సంతోషం…. చందోగ్యోపనిషత్ కథ

కొన్ని శతాబ్దాల క్రితం శ్వేతకేతు అనే బాలుడు తన తండ్రిని ఇలా అడుగుతున్నాడు.
“నాన్నా! ప్రతి ఒక్కరు సంతోషం కోసం పరితపిస్తున్నారు. అసలు సంతోషం అంటే ఏమిటి?”
“ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే, అతను ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంతో ఉంటాడు. సంతోషంగా లేని వ్యక్తి సంకల్పం గట్టిగా ఉండదు. అతని మనసు సంకుచిత భావాలతో నిండిఉంటుంది. కేవలం అనంతమైన బ్రహ్మము లోనే సంతోషం ఇమిడి ఉంది.”
“నేను దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా నాన్నా” అన్నాడా బాలుడు.
“తప్పకుండా. నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు.  ఎవరైనా సరే ప్రపంచంలో ఏదీ తన నుంచి వేరు కాదు, అన్నీ తనలో భాగమే అని తెలియాలి. వారు అదే చూడగలగాలి, అదే వినగలగాలి, అది తప్ప వేరే ఆలోచన వారి మనసులోవేరే ఆలోచన ఉండకూడదు. అదే బ్రహ్మమని చెప్పబడుతుంది”

కానీ ఎవరైనా తమకు అడ్డుపడుతున్నారని భావించినా, వారు తాము కాదు అని భావించినా వారు బ్రహ్మమును కనుగొననట్లే లెక్క. ఆ అనంతమైన స్వరూపం ఎక్కడికీ పోదు. అది ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది.

గమనిక: ఈ కథలో ఇంకా లోతైన జ్ఞానం ఉండి ఉండవచ్చు. నేను ఇక్కడ రాసింది కేవలం నాకు అర్థమైంది మాత్రమే.

అన్వేషణకి అంతే లేదు…

జపానీయులకు తాజా చేపలంటే ఎంతో మక్కువ. కానీ వారికి దగ్గర్లో ఉన్న నీటి వనరుల్లో కొన్ని దశాబ్దాల నుంచి ఎక్కువగా చేపలు ఉండేవి కావు. ప్రజా అవసరాలను తీర్చడానికి జపాన్ వాసులు పెద్ద పడవలతో దూర తీరాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే దూరం పెరిగే కొద్దీ చేపలను తిరిగి తేవడానికి సమయం కూడా ఎక్కువ పడుతోంది. సమయం గడిచే కొద్దీ చేపలు చాలా వరకు చెడిపోయేవి.

చేపలు తాజావి కాకపోవడంతో జపానీయుల జిహ్వకు రుచించేవి కావు. ఈ సమస్యను అధిగమించడానికి పడవల్లో శీతలీకరణ యంత్రాలను అమర్చడం జరిగింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పడవలు ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ సమయం గడిపి వచ్చేవారు. కానీ జపానీయులకు తాజా చేపలకూ, నిల్వ చేసిన చేపలకూ రుచిలో తేడా తెలిసింది. అందుకనే నిల్వ చేసిన చేపలకు తక్కువ ధర పలికేది. కాబట్టి పడవల్లో చేపల ట్యాంకులు ఏర్పాటు చేయించారు వాటి యజమానులు. అయితే వాటిలో చేపల్ను ఇరుకు గా ఉంచడంతో అవిసరిగా కదిలేవి కావు. దాని వల్ల అవి సగం జీవంతోనే మాత్రమే ఉండేవి. కాబట్టి తినే వారికి ఇంకా రుచిలో తేడా తెలిసేది.

చేపల ధర తక్కువగా ఉండటంతో ఒక విధంగా జపాన్ లో చేపల పరిశ్రమ సంక్షోభంలో పడింది. కానీ ఈ రోజు జపాన్ ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని దినదిన ప్రవర్థమానం చెందుతోంది.  ఎలాగో తెలుసా? పడవల్లో నీటి తొట్టెల్లో చేపలతో బాటు ఒక చిన్న షార్క్ చేపను కుడా విడిచిపెట్టేవాళ్ళు. అది కొన్ని చేపలను తినిసేది కానీ, దానికి భయపడి చిన్న చేపలన్నీ అటు ఇటు తిరుగుతూ ఉండేవి. కాబట్టి గమ్యం చేరేవరకు అవి నీళ్ళలోనే ఉన్నట్టుగా తాజాగా ఉండేవి. ధర బాగా పలికింది. పరిశ్రమ అభివృద్ధి బాట పట్టింది.

అందుకనే అంటారు “సాధించిన దానితో సంతృప్తి చెందేవారు జీవితంలో ఎదగలేరు.” అని. సవాళ్ళు మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. వాటిని విజయవంతంగా ఎదుర్కొంటే సంతోషం ఎప్పుడూ మనవెంటే.

మావోయిస్టుల ట్యాగ్ క్లౌడ్

చాలాకాలంగా స్తబ్ధుగా ఉన్నా నక్సలైట్లు మళ్ళీ సందడి చేస్తున్నారు. ఎప్పుడూ ప్రజల కోసం ప్రజలకోసం అని జబ్బలు చరుచుకునే వీళ్ళు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజా ఆస్తులను ఎందుకు ధ్వంసం చేస్తారో నాకు అర్థం కాదు. 🙂 కొద్ది కాలంగా వీరి సంభాషణలు గమనించిన నేను వారి ట్యాగ్ మేఘం తయారు చేశాను సరదాగా.

ఉద్యమం రక్తం ప్రపంచ బ్యాంకు పోరాటంప్రజలు ద్రోహం దోపిడీ చంపుతాం త్యాగం ధారపోస్తాం రక్తపుటేర్లు ఆయుధాలు

ఇది కేవలం సరదాగా తయారు చేసిన పోస్టు. ఏ వర్గం వారూ సీరియస్ గా తీసుకోవద్దని మనవి. మీరు మరికొన్ని సలహా ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను.

ఇదేమి చోద్యం కథా నాయకులారా?

“హాయ్ నేను నందమూరి కళ్యాణ్ రామ్ ని మాట్లాడుతున్నాను.రేపు విడుదలవబోయే జయూభవ సినిమా చూసి ఆశీర్వదించండి” వరసబెట్టి నాకు, ఆఫీసులో నా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చిన ఒక రికార్డెడ్ మెసేజి ఇది.
మొన్నేమో మీ మామయ్య చంద్రబాబు తెలుగుదేశం కి ఓటేయమని అడుక్కున్నాడు. నిన్నేమో మీ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాట పట్టాడు. ఇప్పుడు నీ వంతా?
నీ తర్వాత ఎవరు అడుక్కుంటున్నారు బాబూ?
ఆల్రెడీ పత్రికల్లో, టీవీల్లో మీ గురించి మీ సినిమాల గురించి ఊదరగొట్టుకుంటున్నారు కదా. ఇలా మమ్మల్ని ఫోన్లో కూడా ఎందుకు విసిగిస్తారు?
నేనైతే సరి తెలుగు వాణ్ణి. తెలుగు రాని వాళ్ళు మిమ్మల్ని బూతులు తిడుతున్నారు.
జనరంజకమైన కథలు ఎంచుకుని మంచి సినిమాలు తీస్తే జనం వాళ్ళంతట వాళ్ళే వచ్చి చూస్తారు. ఇలా ఫోన్లు చేసి అడగనక్కర్లేదు.