మనసు కిటికీ (కథ)

తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఇద్దరు పేషెంట్లు ఆసుపత్రిలో ఒకే గదిలో ఉన్నారు. ఆ గదికి ఒకటే కిటికీ ఉంది. ఒక పేషెంట్ కి కిటికీ పక్కనే బెడ్. కాబట్టి కిటికీ గుండా బయటకు చూస్తూ అప్పుడప్పుడూ ఒక అర్ధ గంటసేపు గోడకానుకుని కూర్చునేవాడు. రెండో పేషెంట్ కి ఆ సౌకర్యం లేదు. రోజంతా అలా బెడ్ లోనే పడుకోవాల్సి వచ్చేది.
వాళ్ళిద్దరూ గంటలతరబడి మాట్లాడుకునే వారు. వాళ్ళ కుటుంబాల గురించీ, ఇళ్ళు, ఉద్యోగాల గురించీ ఎన్నెన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ రోజు గడిపేవాళ్ళు. ప్రతిరోజూ మధ్యాహ్నం కిటికీ పక్కనే ఉండే పేషెంట్ లేచి కూర్చుని దానిగుండా బయటకు కనిపించే విషయాలన్నీ వర్ణించి చెప్పేవాడు. మరో పేషెంట్ కి ఒక రోజు సమయంలో ఆ అర్థ గంట మాత్రమే బాహ్యప్రపంచాన్ని గురించి తెలుసుకుంటూ ఆనందంగా గడిచేది. ఆ వ్యక్తి వర్ణించినట్లుగా ఆ కిటికీ పక్కనే ఒక అందమైన ఉద్యానవనం ఉండేది. అందులో ఒక సుందర జలాశయం. అందులో పిల్లలు పడవలు చేసి ఆడుకుంటుంటే హంసలు ఆనందంగా ఈదులాడుతున్నాయి. ప్రేమికులు ఒకరికొకరు చెట్టాపట్టాలేసుకుని ఆనంద విహారం చేస్తున్నారు. ఇలా అతను వర్ణిస్తుంటే అది వింటూన్న ఇంకో వ్యక్తి కళ్ళు మూసుకుంటే ఒక అద్భుతమైన, నయనానందకరమైన దృశ్యం కళ్ళ ముందు కదలాడేది.
ఒకరోజు మధ్యాహ్నం వారికి దారిలో ఒక ఊరేగింపు వెళుతున్న చప్పుడు వినిపించింది. కిటికీ పక్కన వ్యక్తి లేచి కూర్చుని దానిని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించి చెప్పాడు. అకస్మాత్తుగా రెండో వ్యక్తికి ఆలోచన వచ్చింది. “నేనిక్కడ నాలుగ్గోడల మద్య నలిగిపోతుంటే అతను మాత్రమే బయటకు ఎందుకు చూడాలి? ఇదేం బాగాలేదు” అనుకున్నాడు. మరుక్షణంలో అలాంటి ఆలోచన వచ్చినందుకు సిగ్గు పడ్డాడు. కానీ రోజులు గడిచే కొద్దీ అతనిలో అసంతృప్తి పెరగసాగింది. ఆలోచనల్తో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఎలాగైనా సరే ఆ కిటికీ పక్కన చేరాల్సిందే అనుకున్నాడు.
ఇలా ఉండగా ఒక రోజు రాత్రి కిటికీ పక్కన ఉన్న పేషెంట్ ఒక్కసారిగా దగ్గు ప్రారంభమైంది. నెమ్మదిగా తీవ్రమవసాగింది. రక్తం కూడా పడుతోంది. అంత బాధలోనూ అతను సహాయం కోసం మీట నొక్కడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ మనసులో వేళ్ళూనుకున్న విషపుటాలోచన అతన్ని ఏమీ చెయ్యనివ్వలేదు. అతని దగ్గరున్న మీట నొక్కితే ఖచ్చితంగా వెంటనే నర్సు పరుగెత్తుకుంటూ వచ్చేదే. కానీ అతడలా చెయ్యలేదు.
మరుసటి రోజు ఉదయం యధావిధిగా వారిని పరీక్షించడానికి నర్సు వచ్చింది. విగతజీవుడై పడిఉన్న పేషెంట్ వైపు చూసి కొద్ది సేపు బాధపడింది. రెండో పేషెంట్ ని ఏమీ అడగలేదు.వార్డ్ బాయ్ ని పిలిచి శవాన్ని తీసుకుపోమని చెప్పింది. దాన్ని అటు తీసుకెళ్ళగానే తనని ఆ కిటికీ పక్కకి మార్చమని నర్సుని అడిగాడు . ఆమె అలాగే మార్చి వెళ్ళిపోయింది.

కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా లేచి గోడకానుకుని కిటికీ వైపు చూశాడు. దానికడ్డంగా ఒక గోడ తప్ప ఇంకేమీ కనిపించలేదు.
****************************************************************
నా ఈ-మెయిల్ కి మిత్రుల నుంచి ఎన్నో ఆసక్తికరమైన కథలు వస్తుంటాయి. అలాగే నేను కొన్ని వెబ్‌సైట్లలో ఆంగ్లంలో చదివిన కథలు కూడా. వీటన్నింటినీ తెలుగులోకి అనువదించి ఒకచోట చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఇలాంటి కథలను రాసేలా ప్రోత్సహిస్తోంది. అలాంటి ఒక కథే ఇది. దీనికి ఆంగ్ల మూలం ఒక అజ్ఞాత రచయిత రాసినట్లుగా చెప్పబడుతున్న, http://www.indianchild.com/inspiring_stories.htm లో ప్రచురించబడింది.