ఆస్తికులు vs నాస్తికులు

కొన్ని రోజుల క్రితం పరుచూరి గోపాల క్రిష్ణ గారు నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమం చూస్తున్నాను. ఆరోజు అంశం “దేవుడు ఉన్నాడా? లేడా?” ఇలాంటి కార్యక్రమాల్లో చాలా సర్వ సాధారణమైన అంశం. చర్చ ప్రారంభించేందుకు ముందుగా గోపాలక్రిష్ణ గారు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు.

ఒక రాజు సమక్షంలో  శంకరాచార్యులుకూ,  మరో నాస్తికుడి మద్య ఈ అంశం మీదే వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఎంతసేపు వాదనలు జరిగినా విజయలక్ష్మి ఎవరినీ వరించడం లేదు. ఒకరికిమించి మరొకరు వాదిస్తున్నారు కానీ  ఎంతసేపటికీ విజేత ఎవరో తేలడం లేదు. చివరికి శంకరాచార్యులవారు రాజుతో అన్నాడు.

“నేను ఒక ఎత్తైన పర్వతశిఖరం మీద నుంచి దూకి దైవ కృప చేత ఎటువంటి ప్రమాదం లేకుండా తిరిగివస్తాను. అప్పుడైనా ఒప్పుకుంటారా దేవుడు ఉన్నాడని?” అన్నాడు.

సరేనన్నాడు రాజు. ఆయన చెప్పినట్లే భగవధ్యానం చేస్తూ కొండపై నుంచి కిందకు దూకినా శంకరాచార్యులకు ఏమీ కాలేదు. అప్పుడు నాస్తికుడు ముందుకు వచ్చి “మాహారాజా! ఇందులో దైవ కృప ఏమీ లేదు. కావాలంటే నేను దైవాన్ని తలుచుకోకుండా అదే కొండపై నుంచి క్రిందకు దూకుతాను. నాక్కూడా ఏమీ కాదు” అన్నాడు. రాజుకు అంగీకరించక తప్పింది కాదు.

విచిత్రంగా నాస్తికుడు కొండపై నుంచి దూకినా ఏమీ కాలేదు. రాజుకు ఏమీ చేయాలో పాలుపోలేదు.

చివరకు శంకరాచార్యుడు కలుగజేసుకుని “రాజా! నేను ఆస్తికుడినై ఉండి రోజులో కొద్ది సమయం దైవ ప్రార్థనలో గడిపి మిగతా సమయ మంతా దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమైపోతాను. కానీ ఈ నాస్తికులున్నారే. వీళ్ళు పొద్దస్తమానం నాలాంటి వాళ్ళను వాదనల్లోకి దించి వాళ్ళ సమయాన్ని వృధా చేయడమే కాక ఇతరుల సమయాల్ని కూడా వృధా చేస్తుంటారు.” అన్నాడు.

ఆ రాజుకు ఆ వాదన సమంజసంగా తోచింది. వెంటనే రాజ్యంలో నాస్తికులు ఎవరు కనిపించినా వాళ్ళ తలలు నరికివేయమని ఆజ్ఞాపించాడట.

ఈ సంఘటన యధాతథంగా గోపాలక్రిష్ణ గారు చెప్పిందే. నాకు వాదం అంటేనే నచ్చదు. ఇంక వాటి గురించి మాట్లాడే ఆసక్తి లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నాకు ఈ సంఘటనలో అంతర్లీనంగా అదే తోచింది.

8 thoughts on “ఆస్తికులు vs నాస్తికులు

  1. good one rightly said about “వాదన” .

    మనకి తెలిసినది పంచుకోవడం అన్నది మంచి లక్షణమే, కాని అది ఇతరులకి అవసరం అయినప్పుడు మాత్రమే చెప్పాలి. తమగురించి నలుగురు చెప్పుకోవాలని మాత్రం కాకూడదు.

    వాక్చాతుర్యతతో ఇతరులని ఓడించాలి అన్న దిశలో వాదోపవాదాలు చెయ్యడంలో ఏ మాత్రం అర్థం లేదు. అనవసర కాలయాపన తప్ప, ఒరిగేదేమీ ఉండదు. ఇది, మరిన్ని వాదోపవాదాలకు /మనస్థాపాలకు దారి తీస్తుందే కాని, జ్ఞానాన్ని పంచదు.

    http://anveshita.blogspot.com/2009/07/blog-post.html

  2. వాదోపవాదాలనుంచే జ్ఞానం పుట్టేది. తర్కాన్ని మరిచి భావోద్వేగాలకు లోనయినప్పుడు చేసేదాన్ని వాదం అనలేము.

    • నిజమే కానీ తర్కంతో చేసే వాదానికి అంతం ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఉదాహరణకు నన్నే తీసుకుంటే నేను వాదంలో చాలా సులభంగా ఓడిపోతాను. కానీ కొన్నిరోజుల తర్వాత నన్ను ఒప్పించిన వారిని ఓడించగల పాయింటేదో స్ఫురణకు వస్తుంది. దాన్ని మళ్ళీ వారితో చెబితే వాళ్ళు ఇంకో పాయింటు లాగుతారు. మళ్ళీ నేను ఇంకో పాయింటు…. అందుకనే దీనికి అంతం లేదు అన్నాను. తాడిని తన్నేవాడుంటే వాడి తల దన్నేవాడుంటాడు కదా… అలాగన్నమాట

వ్యాఖ్యలను మూసివేసారు.