ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన… (ఆధ్యాత్మిక కథ)

కొన్ని సంవత్సరాల క్రిందట గురువాయూర్ లో ఒక విష్ణు భక్తుడు నివసించేవాడు. నిరంతరం భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉండేవాడు. ఒక సారి తన ప్రియాతి ప్రియమైన కూతురికి వీపుపై అంతుచిక్కని ఒక వ్యాధి (రాచపుండు లాంటిది) సోకింది. ఆ వ్యాధితో ఆమె నానాటికీ చిక్కి శల్యమైపోతూ ఉంది. ఎన్నో వైద్యాలు చేయించాడు. పూజలు చేయించాడు. అయినా ఫలితం కనిపించలేదు.

చివరికి దూరదేశంలో ఎవరో సిద్ధహస్తుడైన ఒక వైద్యుడు ఇలాంటి అంతుచిక్కని వ్యాధులను నయం చేయడంలో ప్రావీణ్యం కలవాడని తెలియవచ్చింది. ఆయన్ను ఇంటికి తీసుకుని వచ్చి తన కూతుర్ని చూపించాడు. ఆయన బాగా పరీక్షించి, కొద్దిగా ఆలోచించి ఆ భక్తుడితో ఇలా అన్నాడు.

“ఇది చాలా అరుదైన వ్యాధి. అయితే దీనికి నా దగ్గర వైద్యం ఉంది. కాకపోతే ఔషధాన్ని తయారు చేయడానికి కుళ్ళిపోయిన నీళ్ళపాము కొవ్వు కావాలి” అన్నాడు.

దానికి ఆ భక్తుడు ఆలోచనలో పడ్డాడు. “శుచీ శుభ్రతతో నిత్య దీపారాధనతో పూజలు నిర్వహించే నేను అలాంటి మందుతో వైద్యం చేయించడమా? నేను చెయ్యలేను. నా కుమార్తెను ఆ శ్రీ మహా విష్ణువే కాపాడుగాక!” అని ఆ వైద్యుడిని తిప్పి పంపించి వేశాడు.

ఆ రాత్రే శ్రీ మహా విష్ణువు ఆలయానికి వెళ్ళి నిష్కల్మషమైన భక్తితో ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. ” దేవ దేవా! ఈ ప్రపంచంలో నీకు సాధ్యము కానిదేమున్నది? నేను నీకు నిజమైన భక్తుడిని అన్నది నిజమే అయితే నా కుమార్తెకు ఆ వైద్యుడు చెప్పినట్లు  కాకుండా నయమయ్యేలా చేయి” అని ప్రార్థించాడు. అలా ధ్యానిస్తూ ఆలయంలో నిద్రపోయాడు.

రాత్రి కలలో  ఒక అశరీరవాణి  ఆయన్ను ఉద్దేశించి ” ఈ ఆలయ ప్రాంగణంలోని కోనేటిలోని నీటిని తీసుకెళ్ళి కొన్ని వనమూలికలతో చూర్ణంగా నూరి నీ కూతురి గాయానికి రాయి. తగ్గిపోతుంది” అని  పలికింది.

ఆయన ఉదయాన్నే లేచి కోనేటిలో నీటిని తీసుకుని సంతోషంతో ఇంటికి చేరాడు. స్వప్నంలో విన్నట్టుగా మందును తయారు చేసి కుమార్తె గాయానికి పూయసాగాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత గాయం పూర్తిగా నయమైంది. పరమానంద భరితుడైనాడు.

కొద్ది రోజులకు ఆయన ఒకసారి ఏదో పని మీద బయటకు వెళుతుండగా వైద్యుడు తారస పడి కుమార్తెకు ఎలా ఉందని అడిగాడు. అందుకు ఆ భక్తుడు “ఆ విష్ణుమూర్తి దయ వల్ల మీరు చెప్పిన వైద్యం లేకుండానే, కేవలం కోనేటిలో జలంతో బాగయింది” అన్నాడు. వైద్యుడు ఆలోచనలో పడ్డాడు. ఆయనా శ్రీ మహావిష్ణువు భక్తుడే. “కానీ ఇది ఎలా సాధ్యం? ఆ వ్యాధికి తను సూచించిన మందు తప్ప వేరే ఔషధం లేదే!”. ఆయన  మనస్సంతా అదోలా అయిపోయింది. ఆలోచిస్తూ ఆలయం వైపు నడిచాడు. ” స్వామీ ఎల్లవేళలా నిన్నే నమ్ముకుని వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నానే. నాకు ఎందుకీ పరీక్ష” అనుకుంటూ ఆలయంలో లోనే నిద్రపోయాడు.

ఉదయాన్నే నిద్ర లేచే సరికి ఆయనకు మనసులోనే ఏదో స్పురించింది. నెమ్మదిగా కోనేరు దగ్గరికి వెళ్ళాడు. ఒక మూలగా కోనేటి లోకి సన్నగా జల ధార  వస్తోంది. ఎక్కడ నుంచి వస్తూందో ఆసక్తిగా గమనించాడు. అది పక్కనే ఉన్న కొండల్లోంచి వస్తోంది. నెమ్మదిగా దాని వెంట నడవడం ప్రారంభించాడు. కొద్ది దూరం ప్రయాణించే సరికి ఆ వస్తున్న నీటి పాయలో చచ్చి పడిఉన్న నీళ్ళపాము కనిపించింది.

ఆయనకు జరిగింది అర్థమయింది. మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంటి దారి పట్టాడు.

మూలం: ఐదారు సంవత్సరాల క్రిందట ఈ కథను శ్రీ రామకృష్ణ ప్రభ లోనే ఋషిపీఠం లోనే చదివినట్లు గుర్తు.