ఈ విజయం దేనికి సంకేతం?

మహారాష్ట్ర, అరుణాచల ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. మహారాష్ట్రలో అయితే ఏకంగా కాంగ్రెస్ కూటమి మూడో సారి పగ్గాలు చేపట్టడానికి సమాయత్త మవుతోంది.
ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఓడిపోయిన ప్రతివాళ్ళూ (ఈ ఎన్నికల తరువాత బి.జె.పి నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అంతకు ముందు మన చంద్రబాబు, లెఫ్ట్ పార్టీల వాళ్ళు)ఈవీయం ల మీద పడి ఏడవటం అలవాటైపోయింది. ఎంత రిగ్గింగ్ జరిగినా ఈవీయం లను తమ పార్టీకి మాత్రమే ఓట్లు పడేలా మార్చేస్తే ఎలక్షన్ కమీషన్ చూస్తూ కూర్చునేంతగా బలహీనమైందని నేననుకోను.
ప్రజలు సోనియా గాంధీ నాయకత్వాన్ని సమర్ధిస్తూ ఓట్లు వేస్తున్నారా? లేక ఆ పార్టీ యొక్క ప్రాంతీయ నాయకుల పాలన నచ్చి గెలిపిస్తున్నారా? లేక ప్రతిపక్షాలు వ్యూహంలో వెనుకబడుతున్నాయా అన్నవి నాకు అర్థం కాని ప్రశ్నలు. కానీ వీటిలో ఏ ఒక్కటో కాక అన్నింటి ప్రభావం మాత్రం ఖచ్చితంగా పనిచేసిందనుకుంటాను. కాకలు తీరిన రాజకీయ పండితులే ఓటర్ల నాడిని అంచనా వేయలేకపోతున్నారు. నేనెంత?
అయితే ప్రస్తుతం బి.జె.పి ఎదుర్కొంటూన్న పరిస్థితులను కాంగ్రెస్ కూడా ఒకప్పుడు అనుభవించింది. త్వరలోనే బి.జె.పి కూడా బలపడుతుందని ఆశిద్దాం. బలమైన ప్రతిపక్షం ఉంటేనే కదా అధికార పక్షం కంట్రోల్ లో ఉంటుంది.

పందెం

ఒక సర్దార్జీ, అమెరికన్ విమానంలో పక్క పక్కనే కూర్చున్నారు. అమెరికన్ కు బోర్ కొట్టి సర్దార్జీ తో “సరదాగా ఏదైనా ఆట ఆడదామా?” అన్నాడు. సర్దార్జీ అలసిపోయి ఉండటం చేత మర్యాదగా తిరస్కరించి చిన్న కునుకు తీయడానికి ఉపక్రమించాడు. అయినా అమెరికన్ వదిలిపెట్టకుండా “ఈ గేమ్ చాలా సులభం. చాలా సరాదాగా కూడా ఉంటుంది.” అన్నాడు

“ఈ ఆట ఏంటంటే నేనొక ప్రశ్న అడుగుతాను. నువ్వు జవాబు చెప్పలేకపోతే నాకు ఐదు డాలర్లు ఇవ్వాలి. అలాగే నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోతే నేను నీకు ఐదు డాలర్లు ఇస్తాను”

సర్దార్జీకి పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. వద్దని చెప్పి మళ్ళీ కునుకుతీయబోయాడు.

అయినా సరే అమెరికన్ పట్టు విడవలేదు. “సరే అయితే నువ్వడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోతే 500డాలర్లు ఇస్తాను. నేనడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేక పోతే జస్ట్ ఐదు డాలర్లు ఇవ్వు చాలు” అన్నాడు.

అప్పుడు సర్దార్జీ ఇదేదో బావుందే అనుకుని ప్రశ్న అడగమన్నాడు.

అమెరికన్ ఇలా అడిగాడు “భూమికీ చంద్రుడికి మద్య దూరం ఎంత?” అని అడిగాడు.

సర్దార్జీ నెమ్మదిగా తన జేబులోంచి ఐదు డాలర్ల నోటు తీసి అమెరికన్ కి ఇచ్చేశాడు.

“ఓకే అయితే ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడగాలి అన్నాడు.”

సర్దార్జీ కొంచెం సేపు ఆలోచించి “కొండను ఎక్కేటపుడు మూడు కాళ్ళతో కొండను దిగేటప్పుడు నాలుగు కాళ్ళతో వచ్చేది ఏది?” అని అడిగాడు. అమెరికన్ చాలా సేపు ఆలోచించాడు సమాధానం దొరకలేదు. తన ల్యాప్‌టాప్ తెరెచి గూగుల్ లో సర్చ్ చేశాడు. లాభం లేదు.

చివరికి సర్దార్జీ దగ్గరికి వచ్చి ఓటమిని ఒప్పుకొని ఐదు వందల డాలర్ల నోటును ఇచ్చేశాడు.

దాన్ని తీసుకుని సర్దార్జీ మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు. అమెరికన్ కు మాత్రం మనసు కుదుట పడలేదు. సర్దార్జీని నిద్రలేపి “ఇంతకీ ఆ ప్రశ్నకు జవాబేంటీ?” అని అడీగాడు.

సర్దార్జీ నెమ్మదిగా జేబులో చెయ్యి పెట్టి ఐదు డాలర్ల నోటును అమెరికన్ కు ఇచ్చి మళ్ళీ నిద్ర లోకి జారుకున్నాడు.