యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి సందర్శన యోగం

శంఖు చక్రాలు
శంఖు చక్రాలు

నిన్న నేను, నా మిత్రుడు తో కలిసి యాదగిరిగుట్ట కు వెళ్ళాం. ఉదయాన్నే ఆలస్యంగా నిద్ర లేవడంతో టిఫిన్ చేయకుండానే బయలుదేరాం. యాదగిరి గుట్ట చేరుకునే సరికి సమయం మద్యాహ్నం రెండు గంటలయింది.క్యూ లైన్లు బాగా ఖాళీగా కనిపించడంతో దర్శనం చేసుకుని తర్వాత తినచ్చులే అనుకుని వాటిలో దూరాం. తర్వాత తెలిసింది అవి ఎంత పొడవున్నాయో. దర్శనం చేసుకుని బయటకు వచ్చే సరికి సుమారు 4:30 అయింది. అలా మాకు తెలియకుండానే ఉపవాసంతో దర్శనం చేసుకున్నామన్న మాట. ఆలస్యమైనా సరే దర్శనం బాగా జరిగింది.
ఆలయం లోపల కోతులు స్వైర్యవిహారం చేస్తున్నాయి. క్యూలోని చిన్న పిల్లలు భయపడి ఏడుస్తూ కన్పించారు. గుట్టబయటకు వచ్చి చూస్తే ఆలయం గోపురంతో సహా కనుమరుగయేంతలా చుట్టూరా భవంతులు లేచి ఉన్నాయి. గుడి కన్నా అతిథి గృహాలే ఎక్కువగా కనిపించాయి.
ఈ కాలంలో ఎక్కడా కనిపించని గుర్రబ్బండ్లు (టాంగాలు) ఇక్కడ విరివిగా దర్శనమిచ్చాయి. పాపం గుర్రాలే చిక్కి శల్యమై కనిపించాయి. అంతా సవ్యంగా జరిగిపోయింది కదా అనుకుంటుండగా ఒక హృదయ విదారకమైన దృశ్యం ఒకటి కనిపించింది. అనాథ శవం దహన కోసం డబ్బులడగడం ఎప్పుడూ సినిమాల్లో చూసిన నేను దాన్ని ప్రత్యక్షంగా చూడవలసి వచ్చింది. అలా భక్తి, వైరాగ్యాలను ఒకేసారి కల్గించాడు నాకు ఆ లక్ష్మీ నరసింహ స్వామి.