ఎ.ఆర్. రెహ్మాన్ కు బాలు ప్రశంస

కొన్నేళ్ళ క్రిందట జీ తెలుగు టివిలో ఎందరో మహానుభావులు అనే కార్యక్రమం వచ్చేది. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా స్వరపరచబడిన ఆణిముత్యాల లాంటి పాటలను ఎన్నుకుని వాటి వెనుక నేపథ్యాన్ని వివరిస్తూ ఔత్సాహిక గాయకుల చేత వాటిని పాడించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం. ఎస్పీ బాలసుబ్రహ్మణం దీనికి వ్యాఖ్యాత.
ఒక సారి రజనీకాంత్ హీరోగా వచ్చిన ముత్తు సినిమాలో “థిల్లానా థిల్లానా…” అనే పాట వచ్చింది. దానికి సంగీతం ఎ.ఆర్.రెహ్మాన్.
ఆ పాట గురించి ఎస్పీ బాలు మాట్లాడుతూ “ఈ పాటలు విడుదలైన మొదట్లో విమర్శకులు ఈ పాటను గురించి ప్రత్యేకంగా విమర్శిస్తూ అసలు ఇదీ పాటేనా? గులక రాళ్ళు డబ్బాలో పోసి గిల కొట్టినట్లుంది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్ళందరికీ నాది ఒకటే సమాధానం. నిజమే! ఆ పాట గులక రాళ్ళు డబ్బాలో పోసి కులికినట్లే ఉంది. కానీ గులకరాళ్ళు డబ్బాలో పోసి కూడా అందమైన పాట కూర్చడం ఒక్క ఎ.ఆర్.రెహ్మాన్ కే సాధ్యం” అన్నారు.