మీ మీద కూడా ఎవరైనా రాయి విసరాలా?

పిన్న వయసులోనే  కంపెనీ ఎక్జిక్యూటివ్ బాధ్యతలను స్వీకరించిన ఒక యువకుడు, తన సరికొత్త కారులో  వెళుతున్నాడు. కొత్త మోజులో మంచి హుషారు మీద వేగంగా నడుపుతూ వెళుతున్నాడు.  కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు మీద ఆడుకుంటున్న కొద్ది మంది పిల్లలు కనిపించే సరికి కారును కొద్దిగా స్లో చేశాడు.అందరు పిల్లలూ దూరంగా జరిగారు.
అకస్మాత్తుగా ఒక ఇటుక రాయి వచ్చి కారు సైడ్ డోరుకు తగిలింది. వెంటనే బ్రేకులు వేశాడు. ఎక్కణ్ణుంచి రాయి వచ్చి తగిలిందో అక్కడికి పోనిచ్చాడు. కోపంగా కారు దిగి అక్కడే నిలబడి ఉన్న ఒక అబ్బాయి కాలర్ పట్టుకుని వెనక్కి తోసి
“ఎవడ్రా నువ్వు? బుద్ధి లేదా నీకు? నువ్వేం చేశావో నీకు తెలుస్తోందా. కొత్త కారు కొని వారం రోజులు కూడా కాలేదు. నువ్వు రాయి విసిరిందానివల్ల నా కారుకు సొట్ట పడింది. దానికి నాకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? అసలెందుకు చేశావీ పని? ” ఆగ్రహంతో గద్దించాడు.
ఆ అబ్బాయి దీన స్వరంతో “క్షమించండి సర్. ఈ పరిస్థితిలో నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ రాయి విసిరితేనైనా ఎవరైనా ఆగి నాకు సహాయం చేస్తారేమోనని అలా చేయవలసి వచ్చింది.” ప్రాధేయపడ్డాడు.
ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుంటూ దగ్గర్లో పార్క్ చేసి ఉన్న ఒక కారు వేపు చూపించాడు. అక్కడ ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు.
“మా అన్న సార్. నడవలేడు. చక్రాల బండి మీద నుంచి క్రిందపడిపోయాడు. గాయాలు  బాగా తగిలాయి. రక్తం ఎక్కువగా కారిపోతోంది. చాలా సేపు ప్రయత్నించాను. ఒక్కణ్ణే ఎత్తలేకున్నాను. దయచేసి మా అన్నయ్యని వీల్ చైర్ లో కూర్చోబెట్టడానికి సహాయం చెయ్యండి సార్” బావురుమన్నాడా కుర్రవాడు.
ఆ ఎక్జిక్యూటివ్ కదిలిపోయాడు. వెంటనే క్రింద పడి ఉన్న అబ్బాయిని ఎత్తి కుర్చీలో కూర్చోబెట్టాడు. తగిలిన గాయాలను తన చేతిరుమాలుతో తుడిచి కట్లు కట్టాడు. అంతా ఓకే అయిందనుకున్న తర్వాత తిరిగి ఆ అబ్బాయి వైపు చూశాడు.
అతని మనస్సు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్ళతో “సమయానికి ఆదుకున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి సర్” అంటూ వీల్ చైర్ ను తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
ఆ ఎక్జిక్యూటివ్ మనసంతా ఒక అలౌకికమైన మధుర భావనతో నిండిపోయింది. ఒకరికి సాయం చేశామనే సంతృప్తి అనుభవిస్తేగానీ తెలియదు. అది మాటలకందని అనుభూతి. ఆ అబ్బాయి వెళుతున్నంత సేపూ అటువైపే చూస్తున్నాడు. భారంగా అడుగులు వేసుకుంటూ తన కారు దగ్గరికి వచ్చాడు. కారుకు సొట్టపడిన ప్రాంతాన్ని ప్రేమగా తడిమి చూశాడు. మరెప్పుడూ దాన్ని బాగు చేయాలని కూడా అతనికి అనిపించలేదు.

11 thoughts on “మీ మీద కూడా ఎవరైనా రాయి విసరాలా?

    • Sure….అలాగే.
      మీలాంటి భావ సారూప్యత గల వాళ్ళ కోసమే ఇలాంటి కథలు. ఆదరిస్తున్నందుకు ధన్యావాదాలు.

  1. నిజంగా మీరు గ్రేట్. ఇది చదువుతున్నపుడు కళ్ళు చెమర్చాయి.

    • ఆ కథ నేను చదవలేదు. అయినా ఈ కథ నా స్వంతం కాదు. ఎక్కడో చదివిన ఆంగ్ల కథకు అనువాదం మాత్రమే. 🙂

వ్యాఖ్యలను మూసివేసారు.