గవర్న్‌మెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూలా?

“అవ్వా! నేను తొమ్మిదో తరగతికి కాళహస్తికి వెళ్ళి చదువుకుంటానవ్వా” అన్నాడో అబ్బాయి వాళ్ళ అమ్మమ్మతో.
“సరే నాయనా! ఏ బడిలో చేరతావు?” అడిగింది అవ్వ.
వయసులో చిన్నవాడయినా ఆ అబ్బాయికి తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు.ప్రైవేటు స్కూలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమని అతనికి తెలుసు.అవన్నీ వాళ్ళకి చెప్పకుండా
“గవర్న్‌మెంట్ బాయ్స్ హైస్కూల్ ఉంది కదా అందులో చేరతా” అన్నాడు.
“అక్కడ సరిగా చెప్పరంట కద నాయనా. ఏదైనా ప్రైవేటు స్కూల్లో చేరకూడదూ” అంది అవ్వ.
“ఏదో తెలియని వాళ్ళు చెప్పుంటార్లే అవ్వా.నేను అక్కడే చదువుతాను. అయినా గవర్న్‌మెంట్ స్కూల్లో అయితే మంచి టీచర్లుంటారు. ప్రైవేటు స్కూల్లో అయితే మంచి క్వాలిఫికేషన్ ఉండే టీచర్లు ఉండరు.ఇంక టీచింగ్ అంటావా.
రైతు భూమిలో విత్తనాలు చల్లుతూ పోతాడు. మంచి సారవంతమైన భూమిలో పడిన విత్తనాలు మంచి ఏపైన మొక్కలుగా ఎదుగుతాయి. అలాగే నిస్సారమైన భూమిలో పడిన విత్తనాలు సరిగా మొలకెత్తవు. మొలకెత్తినా సరిగా ఎదగవు. మనం చేయవలసిందల్లా మన బుద్ధిని చదువు మీద కేంద్రీకరించడమే.వాళ్ళు అందరికీ ఒకే పాఠాలు చెబుతారు. శ్రద్ధగా విన్నవాళ్ళు ఒంటబట్టించుకుంటారు.మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు.అంతే ”
అని ఒప్పించి మరీ ఆబడిలో చేరాడు. అక్కడ చేరినందుకు అతనెప్పుడూ బాధపడలేదు. పైగా వచ్చిన రెండు సంవత్సరాల్లోనే అక్కడి ఉపాధ్యాయుల అందరి అభిమానం చూరగొని పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాల లో రెండో స్థానంలో నిలిచాడు.

ఇప్పుడాబ్బాయి మంచి ఉద్యోగంలో సెటిలయ్యాడు. వాళ్ళ అమ్మమ్మ మాత్రం తన దగ్గరికి ఎవరొచ్చినా పై సంఘటన వివరించి మనవడి గురించి గొప్పగా చెబుతుంటుంది.

అచ్చం మీలానే ఉన్నాడు

ఒకాయన అప్పుడే పుట్టిన కొడుకును చూడటానికి హాస్పిటల్ కు వెళ్ళాడు.
ఆయన్ను చూస్తూనే డాక్టర్ “రండి సార్. మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో” అన్నాడు.
“ఆ ఊరుకోండి డాక్టర్ గారూ! మీరు ఏ అబ్బాయి నైనా అంతే అంటారు కదా”
“లేదండీ మీ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు”
“అలాగా మరి అబ్బాయి అందంగా లేకపోతే ఏమంటారు?”
“ఏముందీ! అబ్బాయి అచ్చు మీలాగే ఉన్నాడు సర్” అంటాం అన్నాడు డాక్టర్