni, akkadi janalni, mee paristhithi ni explain cheyandi… (bore kottinchakunda manchi humor toh chalamandi ee pani chestaru)
  prastutam rasindi chala bagundi kani plain narration laga vundi… all the best kalahasti garu 🙂

  • మీ సలహాలకు ధన్యవాదాలు. నెరేషన్ లాగా సాగిపోయే కథలు చూశాను కానీ మీరన్నట్లు ఇది పూర్తి స్థాయి కథ కాదు.

 5. sorry ఇప్పటివరకు మీకు response ఇవ్వలేకపోయినందుకు.

  మీ కథ చదివాను. good attempt. కానీ దీన్ని కథ అనడం కంటే కథానిక అనడం బాగుంటుందేమో.
  లలితగారు చెప్పినట్టు మీకు ఇంకొంచం సునిశిత ద్రుష్టి కావాలి.
  ఈ కథ కి మీరు పెట్టిన టైటిల్ సరిపోలేదు అనిపిస్తున్నది నాకు. అంతేగాక మీరు చెప్పదలుచుకున్న విషయం clear గా లేదు. సారాంశం నాకు బోధపడలేదు. ఎవరి కష్టాలు వారివి అని చెప్పడం మీ ఉదేశ్యమా, లెకపొతే ఆ పిల్లాడి దానగుణమా, ముసలాడి కర్కశ‌మా, లేక ఏమీ చేయలేని మీ అవస్థా? ఏమి చెప్పదలుచుకున్నరు అని అర్థం కాలేదు. కథ మొత్తం చదివాక రచయిత చెప్పదలుచుకున్నది ఇది అని పాఠ‌కుడికి తెలియాలి. అయితే మీ narration. బావుంది. as i said above it is a good attempt. keep writing, u will definitely become a good story writer. all the best.

  • థాంక్యూ సౌమ్య గారూ! నాకు కథకు కథానికకు తేడా తెలియదు. నిజానికి ఇది ఒక కథ కాదు.మనసుకు తోచింది రాసుకుపోతూ కథ అనుకున్నాను అంతే :-). శీర్షిక విషయానికొస్తే తక్కువ సమయంలో ఇంతకంటే మంచిది స్ఫురించలేదు. “అవమానం” అని పేరు బాగుండేదేమో.

   సారాంశం అంటే నువ్వెంత నిజాయితీగా ఉన్నా అవతలి వారు దాన్ని అర్థం చేసుకోలేకపోతే అది దండగ అని.ఇక దాన్నుంచి నేను నేర్చుకున్న పాఠాన్ని చివర్లో చేర్చాను.

 6. బాగుంది కధ రవి గారు. చిన్న గా కధానిక లా వుంది కాని బాగుంది. బోలెడన్ని సూచనలు మీకు అందే యి కాబట్టి ప్రత్యేకం గా చెప్పటానికేమి లేదు కాని బాగానే ఆ సంఘటన వూహించుకోగలను.. బాగా చెప్పేరు. ఎవరి కోణం నుంచి చూస్తే వాళ్ళది నిజమే కదా.. కొన్ని పరిస్తితులకు సమాధానాలు వుండవు ఏమో.

  • ఇది నా మొదటి ప్రయత్నమే కాబట్టి మీరు ఎటువంటి సలహాలిచ్చినా స్వీకరిస్తాను.

  • మీ అభిప్రాయం తెలియజేసినందుకు సంతోషం. సారీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ అభిప్రాయం మాత్రమే. నా అనుభవానికే కల్పన జోడించి కథగా రాయాలని ప్రయత్నించానని టపాలోనే తెలియజేశాను. అయినా కథ అనుభవంలా ఉండకూడదా? నేను చదివిన మధురాంతకం రాజారాం కథలన్నీ అనుభవాల్లాగే అనిపించాయి.

 7. ఇది కథ అని మీరు చెప్పకపోతే కామెంట్స్ ఎలా వుండేయో ఒక్కసారి వుహించుకొండి. I mean something is missing to have feeling of story. అది ఏమిటనేది కథలు వ్రాసే వాళ్ళే చెప్పగలరు. ఒక రీడర్ గా నా ఫీడ్ బ్యాక్ కథలా లేదు.

  ————————————————–

  నేను ఈ మధ్య చదివిన షార్ట్ స్టోరీస్ లో నాకు నచ్చిన స్టోరి ఇది & it could be a real experience too : http://makrand13.wordpress.com/2009/08/10/life-is-beautiful/

 8. కథలా ఉందో లేదో అన్న చర్చ అవతల పెడితే, వర్ణనలు వగైరా లేకుండా ఉన్నదున్నట్లు రాసిన విధానం బాగుంది. ఎవరి గురించీ అభిప్రాయాలు వ్యక్తం చెయ్యకుండా ‘ఇది ఇలా జరిగింది, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో మీరే తేల్చుకోండి’ అన్నట్లు వదిలేయటం ఇంకా బాగుంది. మంచి ప్రయత్నం. కొనసాగించండి.

  • చాలా థాంక్స్ అండీ. ఇది కథలా ఉంది. ఇది కథ లా లేదు ఈ నిబంధనలన్నీ మనం సృష్టించుకున్నవే. కానీ నా దృష్టిలో మాత్రం పాఠకుణ్ణి చదివింపజేసేలా ఉంటే చాలు. అదే దృష్టితో కొనసాగిస్తాను.

 9. మంచి ప్రయత్నం.బాగుంది. సూచనలు అందరూ చెప్పేసారు. కొత్తగా చెప్పేదేమీ లేదు. మీరు రాస్తూఉండండి. కొద్ది రోజులకు మీకే స్పస్ఠత వస్తుంది. బాగుంది.

వ్యాఖ్యలను మూసివేసారు.