హరి పాదాన పుట్టావంటే గంగమ్మా…

ఒక సారి నారద మహర్షి గగన సంచారం చేస్తుండగా ఆయనకు కాళ్ళు లేక కొంత మంది, చేతుల్లేక కొంత మంది, ఇంకా వివిధ అవయువాలు కోల్పోయి నానా అవస్థలు పడుతూ కొంతమంది కనిపించారు. నారద మహర్షి వారి పరిస్థితిని చూసి జాలిపడి వారిని ఇలా ప్రశ్నించాడు.
“ఎవరు నాయనా మీరు. ఎందుకిలా అయిపోయారు. మీకీ దుస్థితి రావడానికి కారణమేంటి?” అని ప్రశ్నించాడు.
అందుకు వారు “స్వామీ మేము గంధర్వులం. దివ్యమైన సంగీతాన్ని మానవులు తప్పుడు స్వరాలతో గానం చేసినప్పుడల్లా ఇలా మాలో ఒకరికి అంగవైకల్యం ఏర్పడుతుంది” అన్నాడు.
“మరి మీరు జీవితాంతం ఇలా ఉండాల్సిందేనా?” ప్రశ్నించాడు నారదులవారు.
“ఒక్క మార్గం ఉంది స్వామీ ఈ సృష్టిలో పరమశివుడు అత్యుత్తమ గాయకుడు. ఆయన ఒకసారి గానం చేస్తే మాకందరికీ ఈ అంగవైకల్యం తొలగిపోతుంది. కాబట్టి మీరు కైలాసం వెళ్ళి ఈశ్వరుణ్ణి ఎలాగైనా ఒప్పించాలి” అని ప్రాధేయపడ్డారు.
“ఒప్పిస్తాం సరే శ్రోతలెవరూ లేకుండా ఎలా పాడడం?” సందేహం వెలిబుచ్చాడు నారదుడు.
“శ్రీ మహావిష్ణువు అత్యుత్తమ శ్రోత. ఆయన్ను ఆహ్వానించండి” అన్నారు గంధర్వులు. అలా నారదుడు శివుడితో అద్భుతమైన సంగీతాన్ని ఆలపింపజేశాడు. గంధర్వులందరూ తిరిగి సాధారణ రూపాన్ని సంతరించుకున్నారు. దివ్య సంగీత ఝరిలో లీనమైన విష్ణువు శరీరం పులకించి స్వేద బిందువులు జారి పాదాల వద్ద గంగగా ప్రవహించిందని ఒక కథనం.