సోక్రటీసు మూడు ప్రశ్నల పరీక్ష

సోక్రటీసు ఒక గొప్ప జ్ఞాని. ఈ సంఘటన గాలివార్తలపై ఆయనకున్న థృక్పధాన్ని గురించి వివరిస్తుంది.
ఒక రోజు ఆయన ఇంట్లో ఉండగా ఒక స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మాటల మధ్యలో సోక్రటీసుని.
“మీ విద్యార్థి గురించి నేనొక చిత్రమైన విషయం విన్నాను. మీకు తెలుసా?” అని అడిగాడు.
” ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్పే విషయం నేను వినాలంటే, నేను పెట్టే మూడు ప్రశ్నల పరీక్షలో నువ్వు నెగ్గాల్సి ఉంటుంది. ఆ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు నువ్వు నాకు సంతృప్తి కరమైన సమాధానం ఇచ్చినా నాకు ఓకే” అన్నాడు సోక్రటీసు.
“మూడు ప్రశ్నలా! సరే అడగండి” అన్నాడా స్నేహితుడు.

“మొదటి ప్రశ్న నిజ నిర్ధారణకు సంబంధించింది. నువ్వు నా విద్యార్థి గురించి చెప్పబోయే ముందు, అది ఖచ్చితంగా నిజమేనని నిర్ధారణ చేసుకున్నావా?”
“లేదు! కానీ నేను ఇది చాలా మంది నోట విన్నాను……ఇంకా…” అనేదో చెప్పబోయాడు.
సోక్రటీసు అందుకుని “సరే! నా శిష్యుడి గురించి నీవు విన్నది నిజమో కాదో నీకు ఖచ్చితంగా తెలియదు. ఇంకా నీకు రెండు అవకాశాలున్నాయి.”

“ఇక రెండవ ప్రశ్న మంచితనానికి సంబంధించిన ప్రశ్న. నువ్వు నా విద్యార్థి గురించి చెబుతున్నది మంచి విషయమేనా?”
” కాదు. అందుకు పూర్తి వ్యతిరేకంగా….”
“చాలు. అంటే నా విద్యార్థి గురించి నిజమో కాదో తెలియని, చెడు విషయాన్ని నాకు చెప్పదులుచుకున్నావు.”
ఆ స్నేహితుడు భుజాలెగరేసి కొంచెం ఇబ్బంది పడ్డాడు.
“సరే నీకు ఇంకో అవకాశం కూడా ఉంది.”

” మూడవ ప్రశ్న ఉపయోగం గురించి. నువ్వు నాకు చెప్పబోయే విషయం నాకు ఏమైనా ఉపయోగపడేదేనా?”
“ఉపయోగం అంటే పెద్దగా ఉపయోగపడదు….కానీ ”
“అంటే నువ్వు చెప్పదలుచుకున్నది నిజమో కాదో నీకు తెలియదు. ఒక మంచి విషయమూ కాదు. నాకు ఉపయోగ పడేదీ కాదు. అలాంటప్పుడు నేను ఈ విషయం వినడంలో అర్థం లేదు” అని ముగించాడు.

ఆ స్నేహితుడు సిగ్గుతో చితికిపోయాడు. ఓడిపోయానని ఒప్పుకున్నాడు. అలాంటి తెలివితేటల వల్లనే సోక్రటీసు అందరి అభిమానాన్ని చూరగొన్నాడు.

కొసమెరుపు: “అలాంటి తెలివితేటలవల్లనే తన శిష్యుడైన ప్లేటో తన భార్యతో సాగిస్తున్న అక్రమ సంబంధం గురించి ఎప్పటికీ తెలుసుకోలేక పోయాడు”. 🙂

ఈ సంఘటన నేను చదివేంతవరకూ నా మిత్రులు చెప్పే గాసిప్స్ లో ఆసక్తి గా పాల్గొనేవాణ్ణి. ఆ హీరోయిన్ వాడితో కులుకుతోందనీ, ఫలానా హీరో పాడుపని చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడనీ …. ఇలా ఎన్నెన్నో అనవసరమైన వ్యర్థ ప్రలాపాలతో కాలక్షేపం చేసేవాడిని. వాటిలో నిజం ఎంతుందో మాకు తెలియదు. వాటిని గురించి చర్చించడం సమయం వృధా అనిపించింది. అందుకనే నేను ఇప్పుడు ఏదైనా గాసిప్ వినిపిస్తే సరదాగా నాకు నేనే ఈ పరీక్ష  పెట్టుకుంటూ సాధ్యమైనంతవరకూ అవాయిడ్ చెయ్యాలని ప్రయత్నిస్తుంటాను.