ఓ అమ్మ కథ…

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు.
అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు.
“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.
ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను.
ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను.
ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!
అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతో జడుసుకుంది. “ఎవరు నువ్వు? ఎందుకొచ్చావిక్కడికి? నువ్వెవరో నాకు తెలియదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?ముందు నువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!” సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను.
“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను” ఆమె అదృశ్యమైపోయింది. “హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”. భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను.
కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ. నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం.

ప్రియమైన కుమారునికి,
ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను. నేనింక నీవుండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా! ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకున్నాను. కన్నపేగురా. తట్టుకోలేక పోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగాలు లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసినదాన్నవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు. చిన్నా! నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా! అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. ఒక్క రెండు సార్లు మాత్రం ” వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనా కదా!” అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు.

ఉత్తరం తడిసి ముద్దయింది. నాకు ప్రపంచం కనిపించడం లేదు.నవనాడులూ కుంగిపోయాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను. తన జీవితమంతా నాకోసం ధారబోసిన మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తి ఆమె ఋణం తీర్చుకోను?

PS:ఒక వెబ్‌సైటులో నేను చదివిన ఆంగ్లకథకు స్వేచ్చానువాదం.
Disclaimer: ఇది నా జీవిత కథ కాదు. దయచేసి నాపై ఎవరూ కోపగించుకోవద్దు. 🙂

25 thoughts on “ఓ అమ్మ కథ…

 1. ఇది మీ కథేనేమో అనుకుని ఈడ్చి ఒకటిద్దామనిపించింది.

 2. mmmmm…ekkado chadivaanu ….

  idi….koncham ekkuvaga hurt chesinatlu anipinchindi kaabatti andariki kopam raavatam sahajam……..

  but manam chinna chinna vaatiki visukuntam choosaaru….maa ammagaaru computer gurinchi nenu m.tech chesetappudu anni degrees ki difference adugutunte…..baaga visukkune vaadini……..appudu maa amma gaaru annaru…….ninnu adgaka memu evarini adugutam ra.teliyanappudu ani……..chinnappudu nuvvu ala enni adigina memu visukkunnama ani……….

  anthe eedchi kottinatlu anipinchindi…..manam just visukkovatam anukuntam…but chaaala pedda mistake adi………….

  anyway manchi story gurtu chesaaru…….ilantivi tarachu post cheyadam valana……..eppudo okappudu strike avutundi……

 3. మానవత్వ్తం మరచి ప్రవర్తించింది కాక ఇలా సిగ్గులేకుండా ఘనకార్యం చేసినట్లు రాసావేంటి ? అని మొహమాటం లేకుండా తిట్టాలనుకున్న ….బ్రతికిపోయారు….ఎంత భాద కలిగిందో..మనలోకి మనం చూసుకునే అవకాశం కల్పించారు. బాగుంది.

 4. చాలా బాగుంది కథ. చాలా మంది సులువు గా అనే మాట ఇంట్లో –
  “అమ్మా నీకేమీ తెలీదు లే, గమ్మునుండు” లేదంటే “అమ్మా, నీకు మాట్లాడడం రాదు, ఊరికే ఉండు”. ఎవరైనా అలా అన్నపుడు వాడికి అసలు “మాటలు” నేర్పించింది ఆ అమ్మే కదా అనిపిస్తుంది. ఆ అమ్మనే నీకు మాట్లాడడం రాదు అని ఎలా అంటున్నాడో అర్థం కాదు. అయితే ఇంకో విషయం ఏంటంటే- “అమ్మా నీకేమీ తెలీదు లే, గమ్మునుండు” అని కొడుకో కూతురో అన్నపుడు హర్ట్ అయ్యే అమ్మల కంటే “నా కొడుకు/కూతురు కి నాకంటే ఎక్కువ విషయాలు తెలుసు” అని ఆనందించే అమ్మలే చాలా ఎక్కువ!! 🙂

  బాగా అనువదించారు. ఇంకో విషయం ఈ కథ ఆంగ్ల మూలానికి రచయిత ఎవరో చెప్తారా?

  • నేను ఆ పోస్టులో Disclaimer పెట్టింది. కథ చివరిదాకా చదవకుండా నా కథే అనుకుని నన్ను చెడామడా తిడదామనుకున్న వాళ్ళ కోసం సరదాగా.అంతేకానీ వినయ్ గారు నేను “ఈ కథ ఎక్కడో చదివాను” అన్నందుకు కాదు. ఆ మాట కొస్తే 99 శాతం మంది బ్లాగుల్లో రాసే 99 శాతం విషయాలు ఎక్కడో ఒక దగ్గర నుంచి కాపీ కొట్టినవేనని నా వ్యక్తిగత అభిప్రాయం.

   • I GOT YOU NOW. PS అని అనుకుంటా కొత్తగా add చెయ్యడం మొదలు పెట్టారు.

    మిమ్మల్ని కాని, కామెంట్ చేసిన వాళ్ళను కాని తప్పు పట్టడం కాదు నా వుద్దేశం.ప్రతి దానికి మూలం వుంటుంది, దానిని చెప్పనంత మాత్రాన ఎవరికీ నష్టం లేదు అని.

 5. కథ అద్భుతం గా ఉంది. మీ అనువాదం ఇంకా బాగుంది.
  అమ్మ పక్కన ఉన్నంత కాలం మనం ఆవిడ ని పట్టించుకోము…దూరం గా వెళ్ళినప్పుడే ఆవిడ విలువ తెలుస్తుంది కద!!!

  మీ అనువాదమం style చూస్తే నాకు ఏడుతరాలు (Roots), మాక్సీమ్ గోర్కి “అమ్మ” గుర్తొచింది.

 6. రవిచంద్ర
  బతికిపోయావు
  nee కధ ఏమో అనుకోని సగం చదివాక ఛీ మళ్ళీ ఈ అంతర్వాహిని బ్లాగు లోకి రాకూడదు అనుకున్న
  చదివాక తెలిసిందిఇంత మంచి కధ ఎలా మిస్ అయ్యాను అని

  Ravi నీలో నాకు ఒక మంచి రచయిత కనిపిస్తున్నాడు
  all the best

  • మీలాంటి శ్రేయోభిలాషుల సూచనలు, సలహాలు, అభినందనలు నన్ను మంచి రచయితగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటున్నాను.

 7. మీ మా ఫ్రెండ్ లలిత గారు ఎలా వున్నారు అడిగినట్టు చెప్పండి 🙂

 8. అమ్మ పక్కన ఉన్నంత కాలం మనం ఆవిడ ని పట్టించుకోము…దూరం గా వెళ్ళినప్పుడే ఆవిడ విలువ తెలుస్తుంది కద!!!

వ్యాఖ్యలను మూసివేసారు.