అన్వేషణకి అంతే లేదు…

జపానీయులకు తాజా చేపలంటే ఎంతో మక్కువ. కానీ వారికి దగ్గర్లో ఉన్న నీటి వనరుల్లో కొన్ని దశాబ్దాల నుంచి ఎక్కువగా చేపలు ఉండేవి కావు. ప్రజా అవసరాలను తీర్చడానికి జపాన్ వాసులు పెద్ద పడవలతో దూర తీరాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే దూరం పెరిగే కొద్దీ చేపలను తిరిగి తేవడానికి సమయం కూడా ఎక్కువ పడుతోంది. సమయం గడిచే కొద్దీ చేపలు చాలా వరకు చెడిపోయేవి.

చేపలు తాజావి కాకపోవడంతో జపానీయుల జిహ్వకు రుచించేవి కావు. ఈ సమస్యను అధిగమించడానికి పడవల్లో శీతలీకరణ యంత్రాలను అమర్చడం జరిగింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా పడవలు ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ సమయం గడిపి వచ్చేవారు. కానీ జపానీయులకు తాజా చేపలకూ, నిల్వ చేసిన చేపలకూ రుచిలో తేడా తెలిసింది. అందుకనే నిల్వ చేసిన చేపలకు తక్కువ ధర పలికేది. కాబట్టి పడవల్లో చేపల ట్యాంకులు ఏర్పాటు చేయించారు వాటి యజమానులు. అయితే వాటిలో చేపల్ను ఇరుకు గా ఉంచడంతో అవిసరిగా కదిలేవి కావు. దాని వల్ల అవి సగం జీవంతోనే మాత్రమే ఉండేవి. కాబట్టి తినే వారికి ఇంకా రుచిలో తేడా తెలిసేది.

చేపల ధర తక్కువగా ఉండటంతో ఒక విధంగా జపాన్ లో చేపల పరిశ్రమ సంక్షోభంలో పడింది. కానీ ఈ రోజు జపాన్ ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని దినదిన ప్రవర్థమానం చెందుతోంది.  ఎలాగో తెలుసా? పడవల్లో నీటి తొట్టెల్లో చేపలతో బాటు ఒక చిన్న షార్క్ చేపను కుడా విడిచిపెట్టేవాళ్ళు. అది కొన్ని చేపలను తినిసేది కానీ, దానికి భయపడి చిన్న చేపలన్నీ అటు ఇటు తిరుగుతూ ఉండేవి. కాబట్టి గమ్యం చేరేవరకు అవి నీళ్ళలోనే ఉన్నట్టుగా తాజాగా ఉండేవి. ధర బాగా పలికింది. పరిశ్రమ అభివృద్ధి బాట పట్టింది.

అందుకనే అంటారు “సాధించిన దానితో సంతృప్తి చెందేవారు జీవితంలో ఎదగలేరు.” అని. సవాళ్ళు మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. వాటిని విజయవంతంగా ఎదుర్కొంటే సంతోషం ఎప్పుడూ మనవెంటే.