చెప్పడం కాదు చేసి చూపించండి

ఒకసారి గాంధీజీ దక్షిణాఫ్రికా లో ఉండగా   ఒకావిడ తన కొడుకును వెంటబెట్టుకుని తీసుకువచ్చింది.
“వీడు స్వీట్స్ విపరీతంగా తింటున్నాడండీ.స్వీట్స్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి  అంత మంచిది కాదని నేను ఎంత చెప్పినా వినడం లేదు. మీరు చెబితేనైనా వింటాడని మీ దగ్గరికి తీసుకువచ్చానండీ” అంది.
“ఒక నెల తర్వాత తీసుకురండి. అప్పుడు చెబుతాను” అన్నాడు.
ఆమె ఆశ్చర్యంతో గాంధీజీ ఎందుకు అలా చెప్పాడో  ఆలోచిస్తూ వెళ్ళిపోయింది.
నెల తర్వాత మళ్ళీ వచ్చింది.అప్పుడు గాంధీజీ ఆ పిల్లవాడికి స్వీట్స్ తినడం తగ్గించమని చెప్పి కొన్ని సలహాలు కూడా ఇచ్చాడు.
ఈ మాత్రందానికి నెల రోజులు సమయం ఎందుకు. అనుకుంటున్నారా?
ఎందుకంటే గాంధీజీకి  కూడా స్వతహాగా స్వీట్స్ అంటే మక్కువ.తను కూడా ఎక్కువగానే తినేవారు.మొదటి సారి ఆమె కుర్రవాణ్ణి తీసుకు వచ్చినపుడు తను స్వీట్స్ బాగా తింటూ ఆ అబ్బాయికి సలహాలివ్వాలంటే ఆయనకు మనసొప్పలేదు. అందుకే ఆయన నెలరోజులపాటు స్వీట్స్ వాడకాన్ని తగ్గించి తరువాత ఆ అబ్బాయికి సలహా ఇచ్చాడన్న మాట.

ఎదుటి వాళ్ళకు నీతులు చెప్పేటప్పుడు మనం కూడా దాన్ని ఆచరించి చూపిస్తే బాగుంటుందన్నది ఈ సంఘటన ద్వారా నేను నేర్చుకున్న పాఠం.

ప్రకటనలు

9 thoughts on “చెప్పడం కాదు చేసి చూపించండి

 1. //ఎదుటి వాళ్ళకు నీతులు చెప్పేటప్పుడు మనం కూడా దాన్ని ఆచరించి చూపిస్తే బాగుంటుందన్నది ఈ సంఘటన ద్వారా నేను నేర్చుకున్న పాఠం.

  బాగా చెప్పారు.

  మీరు రాస్తున్నవి చాలా బాగున్నయి. ఒక్కోసారి చెంప మీద కొట్టినట్లు అనిపిస్తుంది. :).

  ధన్యవాదాలు

  • నేను ఇక్కడ రాసే విషయాలన్నీ నా ఆలోచనా థృక్పథాన్ని మార్చిన సంఘటనలు. అన్నీ సంపూర్ణంగా కాకపోయినా పాక్షికంగా అయినా అనుసరించడానికి ప్రయత్నిస్తాను. అలా నాకు నచ్చిన విషయాలను మీతో పంచుకుంటున్నానంతే…

 2. ఇలాగే వ్రాస్తూండండి. “చెంప మీద కొట్టినట్లు” అనిపిస్తుందంటే ఆ లోపాలు నాలో కూడా ఉన్నాయనే.

 3. chala santosham ga vunnadi! telugu lo imta manchi website ni nenu imta varaku chudaledu!
  kani okka vishayam, “chesi chupinchu” seershika lo, gandhiji avuno kado naku teliyadu kanee, Sri rama krishna paramahamsa gari vishayam lo jarigimdi ani nenu chadivanu… okkasari adi chudu… emainaaa ee nee prayatnam slaghaneeyam… [:)]

  • శ్రీనివాస్! నేను ఈ సంఘటన గాంధీజీ గురించే చదివాను. రామకృష్ణ పరమహంస కూడా అయిఉండవచ్చు.

   కానీ మంచి మాటలు ఎవరు చెబితే ఏముంది? సర్వదా అనుసరణీయాలు.

   ఎలాగైతేనేం నా బ్లాగ్ చూసినందుకు ధన్యావాదాలు.

 4. మీరు రాసిన కథలన్నీ ఈ రోజే చదివాను. అన్నీ ఎప్పుడో ఒకప్పుడు చదివినవే ఐనా కూడా మీరు వాటిని కొత్తగా ప్రెసెంట్ చేసిన విధానం బాగుంది. అభినందనలు

  • ధన్యవాదాలు లక్ష్మి గారూ!
   ఇక్కడ రాసిన కథలన్నీ నా స్వంతం కాదు. నేను ఎక్కడో చదివినవే. కానీ నన్ను ఆకట్టుకున్నవి. నా మనసును కదిలించినవి. నన్ను ఉత్తేజపరిచినవి. మీలో కొంత మంది వాటిని ఇదివరకే చదివుండవచ్చు.
   మీ అందరితో ఇలా పంచుకోవాలని మళ్ళీ ఇక్కడ రాశానంతే.

 5. నాకు కూడా ఇది బాగా నచ్చిన కధ. ఎప్పుడూ దృష్టిలో వుంచుంకుంటూనే ఉంటాను.

  మరోసారి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.