నేనెవర్ని?

మా మిత్రుడొకడు ఈ మధ్యనే నా దగ్గరకొచ్చి
ఏదో మాటల మధ్యలో “అసలు ఫిలాసఫీ అంటే ఏంటిరా. అసలు ఫిలాసఫర్లు దేని గురించి ఆలో చిస్తుంటారు?” అని అడిగాడు.
నేనొక ఉదాహరణ ఇచ్చాను వాడికి.
నా పాస్ పోర్ట్ ఫోటో చూపించి
“ఇది నేను”
“కాదు ఇది నా ఫోటో”
“కాదు కాదు ఇది నా దేహం ఫోటో”
“కాదు కాదు ఇది నా దేహంలోని తల భాగం యొక్క ఫోటో” అన్నాను.

“ఏడ్చినట్టుంది నీ తలకాయ అయితే ఒకటి.. నువ్వైతే ఒకటా? అయినా ఇలాంటి ప్రశ్నలడగటం నా దే బుద్ధి తక్కువ. ఇంక ఆపెయ్యరా బాబూ” అని దణ్ణం పెట్టాడు.
అయితే దీనికి ఆధారమైన ఒక చారిత్రక సంఘటన ఉంది.
అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చినపుడు మనదేశంలోని ఋషుల గురించి గొప్పగా విని ఉన్నాడు. వారు గొప్ప జ్ఞానులని ఆయన నమ్మకం.
ఒకసారి అడవి మార్గంలో వెళుతుండగా ఆయనకు తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసి కనిపించాడు. అలెగ్జాండర్ ఆయన్ను తమ దేశానికి వచ్చి ఉపదేశాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆయన ఒప్పుకోలేదు. బతిమాలాడు అయినా ఒప్పుకోలేదు. చివరికి అలెగ్జాండర్ కు కోపం వచ్చి నిన్ను చంపేస్తానంటూ కత్తి దూశాడు.
” ఆయన చిరునవ్వుతో నువ్వు నా శరీరాన్ని చంపగలవేమో కానీ నన్ను నిజంగా చంపగలవా?” అని అడిగాడు.
దాంతో అలెగ్జాండర్ సిగ్గుపడి తన దారిన వెళ్ళిపోయాడు.