రియాల్టీ షో లా? బూతు పురాణాలా?

ఈ మద్యనే జీటీవీలో ప్రసారమవుతున్న ఆట జూనియర్స్ కార్యక్రమం చూడవలసి వచ్చింది. ఇద్దరు మెంటర్ల మద్య చెలరేగిన వాగ్యుద్ధం చివరికీ అందరికీ పాకింది.

ఒక మెంటర్ (తెలుగులో మార్గదర్శకులు అందాం). ” హలో మీరు xxx, xxx  మూసుకుంటే బాగుంటుంది.” అంది . ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోయింది నాకు.  దాన్నుంచి తేరుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. (xxx, xxx సెన్సార్ కట్ అన్నమాట. నేనే కాదు టీవీలో కూడా కత్తెరేశారు సదరు మాటల్ని)

మళ్ళీ మాటీవీలో ప్రసారమవుతున్న చాలెంజ్ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత పై మాటలు అన్న  ఆమె మీద ఇలా అరుస్తున్నాడు.

” నీ లాంటి వేస్ట్ ఫెలో ని నా లైఫ్ లో నేనింత వరకు చూడలేదు”. ఇలా ఏవేవో అవాకులూ చెవాకులూ, చూసేవాళ్ళకు చిరాకులూ.

ఎవరో కొంత మంది అనామకుల్ని పట్టుకుని వాళ్ళతోనే అన్ని కార్యక్రమాలు చేయించి ప్రేక్షకుల్ని  శిక్షిస్తున్న  ఆ హింసరాజు ను ఏమనాలో నాకు తోచలేదు. వాళ్ళ మ్యానరిజమ్స్, ఏడుపులు, పెడబొబ్బలు టీవీ కార్యక్రమాలంటేనే ఏహ్య భావం కలిగించేలా అనిపించాయి నాకు. టీ.ఆర్.పి రేటింగ్ ల కోసం ఒకటి తర్వాత ఒకటి టీ వీ చానల్స్ కూడా అతని కార్యక్రమాలను ఎగబడి  కొనుక్కుంటూ ఉండటం మరీ దారుణం.

ఓ దేవుడా! ఈ ఘీంకార్ బారి నుంచి మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు?

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అన్ని చానళ్ళలో వస్తున్న రియాల్టీ షోలలో ఇది పరిస్థితి నెలకొని ఉన్నది.

సంతోషం…. చందోగ్యోపనిషత్ కథ

కొన్ని శతాబ్దాల క్రితం శ్వేతకేతు అనే బాలుడు తన తండ్రిని ఇలా అడుగుతున్నాడు.
“నాన్నా! ప్రతి ఒక్కరు సంతోషం కోసం పరితపిస్తున్నారు. అసలు సంతోషం అంటే ఏమిటి?”
“ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే, అతను ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంతో ఉంటాడు. సంతోషంగా లేని వ్యక్తి సంకల్పం గట్టిగా ఉండదు. అతని మనసు సంకుచిత భావాలతో నిండిఉంటుంది. కేవలం అనంతమైన బ్రహ్మము లోనే సంతోషం ఇమిడి ఉంది.”
“నేను దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలా నాన్నా” అన్నాడా బాలుడు.
“తప్పకుండా. నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు.  ఎవరైనా సరే ప్రపంచంలో ఏదీ తన నుంచి వేరు కాదు, అన్నీ తనలో భాగమే అని తెలియాలి. వారు అదే చూడగలగాలి, అదే వినగలగాలి, అది తప్ప వేరే ఆలోచన వారి మనసులోవేరే ఆలోచన ఉండకూడదు. అదే బ్రహ్మమని చెప్పబడుతుంది”

కానీ ఎవరైనా తమకు అడ్డుపడుతున్నారని భావించినా, వారు తాము కాదు అని భావించినా వారు బ్రహ్మమును కనుగొననట్లే లెక్క. ఆ అనంతమైన స్వరూపం ఎక్కడికీ పోదు. అది ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది.

గమనిక: ఈ కథలో ఇంకా లోతైన జ్ఞానం ఉండి ఉండవచ్చు. నేను ఇక్కడ రాసింది కేవలం నాకు అర్థమైంది మాత్రమే.