ఇంటి భాగోతం

“ఏం రవీ! హైదరాబాద్ లో ఎక్కడైనా ఫ్లాట్ కొనే ఆలోచనలు ఉన్నాయా?” అడిగాడు ఒకతను నన్ను ఇటీవల.
“ఇప్పుడే ఆలోచనల్లేవు. ఇంకొన్ని సంవత్సరాలు తర్వాత ఆలోచిస్తా. అప్పటికి కొంచెం కూడబెట్టుకోగలుగుతా కదా!” అన్నాను.
“ఇప్పుడైతేనే రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం ఆగావంటే నువ్వు కూడబెట్టిన సొమ్ముతో బాత్ రూమ్ కూడా కొనలేవు” అన్నాడు.
“చూద్దాం! ఇక్కడ స్థిరపడే సమయానికి కొనేట్టు లేకపోతే తిరిగి మా ఊరెళ్ళి పోతా.” అన్నాన్నేను
“ఊరికెళ్ళి ఏం చేస్తావు? వ్యవసాయం చేసుకుంటావా?” వ్యంగ్యంగా అన్నాడు.
హన్నా! వ్యవసాయం అంటే ఎంత చులకనైపోయింది. నిజమే ఆయనన్నట్లు వ్యవసాయమే చేస్తానేమో! అంతే కానీ ఇప్పుడు ఉండే రేట్ల ప్రకారం జీవితాంతం నేను సంపాదించిన మొత్తంలో సగ భాగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో కుమ్మరించడానికి మాత్రం మనస్కరించడం లేదు. ఇలాగైతే నేనెప్పటికీ ఇల్లు కొనలేనేమో.. 🙂
అసలు ఇల్లుంటే చాలు ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంతరేటు చెబితే అంతరేటు చెల్లించేసి చేతిలో పైసా లేని వాళ్ళను రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులేనని నా ప్రగాఢ విశ్వాసం.